AP Elections: కొన్ని గంటల్లోనే అసలు ఘట్టం ప్రారంభం
ABN , Publish Date - May 11 , 2024 | 07:29 PM
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. అసలు ఘట్టానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
అమరావతి, మే 11: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. అసలు ఘట్టానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం 46,389 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
సమస్యాత్మక ప్రాంతాలు
అలాగే రాష్ట్రవ్యాప్తంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా 14 సెగ్మంట్లను గుర్తించారు. అందులో.. మాచర్ల, ఆళ్లగడ్డ, పెదకూరపాడు, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పీలేరు, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లి తదితర నియోజకవర్గాలు ఉన్నాయి.
వెబ్ కాస్టింగ్
ఆ యా సెగ్మంట్లలో 29,897 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల విధులకు 3.30 లక్షల మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అటు అసెంబ్లీకి, ఇటు లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ క్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి.. ఎన్నికల బరిలో నిలిచాయి. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలతోపాటు 25 లోక్‌సభ స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులను బరిలో దింపింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. చంద్రబాబునాయుడు బాదుడే బాదుడు, బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలను ప్రజల్లోకి చాలా బలంగా తీసుకు వెళ్లారు.
అలాగే ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర సైతం నిర్వహించారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల ప్రచారం చేశారు. అదే విధంగా బీజేపీ అగ్రనేతలు, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు సైతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
వైసీపీ
వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ సైతం.. మేము సిద్ధం పేరిట బస్సు యాత్రను నిర్వహించారు. వైసీపీ కూడా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది.
ఇండియా కూటమి
మరోవైపు ఇండియా కూటమి కాంగ్రెస్, సీపీఐ సీపీఎం సైతం రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ కూటమి తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీతారం ఏచూరి, వైయస్ షర్మిల తదితరులు ప్రచారం నిర్వహించారు. అయితే ఆ పార్టీకి ప్రజలకు పట్టం కట్టారనేది జూన్ 4వ తేదీన జరిగి ఓట్ల లెక్కింపు ద్వారా స్పష్టం కానుంది.