Share News

సిండికేట్ల హడావుడి కొన్ని చోట్ల కనిపించిన ప్రభావం

ABN , Publish Date - Oct 12 , 2024 | 04:09 AM

మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మొత్తం రెండు లక్షల దరఖాస్తులు.. ఫీజు కింద రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయని అధికారులు భావించారు. అయితే, కొన్నిచోట్ల సిండికేట్లు ప్రభావం చూపించడంతో అంచనా కంటే కొంత తగ్గువగా దరఖాస్తులు వచ్చాయి.

సిండికేట్ల హడావుడి కొన్ని చోట్ల కనిపించిన ప్రభావం

  • అంచనా కంటే 10,500 తక్కువగా దాఖలు

  • అనంతలో కొన్ని షాపులకు 2, 3 దరఖాస్తులే

(న్యూస్‌నెట్‌వర్క్‌-ఆంధ్రజ్యోతి)

మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మొత్తం రెండు లక్షల దరఖాస్తులు.. ఫీజు కింద రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయని అధికారులు భావించారు. అయితే, కొన్నిచోట్ల సిండికేట్లు ప్రభావం చూపించడంతో అంచనా కంటే కొంత తగ్గువగా దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం రాత్రి గడువు ముగిసేనాటికి మొత్తం 89,643 దరఖాస్తులు వచ్చాయి. రూ.1800 కోట్లు ఫీజు కింద లభించాయి. గత ప్రభుత్వ హయాంతో పోల్చితే ఈసారి మద్యం దరఖాస్తుల వ్యవహారంలో సిండికేట్ల హవా తక్కువగానే కనిపించింది. దీనివల్ల టార్గెట్‌ కంటే సుమారు పదివేల ఐదు వందలు తక్కువగా దరఖాస్తులు, దాదాపుగా రూ. 200 కోట్లు మేర ఆదాయం తగ్గింది. నేతల ఆదేశాలు.. బెదిరింపులు పనిచేసిన కొన్నిచోట్ల దరఖాస్తులు ఇవ్వడానికి వ్యాపారులు వెనుకాడారు.

పల్నాడు జిల్లాలో సిండికేట్‌ కారణంగా కొన్ని ప్రాంతాల్లో షాపుకు సగటున 20 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. బాపట్ల జిల్లాలో స్థానికులను తప్ప వేరేవారిని అడుగు పెట్టకుండా కొందరు నేతలు చక్రం తిప్పారు. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో షాపుకు 10 చొప్పునే దరఖాస్తులు వచ్చాయి. మాజీ మంత్రి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడి ఒక నియోజకవర్గంలో దుకాణాలకు 8, 9, 10, 11 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో 104 మద్యం దుకాణాలకు 2,241 దరఖాస్తులు అందులో కొన్ని నియోజకవర్గాల్లో కేవలం 10 నుంచి 13 చొప్పున మాత్రమే దరఖాస్తులు అందటం సిండికేట్‌ ప్రభావానికి నిదర్శనం. కృష్ణా జిల్లాలో మద్యం వ్యాపారుల కుమ్మక్కు ప్రభావం కొంత ఎక్కువ కనిపించింది. ఓ మునిసిపాలిటీలో 7 మద్యం దుకాణాలు ఉండగా 7, 13, 11, 9, 9, 8, 9 చొప్పున ఇక్కడ దరఖాస్తులు వచ్చాయి.


శ్రీసత్యసాయి జిల్లాలో ఎక్సైజ్‌ శాఖ కనీనం రెండు వేల దరఖాస్తులు వస్తాయని ఆశించగా, సిండికేట్‌ కారణంగా ఆ సంఖ్య కొంత తగ్గింది. కనాగానిపల్లిలోని ఓ మండలంలో ఒకే ఒక దుకాణం ఉంది. దీనికి కేవలం 4 దరఖాస్తులే రావడం గమనార్హం. అనంతపురం జిల్లాలో నిత్యం రాజకీయాలతో హాట్‌హాట్‌గా ఉండే ఒక పట్టణంలో 9 దుకాణాలు ఉండగా.. ఒక్కొక్క దుకాణానికి 3 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. రూరల్‌ మండలంలో 3 దుకాణాలు ఉండగా.. రెండింటికి 2 చొప్పున, ఒక దుకాణానికి 3 దరఖాస్తులు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే ఒకరు ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో దరఖాస్తులు తగ్గిపోయాయని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.

Updated Date - Oct 12 , 2024 | 04:09 AM