పీలిస్తే.. ప్రమాదమే
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:46 AM
దుమ్ము.. పొగతో వాయు కాలుష్యం. గుంటూరు నగరంలో రోజురోజుకు వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ, రోడ్లపై పేరుకుపోతున్న దుమ్ము ధూళి గాలిలో కలిసి పోతోంది. దీనిని పీలుస్తున్న నగరవాసులు అనారోగ్యాల బారిన పడుతున్నారు.
గాలిలో నాణ్యత అంతంతే
గుంటూరులో 50 కంటే దిగిరాని పీఎం10
నగరంలో 14 కూడళ్లలో అత్యధికంగా కాలుష్యం
ఫలితాలివ్వని జాతీయ స్వచ్ఛ వాయువు కార్యక్రమం
సంవత్సరం పీఎం10
2017-18 66
2018-19 49
2019-20 58
2020-21 56
2022-23 60
2023-24 61
2024-25(సెప్టెంబరు) 57
=== కాలుష్య కేంద్రాలు
- హిందూ కళాశాల కూడలి
- హిమని స్వీట్స్ సెంటర్
- రాధాకృష్ణ థియేటర్(పాతబస్టాండ్)
- ఆర్టీసీ బస్టాండ్
- కొత్తపేట భగతసింగ్బొమ్మ
- బోసుబొమ్మ
- ఎత్తురోడ్డు సెంటర్
- చుట్టుగుంట సర్కిల్
- అరండల్‌పేట 10వ లైను
- లాడ్జి సెంటర్
- బృందావనగార్డెన్స సర్కిల్
- మదర్ థెరిస్సా విగ్రహం కూడలి
- గుజ్జనగుండ్ల సర్కిల్
- గడ్డిపాడు రిలయన్స పెట్రోల్ బంకు సెంటర్
గుంటూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): దుమ్ము.. పొగతో వాయు కాలుష్యం. గుంటూరు నగరంలో రోజురోజుకు వాయు కాలుష్యం తీవ్రమవుతోంది. వాహనాల నుంచి వచ్చే పొగ, రోడ్లపై పేరుకుపోతున్న దుమ్ము ధూళి గాలిలో కలిసి పోతోంది. దీనిని పీలుస్తున్న నగరవాసులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. నగరంలో యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ(ఏఏక్యూ - పరిసరాల గాలి నాణ్యత) అంతంత మాత్రంగానే ఉంటున్నది. కేంద్ర కాలుష్య నియంత్రణ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే నగరంలో ప్రజలు పీల్చే గాలిలో స్వచ్ఛత అంతంత మాత్రమేనని తేలింది. పర్టిక్యులేట్ మ్యాటర్ 10 మైక్రోమీటర్ (పీఎం 10) కొంత తగ్గడం, మళ్లీ పెరుగుతోంది. కరోనా లాంటి లాక్‌డౌన రోజుల్లో కూడా గాలిలో కాలుష్యం కొనసాగిందంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. పరిశ్రమలు, రోడ్ల నిర్మాణాలకు రోజుల తరబడి కాలయాపన వంటి కారణాలతో గాలిలో దుమ్ము, ధూళి శాతం తగ్గడంలేదు. నేషనల్ క్లీన ఎయిర్ ప్రోగ్రాం కింద 2025 నాటికి పీఎం 10ని 30
శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఉన్న ఏఏక్యూ డేటాని ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ సంవత్సరంలో పీఎం 10 66గా ఉన్నది. 2018-19లో ఇది 49కి తగ్గింది. దాంతో నగరంలో ప్రజలు పీల్చే గాలి సురక్షితమైనదని తేలింది. అయితే 2019-20 నుంచి మళ్లీ పెరగడం ప్రారంభమైంది. నగరపాలక సంస్థకు జాతీయ స్వచ్ఛ వాయువు కార్యక్రమం కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిధులను కేటాయించినా ఆశించిన ఫలితం లేదు. 2019-20 నుంచి కేంద్రం ఇప్పటివరకు రూ.17.343 కోట్లు విడుదల చేయగా అందులో కేవలం రూ.10.589 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఈ నిధులతో గాలిలో నాణ్యత పెంచడానికి, వేస్టు, బయోమాస్ డంపింగ్, పరిశ్రమలు, వాహనాలు, రోడ్ల నిర్మాణం, కూల్చివేతలు వంటి వాటిల్లో దుమ్ము, ధూళి శాతం తగ్గించడానికి వినియోగించాలని స్పష్టం చేసింది. అయితే గత ఐదేళ్లలో మార్పు రాలేదు. నగరంలో ట్రాఫిక్ పోలీసు, రవాణాశాఖ అఽధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి కాలుష్యం వెదజల్లే 14 హాట్స్పాట్లను గుర్తించారు. ఇందులో కొన్ని నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఉండటం విశేషం.
మేల్కోకపోతే ముప్పే
ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్న దృష్ట్యా ప్రభుత్వ శాఖలు, ఎనజీవోలు, ప్రజలు మేల్కోవాలి. కాలుష్యానికి కారణమౌతున్న వాటిని నిరోధించాలి. ముఖ్యంగా గూడ్స్ వాహనాలపై టార్పాలిన పట్టాలు కప్పేలా చూడాలి. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా ఆంక్షలు విధించాలి. సిగ్నల్ లైట్ల వద్ద వాహనాల ఇంజన్లు ఆపి గ్రీనసిగ్నల్ పడడానికి నాలుగైదు సెకన్ల ముందుగా స్టార్ట్ చేసుకునేలా చూడాలి. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చాలి. ప్రజా రవాణాలో సీఎనజీ వాహనాల సంఖ్యని పెంచేలా చూడాలి. పరిశ్రమలు, క్వారీలను పర్యవేక్షిస్తూ కాలుష్య కారకాలను వెదజల్లకుండా చూడాలి.