ఎన్నికల ముందూ అమరావతిపై జగన్ విషం!
ABN , Publish Date - Nov 24 , 2024 | 04:31 AM
మాజీ సీఎం జగన్ పదవిలో ఉన్నంత కాలం రాజధాని అమరావతిపై విషం చిమ్ముతూనే ఉన్నారు. ఈ ప్రాంతానికి నష్టం చేయడానికి ఎన్నికల ముందు వరకూ శాయశక్తులా ప్రయత్నించారు. అమరావతిపై కక్షతోనే కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి జగన్ తీవ్ర విముఖత ప్రదర్శించారు.
కేఆర్‌ఎంబీ కార్యాలయం విజయవాడలో ఏర్పాటుకు విముఖం
కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసిన మాజీ సీఎం
గత డిసెంబరులోనే తిరస్కరించిన జలశక్తి శాఖ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మాజీ సీఎం జగన్ పదవిలో ఉన్నంత కాలం రాజధాని అమరావతిపై విషం చిమ్ముతూనే ఉన్నారు. ఈ ప్రాంతానికి నష్టం చేయడానికి ఎన్నికల ముందు వరకూ శాయశక్తులా ప్రయత్నించారు. అమరావతిపై కక్షతోనే కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి జగన్ తీవ్ర విముఖత ప్రదర్శించారు. విశాఖలో కొత్తగా నిర్మిస్తున్న కార్యాలయంలో కేఆర్‌ఎంబీకి 9,200 చ.అ. స్థలం ఇస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే హైదరాబాద్ జలసౌధలో 17వేల చ.అ.తో కూడిన సువిశాలమైన కార్యాలయాన్ని అక్కడి ప్రభుత్వం కేటాయించిందని, విశాఖలో ఇస్తామన్న స్థలం తమకు ఏమాత్రం సరిపోదని బోర్డు స్పష్టం చేసింది. విశాఖకు బదిలీ అయిన తర్వాత ఇంకొంత స్థలం ఇస్తామని ప్రభుత్వం చెప్పినా అందుకు కేంద్ర జలశక్తి శాఖ సమ్మతించలేదు. 2023 డిసెంబరు 13న కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి రాసిన లేఖలో.. విశాఖపట్నానికి కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం తరలించడం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశమైనందున తరచూ సమావేశాలకు హాజరయ్యేందుకు, ప్రాజెక్టుల సందర్శనకు ప్రయాణపరమైన ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు. కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా ఆ లేఖలో తెలిపారు. ఈ లేఖ బహిర్గతం కాకపోవడంతో రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య ఈ ఏడాది ఫిబ్రవరి 5న, ఆగస్టు 7న విజయవాడలోనే కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం ఉండాలంటూ చేసిన వినతులను బోర్డు పరిగణనలోకి తీసుకుంది. వచ్చేనెల 3న జరగనున్న విస్తృతస్థాయి సమావేశంలో ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించనుంది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకి పట్టం కట్టినా విజయవాడ, గుంటూరు లోక్‌సభ స్థానాల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులను గెలిపించారు. ఆ ఉక్రోషమో, ఏమో జగన్ ఈ ప్రాంతంపై పగ పెంచుకున్నారు.