ప్రముఖ నాటక రచయిత బాదంగీర్ సాయి కన్నుమూత
ABN , Publish Date - Nov 22 , 2024 | 05:06 AM
ప్రముఖ నాటక రచయిత, రంగసాయి నాటక సంఘం, రంగసాయి నాటక గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏవీవీఎస్ మూర్తి (బాదంగీర్ సాయి) గురువారం సాయంత్రం కన్నుమూశారు.
‘రంగ స్థలం’ అభివృద్ధికి విశేష కృషి
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నాటక రచయిత, రంగసాయి నాటక సంఘం, రంగసాయి నాటక గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏవీవీఎస్ మూర్తి (బాదంగీర్ సాయి) గురువారం సాయంత్రం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మూడు నెలల కిందట బ్రెయిన్ స్ర్టోక్ రావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఇటీవల మరోసారి స్ర్టోక్ రావడంతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆయనకు భార్య హైమావతి, కుమారుడు వీరేశు, కుమార్తె నవ్య ఉన్నారు. పాలకొల్లు ప్రాంతానికి చెందిన బాదంగీర్ సాయి (63) నలభై ఏళ్ల కిందట వ్యాపారం నిమిత్తం విశాఖ వచ్చారు. అప్పటి నుంచి దసపల్లా హోటల్ సమీపంలో బాదంపాలు వ్యాపారం చేస్తూ వచ్చారు. విశాఖకు బాదంపాలును పరిచయం చేసిన ఆయన బాదంగీర్ సాయిగా పేరుగాంచారు. నాటక కళాకారుడైన సాయి.. విశాఖలో ఎక్కువ ప్రదర్శనలు జరిగేలా విశేషంగా కృషి చేశారు.
నాటక నిర్వాహకుడిగా, నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సురభి నాటకాలను విశాఖలో 40 రోజులపాటు ప్రదర్శింపజేసి అందరి మన్ననలు అందుకున్నారు. ప్రేక్షకాదరణ పొందిన అనేక నాటకాలను విశాఖలో ప్రదర్శింపజేసేందుకు 2010లో రంగ సాయి నాటక సంఘంను ఏర్పాటు చేశారు. మరుగునపడిన ఎన్నో నాటకాలను తెలుగు నాటక రంగ దినోత్సవం, ప్రపంచ నాటక రంగ దినోత్సవాల సందర్భంగా ప్రదర్శింపజేసేవారు. కళాకారులను ఘనంగా సత్కరించేవారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న చాలా మంది నాటక కళాకారులను ఆదుకున్నారు. నాటకాల పట్ల ఉన్న అభిరుచితో 10 వేల నాటక పుస్తకాలతో రంగసాయి నాటక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే తొలి నాటక గ్రంథాలయం. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మాధవధారలోని శ్మశానవాటిక లో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.