Balakrishna: హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. మెజారిటీ ఎంతంటే?
ABN , Publish Date - Jun 04 , 2024 | 04:20 PM
హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపైఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు...
హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై (TN Deepika) ఆయన 31,602 ఓట్లతో గెలుపొందారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం. ఎన్టీ రామారావు (Sr NTR) రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే కంచుకోటగా ఉన్న హిందూపురంలో.. బాలకృష్ణ 2014 నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014లో 81,543 ఓట్ల మెజార్టీతో విజయఢంకా మోగించిన ఆయన.. 2019లో 91,704 వేల ఓట్ల మెజార్టీతో అఖండ విజయాన్ని నమోదు చేశారు. అయితే.. 2019లో టీడీపీ ఓడిపోవడంతో బాలకృష్ణ ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఇప్పుడు 2024లోనూ సమీప వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికను భారీ మెజారిటీతో ఓడించి విజయకేతనం ఎగరవేశారు. దీంతో.. నందమూరి అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు.. బాలయ్యకు శుభాకాంక్షలు తెలపడం కోసం భారీఎత్తున ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. అక్కడ వారి సంబరాలు అంబరాన్ని అంటాయి.
బోల్తాపడిన ఎగ్జిట్ పోల్స్
ఎన్నికలు ముగిసిన తర్వాత కొన్ని ఏజెన్సీలు వైసీపీకి మద్దతుగా అంచనాలు ఇచ్చాయి. ఈసారి కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని, టీడీపీ కూటమికి ఓటమి తథ్యమని పేర్కొన్నాయి. ‘ఆరా’ సంస్థ అయితే ఈసారి వైసీపీ 49.1 శాతం ఓట్లతో 94-104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతోందని అంచనా వేసింది. అలాగే.. టీడీపీ కూటమి 47.55 శాతం ఓట్లతో 71-81 స్థానాలకు పరిమితం కాబోతోందని ఆరా మస్తాన్ తెలిపారు. సుమారు 2 శాతం ఓట్ల ఆధిక్యంతో టీడీపీ కంటే 20-25 స్థానాల్లో ఆధిక్యంతో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమని పేర్కొన్నారు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే.. ఆరా మస్తాన్‌వి పూర్తిగా తప్పుడు లెక్కలని తేలిపోయింది. వైనాట్ 175 అనే నినాదంతో బరిలోకి దిగిన వైసీపీ.. 10 స్థానాలకే పరిమితం కావాల్సిన దారుణ పరిస్థితి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, అభివృద్ధిని గాలికి వదిలేయడం, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చడమే.. వైఎస్ జగన్ ఘోర పతనానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.