Share News

Flood Victim : కోలుకోలేని వరదదెబ్బ!

ABN , Publish Date - Sep 07 , 2024 | 04:54 AM

సంవత్సరాల తరబడి రెక్కల కష్టం కళ్ల ముందే బుడమేరు లాక్కెళ్లిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయత వారిది! తామైనా ప్రాణాలతో బయటపడతామో లేదోనని బిక్కుబిక్కుమంటూ వారంరోజులుగా గడుపుతున్నారు.

Flood Victim : కోలుకోలేని వరదదెబ్బ!

  • రెక్కల కష్టమంతా నీటిపాలు.. చిరు వ్యాపారులు, కూలీలు, మధ్యస్థ కుటుంబాలకు తీరని నష్టం

  • బురద, వరదనీటిలో ఇంటి సామగ్రి, పరికరాలు మళ్లీ పెరుగుతున్న బుడమేరు వరద

  • వారంగా మోకాలిలోతు నీటిలోనే...

(ఆంధ్రజ్యోతి - అమరావతి,

విజయవాడ, చిట్టినగర్‌)

సంవత్సరాల తరబడి రెక్కల కష్టం కళ్ల ముందే బుడమేరు లాక్కెళ్లిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయత వారిది! తామైనా ప్రాణాలతో బయటపడతామో లేదోనని బిక్కుబిక్కుమంటూ వారంరోజులుగా గడుపుతున్నారు. కాస్త వరద తగ్గి తెరిపినపడ్డామని అనుకునే లోపే, తిరిగి వరదనీరు వచ్చి చేరుతుండటంతో కష్టాలు తీరే తీరమే వారికి కనిపించడం లేదు. ప్రభుత్వం సత్వరం రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న సహాయక చర్యలు మాత్రమే వారికి ఊరట! నిజానికి, నాలుగు రోజుల క్రితమే భారీ వర్షాలు తగ్గిపోయాయి.

పైనుంచి వచ్చే వరద ఉధృతి క్రితంలా లేదు. అయినప్పటికీ విజయవాడ నగరంలోని ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం లేదు. బాధితుల కష్టాలు కడతేరడం లేదు. బుడమేరు వరద ఉధృతి కారణంగా ముంపును ఎదుర్కొంటున్న విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గాల్లోని ప్రాంతాలు ఇప్పటికీ వరద నీరుతో నానుతూనే ఉన్నాయి. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చే పనులు ఆలస్యమవుతుండటంతో విజయవాడ నగరం మీదకు ఇంకా వరద నీరు వస్తూనే ఉంది. ముంపు ప్రాంతాలైన వైఎ్‌సఆర్‌, జక్కంపూడి కాలనీలు, వాంబే కాలనీ, కేఎల్‌ రావు నగర్‌, సుందరయ్యనగర్‌, రాజీవ్‌నగర్‌, సింగ్‌నగర్‌, రామలింగేశ్వరనగర్‌, రాజరాజేశ్వరిపేట, ఆంధ్రప్రభ కాలనీ, ఉడా కాలనీ, ఇందిరానాయక్‌ నగర్‌, అంబాపురం, పాయకాపురం, కండ్రిక, పాతపాడు తదితర ప్రాంతాల్లోని కాలనీలు చాలావరకు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయడంతో చాలామంది బాఽధితులు పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు.

మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. కొన్ని ప్రాంతాల్లో అపార్టుమెంట్లలోని పై అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ముంపు ప్రాంతాల్లోని చాలా కాలనీలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేదు. చిమ్మచీకట్లలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మళ్లీ వరద నీరు పెరుగుతుందన్న వార్తలతో వారంతా తీవ్ర భయాందోళనలతో ఉన్నారు.


  • కడిగిన ఇళ్లలో మళ్లీ కన్నీళ్లు

  • తిరిగి వచ్చి చేరుతున్న వరద..ఖాళీ చేస్తున్న బాధితులు

ఇళ్లలోకి వచ్చిన నీరు గుమ్మాలకు చేరుకుంది. గుమ్మాల వద్ద ఉన్న నీరు మెట్ల దగ్గరకు దిగింది. రెండు రోజుల క్రితం ఉన్న పరిస్థితి ఇది. మెట్ల వద్ద ఉన్న నీరు రోడ్డు మీదకు వెళ్తుందని బాధితులు భావించారు. ఇది రివర్స్‌ అయింది. తగ్గినట్టే తగ్గిన వరద నీరు మళ్లీ పెరిగింది. బురద బాధ నుంచి తేరుకుంటున్న తరుణంలో వరద నీరు బాధితులను మరోసారి అందులోకి తోసేసింది. విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌, వాంబేకాలనీ, పైపుల రోడ్డు, డాబా కొట్టు సెంటర్‌లో వరదనీరు గురువారం క్రమంగా తగ్గింది. ఇళ్లలో ఉన్న నీరు బయటకు వచ్చేసింది. దీంతో బాధితులు గదులు, గోడలకు పట్టిన బురదను వరద నీటితోనే శుభ్రం చేసుకున్నారు. ఫైరింజన్‌ సిబ్బంది ఈ పనిలో వారికి సహకరించారు. ఇక బుడ మేరు వరద నీరు ఇక తగ్గిపోతుందని బాధితులు భావించారు. ఇంతలోనే.. గురువారం సాయంత్రం నుంచి వరదనీటిలో పెరుగుదల కనిపించింది. తర్వాత కాసేపటికి శుభ్రం చేసుకున్న ఇళ్లలోకి మళ్లీ వరదనీరు చేరింది. బాధితులను పెరిగిన నీరు మళ్లీ కన్నీళ్లు పెట్టించింది.


Untitled-15 copy.jpg

  • మోయలేని వరద ‘బండ’

‘‘మేం మొదటి అంతస్తులో ఉంటున్నాం. ఇంట్లో గ్యాస్‌ బండ అయిపోయింది. గ్యాస్‌ బండ తెచ్చుకుందామని మోకాలి లోతు నీటిలో ఉదయం బయటకు వచ్చాను. మా కాలనీ నుంచి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉండే పాల ఫ్యాక్టరీ (చిట్టినగర్‌) వరకు మధ్యాహ్నమైనా చేరలేకపోయాను. గ్యాస్‌ బండను తీసుకుని.. దానిని మోయలేక ఇలా వరద నీటిలో దొర్లించుకుంటూ వెళ్తున్నాను. మా కాలనీలో అపార్ట్‌మెంట్ల గ్రౌండ్‌ ఫ్లోర్‌ వరకు నీళ్లున్నాయి. ప్రభుత్వం నుంచి ఆహారం, పాలు, మంచినీళ్లు అందుతున్నాయి. మా కాలనీలో శుక్రవారం ఉదయం నుంచి మళ్లీ వరద పెరుగుతోంది’’

- సలోమి, గృహిణి, జక్కంపూడి కాలనీ


  • గొడ్డూగోదా వదిలేసి వచ్చాం

‘‘మాకు పాడి ఉంది. 10 పశువులను పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం. బుడమేరు కట్టపై వాటిని కట్టేశాం. ఎప్పటి లాగానే ఆదివారం (సెప్టెంబరు 1)ఉదయం పాలు తీశాను. వాటికి మేత పెట్టెందుకు వెళ్లినప్పుడు, వరద రావడం గమనించాను. అయితే, ఎప్పటి లాగానే చిన్న వరద అనుకున్నాను. కానీ నిమిషాల వ్యవధిలో వరద ఉధృతి పెరిగిపోయింది. ఇంట్లో మగాళ్లు కూడా ఆ సమయంలో లేరు. దీంతో నేను, మా కోడలు హడావిడిగా బంధువుల ఇంటికి వచ్చేశాం. పశువులను కట్టేసి ఉన్న తాళ్లను కూడా తీసే సమయం కూడా లేదు. కొద్దిసేపు మేం అక్కడే ఉంటే మేమూ ఆ వరదలో చిక్కుకుని కొట్టుకుపోయేవాళ్లం. చిన్న పడవ తీసుకుని మా ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. పశువులు ఉన్నాయో.. చనిపోయాయో తెలియడం లేదు.

- మహాలక్ష్మి, ఇందిరానగర్‌ కాలనీ


Untitled-15 copy.jpg

  • తెల్లారి ఆర్డర్‌ డెలివరీ.. ఇంతలోనే 15 లక్షల స్టాకు నీటిపాలు

‘‘నేనొక చిరు వ్యాపారిని. హోటల్‌ పొయ్యిల నిర్మాణానికి వినియోగించే సిమెంట్‌ (రీ ఫ్యాక్టరీ మెటీరియల్‌) దుకాణం నడుపుతున్నాను. ఆగస్టు చివరి వారంలో కాస్త పెద్ద ఆర్డర్‌ వచ్చింది. బంధుమిత్రుల దగ్గర చేబదుళ్లు తీసుకుని, ఇంట్లో ఉన్న నగా నట్రా కుదువపెట్టి మొత్తం రూ. 15 లక్షల విలువైన సిమెంట్‌ బస్తాలను తెప్పించాను. చిన్న రేకుల షెడ్డును అద్దెకు తీసుకుని అందులో స్టాకును నిల్వ చేశాను. తెల్లారి స్టాకు మొత్తం డెలివరీ చేయాలి. ఇంతలోనే ముప్పు ముంచుకొచ్చింది. రేకుల షెడ్డు బుడమేరు వరద ప్రవాహంలో మునిగిపోయింది. అందులో నిల్వ చేసిన రూ.15 లక్షల విలువైన సిమెంట్‌ బస్తాలు పాడైపోయాయి’’

- బీవీ శ్రీనివాసనాయుడు,

చిరు వ్యాపారి, కేఎల్‌ రావు నగర్‌


Untitled-15 copy.jpg

  • ఇంకెప్పటికి కోలుకుంటామో...

‘‘మా ఆయన (మాల్యాద్రి) ముఠా పనికి వెళతాడు. రూపాయి రూపాయి కూడబెట్టి కొడుకును చదివించుకున్నాం. మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా వాడు పనిచేస్తున్నాడు. ఇంట్లోకి కావల్సిన వస్తువులను సమకూర్చుకున్నాం. మా వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. అందుకోసం అప్పు చేసి రూ.మూడు లక్షలతో ఇంటిని బాగు చేసుకున్నాం. కొత్తగా పెయింట్లు వేయించాం. బుడమేరు వరద వచ్చి మా ఆశలన్నింటినీ ముంచేసింది. వస్తువులు తీసుకునేలోపలే అవన్నీ మునిగాయి. కష్టపడి కూడబెట్టుకున్నవన్నీ కళ్లముందే నీటిపాలవుతుంటే రెండురోజులు అన్నం కూడా తినబుద్ధి కాలేదు. ఏళ్ల తరబడి పేర్చుకున్న గూడు చెరిగిపోయింది. మళ్లీ మొదటికి వచ్చేశాం. ఇప్పుడు కష్టపడదామన్నా ఒంట్లో ఓపిక లేదు’’

- మోరబోయిన జయమ్మ, గృహిణి, ఊర్మిళానగర్‌, విజయవాడ

Updated Date - Sep 07 , 2024 | 04:54 AM