Share News

Kollu Ravindra: గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీల నిర్వీర్యం

ABN , Publish Date - Aug 23 , 2024 | 01:50 PM

గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నామని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Kollu Ravindra: గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీల నిర్వీర్యం

మచిలీపట్నం: గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నామని రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లి, చిన్నాపురం, తాళ్లపాలెంలో జరిగిన గ్రామసభల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు. గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు.


జిల్లాకు ఉపాధి హామీ కింద రూ.160 కోట్లు వచ్చాయని కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించనున్నామన్నారు. గతంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కూడా చంద్రబాబేనన్నారు. మచిలీపట్నం నియోజకవర్గానికి రూ.30 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టనున్నారు. రానున్న రెండు మూడేళ్లలోనే పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. బందరు మండలంలోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా తాగునీరు ఇస్తామన్నారు. జలజీవన్ మిషన్ కింద రూ.220 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు. భోగిరెడ్డిపల్లి, యాదర పరిసర ప్రాంతాల్లో 100 నుండి 150 ఎకరాల్లో చెరువును ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు.


ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కల్యాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఏ ప్రభుత్వమూ ఇప్పటి వరకూ తీసుకోని నిర్ణయాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవన్ తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవన్ నిధులు కేటాయించారు. స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునేందుకు గానూ గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధులను వంద నుంచి పదివేలు, 250 నుంచి 25 వేలకు పెంచుతూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహిస్తున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాలకు మహర్దశ వచ్చింది.

Updated Date - Aug 23 , 2024 | 01:55 PM