YS Jagan: పదైదు వేల గతం.. మరిచావా జగన్?
ABN , Publish Date - Sep 17 , 2024 | 04:34 AM
కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు వైఎస్ జగన్ యాగీ చేస్తున్నారు.
2019లో అధికారంలోకి వచ్చాక
ఏడు నెలలకు అమ్మఒడి అమలు
ఇప్పుడు 3 నెలలకే ఇవ్వలేదని గగ్గోలు
ఐదేళ్లలో నాలుగు సార్లే అమ్మఒడి జమ
ఒక ఏడాది ఇవ్వకుండా పక్కా ప్లాన్
ఇచ్చిన దాంట్లోనూ ఏటా అనేక కోతలు
కూటమి ప్రభుత్వంపై రెట్టింపు భారం
గతం మరిచి జగన్ వ్యంగ్య వ్యాఖ్యలు
‘‘నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాజీ సీఎం జగన్ గతం మర్చిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చాక తీరిగ్గా ఏడు నెలల తర్వాత ‘అమ్మఒడి’ పథకాన్ని అమలుచేసిన ఆయన.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే ‘తల్లికి వందనం’ పథకం అమలు కాలేదంటూ గగ్గోలు పెడుతున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత, విపక్ష నాయకుడు వైఎస్ జగన్ యాగీ చేస్తున్నారు. ఇటీవల గుంటూరు జైలు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు’’ అంటూ విచిత్రంగా ప్రవర్తించి.. కూటమి సర్కారుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల వేళ చేసిన ప్రచారంలోని కొన్ని మాటలను ఉదహరిస్తూ వాటికి హాస్యం జోడించి వ్యంగ్యంగా విమర్శలు చేశారు. అయితే, జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు అమ్మఒడి పథకాన్ని వెంటనే అమలు చేయకుండా తాత్సారం చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆగమేఘాలపై అమలుచేసి తీరాలని కోరుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అప్పుడు అలా:
2019, మే 30న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జూన్ 12న బడులు తెరుచుకున్నాయి. వాస్తవంగా బడులు తెరుచుకునే సమయంలో అమ్మఒడి విడుదల చేస్తే తల్లిదండ్రులకు ఉపయోగపడేది. కానీ, 7 నెలలు మౌనంగా ఉండి.. 2020, జనవరి 9న అమ్మఒడి నగదు విడుదల చేసింది. అది కూడా సంక్రాంతి పండగ సమయంలో ప్రజలకు ఈ నగదు ఉపయోగపడుతుందనే కోణంలో ఇస్తున్నట్లు అప్పట్లో వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఇలా
ఈ ఏడాది జూన్ 12న సీఎంగా చంద్రబాబు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజే బడులు తెరుచుకున్నాయి. అంటే, ప్రమాణ స్వీకారానికి, బడుల పునఃప్రారంభానికి మధ్య ఒక్క రోజు కూడా గడువు లేదు. పైగా ఈ ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఈ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. అందులోనూ విద్యా సంవత్సరం ప్రారంభమైనందున కొంత గడువు తర్వాత నిధులు విడుదల చేయాలని భావిస్తున్నారు. తల్లికి వందనం పథకం అమలుకు గతంతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లుల సంఖ్యను ఆధారంగా తీసుకుని అమ్మఒడి అమలుచేసింది. దీంతో ఏటా సుమారుగా 42 లక్షల మందికి ‘అమ్మఒడి’ నిధులు ఇచ్చారు. కానీ, ఇప్పుడు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపుగా 75 లక్షల మందికి ఈ పథకం కింద నిధులు ఇవ్వాలి. అంటే అప్పుడు చేసిన ఖర్చుతో పోలిస్తే రెట్టింపు అవుతుంది. అందువల్ల నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఐదేళ్లు.. నాలుగు విడతలే!
‘ఐదేళ్లలో ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తాం’ అని జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించారు. తీరా పదవీకాలం ముగిసే నాటికి కేవలం నాలుగు విడతల్లో రూ.60 వేలు కూడా ఇవ్వకుండా మాట తప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడి అమలుచేసి ఉంటే ఐదు సార్లు తల్లులకు నగదు వచ్చేది. కానీ, ఏడు నెలలు ఆలస్యం చేశారు. అలా రెండేళ్లు ఇచ్చారు. అదే కొనసాగించినా ఐదుసార్లు తల్లుల ఖాతాలకు వచ్చేది. కానీ.. ఒక ఏడాది ఎగ్గొట్టాలనే ప్లాన్‌తో మొదటి రెండేళ్లు సంక్రాంతి సమయంలో అమ్మఒడి విడుదల చేసిన ప్రభుత్వం మూడో ఏడాదికి ఏకంగా ఏడాదిన్నర గ్యాప్ తీసుకుంది. 2021 జనవరిలో అమ్మఒడి ఇచ్చిన తర్వాత 2022 జూన్‌లో ఇచ్చింది. దీంతో ఐదో విడత అమ్మఒడి నిధులు వేయకుండానే ఎన్నికలకు వెళ్లారు. ఫలితంగా ఐదేళ్లలో నాలుగు సార్లే తల్లులకు అమ్మఒడి నగదు అందింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం రూ.15 వేలు కూడా ఇవ్వలేదు. మొదటి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.14 వేలు, చివరి రెండేళ్లు రూ.13 వేలు చొప్పున ఇస్తూ వచ్చారు. ఇలా నిర్వహణ పేరుతో నగదులో కోత పెట్టారు. ఇవన్నీ మర్చిపోయిన జగన్ ఇప్పుడు మూడు నెలల్లోనే ‘తల్లికి వందనం’ ఇవ్వలేదని గగ్గోలు పెడుతుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కుట్టుకూలి.. కనికట్టు!
జగన్ హయాంలో విద్యార్థుల యూనిఫాంకు ఇస్తానన్న కుట్టుకూలి డబ్బులు ఎగ్గొట్టారు. ‘విద్యాకానుక’ పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి బ్యాగు, బెల్టుతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్ ఇచ్చారు. వాటికి అతితక్కువ కుట్టుకూలి నిర్ణయించారు. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు జతకు రూ.40 చొప్పున రూ.120... 9, 10 తరగతుల విద్యార్థులకు జతకు రూ.80 చొప్పున రూ.240 ఇస్తామన్నారు. టైలర్ ఖర్చుల భారం తల్లిదండ్రులపై పడకుండా, అది కూడా ప్రభుత్వమే ఇస్తుందని అప్పట్లో జగన్ ప్రకటించారు. అయితే నిధుల విడుదలను మాత్రం గాలికొదిలేశారు. ఆ నిధులు ఇస్తున్నట్లు విద్యాకానుక లెక్కల్లో చూపుతూ వచ్చారు. కానీ, ఐదేళ్లలో ఒక్కసారే తల్లుల ఖాతాల్లో కుట్టుకూలి డబ్బులు వేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 43 లక్షలుగా ఉంది. వీరికి కుట్టుకూలి కింద ఏడాదికి రూ.62 కోట్లు అవుతుంది. ఆ లెక్కన నాలుగేళ్లలో రూ.248 కోట్లు ఇవ్వాలి. కానీ ఒక్క ఏడాది మాత్రమే రూ.61.73 కోట్లు తల్లుల ఖాతాల్లో జమచేశారు. ఆ తర్వాత నిధులు ఇవ్వలేదు.