APMDC: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి సస్పెండ్..
ABN , Publish Date - Aug 01 , 2024 | 11:57 AM
ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక పర్మిట్లు ఇవ్వడంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం పేర్కొంది. అందుకనే ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళడానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేశారు. ఆయనపై ఇప్పటికే సీఐడీ విచారణ చేస్తోంది. రేపో మాపో ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కేంద్ర సర్వీస్‌ల నుంచి వచ్చిన వెంకట రెడ్డికి ఇవాళ్టితో డిప్యూటేషన్ పూర్తి కావాల్సి ఉంది. సస్పెండ్ చేయకపోతే రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. న్యాయ సలహా తీసుకుని గత రాత్రి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వెంకటరెడ్డి పై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి.
గత ప్రభుత్వంలో ఇసుక, బీచ్ శాండ్, బొగ్గు, గనుల వ్యవహారంలో వెంకటరెడ్డి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గనుల శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టడంతో అవన్నీ ఆరోపణలు కాదని.. నిజాలని తేలాయి. దీంతో వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేయాలని సీఎం చంద్రబాబుకు గనుల శాఖ ఉన్నతాధికారులు సిఫార్స్ చేశారు. దీంతో వెంకటరెడ్డి రిలీవ్ కావడానికి ముందే సస్పెండ్ చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలను వెంకట్‌రెడ్డి తూ. చా తప్పకుండా పాటించే వారనే ప్రచారం నాడు పెద్ద ఎత్తున నడిచింది. అంతేకాకుండా ఏపీఎండీసీ ఎండీగా వెంకటరెడ్డి తీసుకున్న పలు కీలక నిర్ణయాలు సైతం నాడు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం తర్వాత జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. తమకు అనుకూలంగా వ్యవహరించే ఉన్నతాధికారులందరినీ ఏపీకి తీసుకురావడం. ఆ తరువాత వారితో చేయించాల్సిన అరాచకాలన్నీ చేసింది. అలా కోస్ట్ గార్డ్స్‌లో పని చేసే వెంకటరెడ్డిని డిప్యూటేషన్‌పై జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకు వచ్చిందని ఓ ప్రచారం సైతం గతంలో సాగింది. ఆయనను ఏపీకి తీసుకొచ్చి అత్యంత ప్రాధాన్యమున్న ఏపీఎండీసీ ఎండీ సీటులో జగన్ కూర్చోబెట్టారు. అలాంటప్పుడు స్వామి భక్తి చాటకుండా ఎలా ఉంటారు. బీభత్సంగా చాటారు. జగన్ హయాంలో చాలా శాఖలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి కానీ గనుల శాఖపై మాత్రం పీక్స్‌లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ అవినీతి తీగ లాగింది. డొంకే కదిలొస్తోంది.