YS Jagan: అయినా మారని జగన్.. మళ్లీ అవే అబద్ధాలు..
ABN , Publish Date - Nov 16 , 2024 | 05:32 AM
YS Jagan: జగన్ రోత పత్రికలో ఎప్పట్లాగే అప్పులపై అనేక అబద్ధాలు అచ్చేశారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం గద్దెదిగేనాటికి రాష్ట్ర అప్పులు 3.13 లక్షల కోట్లని... 2024లో తాను దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్లని ఆయనే చెప్పుకొన్నారు.
అధికారం పోయినా మారని జగన్ తీరు
అప్పులు, ఉద్యోగాలు, ప్రగతిపై అసత్యాలు
తప్పుడు లెక్కలతో తప్పుదోవ పట్టించే యత్నం
60 ఏళ్ల అప్పులను ఐదేళ్లలోనే చేసిన జగన్
అయినా... తానే గ్రేట్ అంటూ గొప్పలు
ఆయన దిగిపోయేనాటికి 10 లక్షల కోట్ల అప్పులు
పబ్లిక్ డెట్, పెండింగ్ బిల్లులు, కార్పొరేట్ రుణ భారం
6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కలరింగ్
వలంటీర్లు, ఆర్టీసీ కార్మికులు, మద్యం దుకాణాల్లో
పని చేసేవారూ ఆ లెక్కల్లోకే!
డిస్కమ్‌లను ముంచేసి.. ‘మేలు’ ముసుగు
అధికారంలోకి రావడానికి అబద్ధాలే ఆలంబన! అధికారంలోకి వచ్చాకా అబద్ధాలు! అధికారం పోయాకా అవే అబద్ధాలు! ఇదీ.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు! చంద్రబాబుకంటే తానే భేషైన పాలకుడినని, తనదే పురోగామి పాలన అని చెప్పుకొనేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగా అనేక అసత్యాలు, అర్ధసత్యాలతో కూడిన గణాంకాలను తన రోత పత్రిక ద్వారా జనంలోకి వదులుతున్నారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి): జగన్ రోత పత్రికలో ఎప్పట్లాగే అప్పులపై అనేక అబద్ధాలు అచ్చేశారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం గద్దెదిగేనాటికి రాష్ట్ర అప్పులు 3.13 లక్షల కోట్లని... 2024లో తాను దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్లని ఆయనే చెప్పుకొన్నారు. ఈ లెక్కే నిజమైనా.. 3.13 లక్షల కోట్ల రుణభారం 2014-19 మధ్య కొత్తగా వచ్చింది కాదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి 2014లో రాష్ట్ర విభజన జరిగాక సీమాంధ్ర వాటాగా వచ్చిన అప్పు, ఆ తర్వాత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన రుణం అన్నీ కలిపి రూ.3.13 లక్షల కోట్లు అని జగనే ఒప్పుకొన్నారు. అంటే... ఇది ఆరు దశాబ్దాల కాలంలో అయిన అప్పు. దీనిని జగన్ ఐదేళ్లలోనే రెట్టింపు చేసి... 6.46 లక్షల కోట్లకు చేర్చారు. ఇదొక రికార్డు. ఇంకా చెప్పాలంటే ఇది కూడా అర్ధసత్యమే! జగన్ సీఎంగా దిగిపోయేనాటికి రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లకు పైగానే ఉన్నాయి. 2023-24 మార్చి నాటికి పబ్లిక్ డెట్ దాదాపు రూ.5 లక్షల కోట్లు ఉంది. కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి తెచ్చుకుని వాడేసుకున్న అప్పు రూ.2.47 లక్షల కోట్లు! నాన్ గ్యారెంటీ అప్పులు రూ.1.06 లక్షల కోట్లు! కార్పొరేషన్ అప్పులూ ప్రభుత్వానివే అని ‘కాగ్’ కూడా స్పష్టం చేసింది. వీటితో పాటు జగన్ గుట్టలుగా పేర్చిన పెండింగ్ బిల్లులు రూ.1.75 లక్షల కోట్లకు పైమాటే! ఇవన్నీ కలిపితే జగన్ దిగిపోయేనాటికి రాష్ట్ర రుణభారం రూ.10 లక్షల కోట్లు దాటుతుంది.
తప్పుడు లెక్కలు...
కూటమి ప్రభుత్వం ఏటా రూ.74,000 కోట్ల అప్పు తీసుకోనుందని... తాను మాత్రం 47వేల కోట్లే తెచ్చానని జగన్ పేర్కొన్నారు. నిజానికి జగన్ హయాంలో ఏడాదికి సగటున రూ.60వేల కోట్ల వరకు అప్పులు తెచ్చారు. ఇవన్నీ కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం అనుమతిచ్చిన అప్పులే. ఈ అప్పులో అంతకుముందు చేసిన రుణాలకు సంబంధించిన అసలు వాటా కూడా చెల్లించాలి. జగన్ హయాంలో ఈ మొత్తం రూ.15,000 కోట్ల నుంచి రూ.18,000 కోట్ల వరకు ఉంది. అంటే... అప్పు తీర్చడం కోసం మళ్లీ అప్పు చేయడమన్న మాట! కానీ... దీనిని తాను చేసిన అప్పులో చూపించకుండా తాను తెచ్చింది రూ.47వేల కోట్లే అని బుకాయిస్తున్నారు. ఇదే సూత్రాన్ని కూటమి ప్రభుత్వానికి కూడా వర్తింప చేస్తే... ఈ ఆర్థిక సంవత్సరంలో చేసే అప్పు రూ.49,500 కోట్లే. జగన్ హయాంలో కార్పొరేషన్ల ద్వారా విచ్చలవిడిగా ఆఫ్ బడ్జెట్ అప్పులు తెచ్చారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కార్పొరేషన్లను అడ్డంపెట్టుకుని అడ్డగోలు అప్పులు తీసుకురాలేదు.
కేపిటల్ వ్యయంపై కథలు...
2019-24 మధ్యలో తాము 15,632 కోట్ల మూలధన వ్యయం చేసి, ఆస్తులు సృష్టించామని జగన్ గొప్పగా చెప్పుకొన్నారు. తన గురించి తాను అబద్ధం చెప్పుకోరు కాబట్టి అది నిజమే అనుకుందాం. కానీ... 2014-19 మధ్య మూలధన వ్యయం కేవలం 13,860 కోట్లు అని రోత పత్రికలో ప్రచురించారు. ఇది మరో పచ్చి అబద్ధం. 2018-19 ఒక్క ఏడాదిలోనే మూలధన వ్యయం రూ.20,400 కోట్లు అని ‘కాగ్’ రఽధువీకరించింది. 2014-19 మధ్య ఐదేళ్లలో మొత్తం కేపిటల్ ఎక్స్‌పెండిచర్ సుమారు లక్ష కోట్ల రూపాయలు. ఇవి... ‘కాగ్’ అధికారికంగా చెప్పిన లెక్కలు.
కొలువులపై కాకిలెక్కలు..
‘ఎవరి ప్రోగ్రెస్ ఏమిటి’ అంటూ జగన్ మరో జిమ్మిక్కు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ‘ఖాళీ’గా చూపించి... తాను మాత్రం 6.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా చెప్పారు. ‘వామ్మో ఇదేం లెక్క... ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చారనుకుంటున్నారా? అదే జగన్మాయ! 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అవన్నీ భర్తీ చేస్తామని జగన్ 2019 ఎన్నికల ముందు ఊదరగొట్టారు. కానీ... ఏపీపీఎస్సీ ద్వారా ఐదేళ్లలో ఆయన ఇచ్చిన రెగ్యులర్ ఉద్యోగాలు కేవలం ఐదువేలు. ఇక... 23వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి... ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. ఇటీవలి ఎన్నికల ముందు 6వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు కానీ, నియామకాలు జరగలేదు. కొత్తగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి... 1.34 లక్షల మందిని నియమించారు. ఇక... 2.6 లక్షల మంది వలంటీర్లనూ ‘ఉద్యోగుల’ ఖాతాలోనే వేసేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేసి... ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న 58వేల మంది కార్మికులకు తామే ‘ఉద్యోగాలు’ ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకొన్నారు. ఇంతటితో ఆగలేదు! ప్రభుత్వ మద్యం షాపుల్లో సేల్స్‌మెన్, సూపర్‌వైజర్లుగా ఉన్న 15వేల మందినీ ఉద్యోగులుగానే చూపించారు.
ఇలా రకరకాల మాయలు చేసి తాము 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకోవడం జగన్‌కే చెల్లింది. 2.31 లక్షల రెగ్యులర్ ఖాళీల్లో ఎన్ని భర్తీ చేశారు? ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? 23వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ఆయన... ఒక్క డీఎస్సీ అయినా ఇచ్చారా? వీటికి జగనే సమాధానం చెప్పాలి. ఇక... టీడీపీ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలు ‘ఖాళీ’ అని చెప్పడం గమనార్హం. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే 12,803 పోస్టులతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేసింది. 2018లో 7729 పోస్టులతో మరో డీఎస్సీ ప్రకటించింది. నియామక ప్రక్రియ అప్పుడే మొదలుకాగా... ఎన్నికల తర్వాత వైసీపీ హయాంలో ముగిసింది.
డిస్కమ్‌లను ఉద్ధరించారట..
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో డిస్కమ్‌ల నష్టాలు రూ.22వేల కోట్లకు పెరిగాయని, తన హయాంలో రూ.395 కోట్లు మాత్రమే నష్టపోయాయని జగన్ ఓ వింత లెక్క చెప్పారు. నిజానికి... 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి డిస్కమ్‌ల అప్పులు రూ.62,800 కోట్లు. జగన్ గద్దెనెక్కాక ఐదేళ్లలో ఆ మొత్తం 1.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక... తాము డిస్కమ్‌లకు 47,800 కోట్లు సహాయం చేయగా, చంద్రబాబు ప్రభుత్వం రూ.13,255 కోట్లే చేసిందని జగన్ మరో లెక్క చెప్పారు. వైసీపీ సర్కారు డిస్కమ్‌లకు ఏ సహాయమూ చేయలేదు. పైగా భారీగా బకాయిలు పెట్టింది. దీంతోపాటు ట్రూఅప్ చార్జీల పేరుతో జనానికి వరుస షాకులు ఇచ్చింది. ఈ పాపం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.