Share News

ప్రకృతిని ప్రేమిద్దాం.. కాపాడుదాం

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:42 AM

ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలని, దానిని కాపాడాలని కలెక్టర్‌ వెంకటమురళి పిలుపిచ్చారు. అటవీశాఖా ఆధ్వర్యంలో సూర్యలంక సముద్రతీరంలో బుధవారం కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రకృతిని ప్రేమిద్దాం.. కాపాడుదాం
సూర్యలంక తీరంలో మొక్కలు నాటి నీరు పోస్తున్న కలెక్టర్‌ జె.వెంకటమురళి.

భావితరాలకు మంచి పర్యావరణాన్ని ఇవ్వాలి

కార్తీక వనసమారాధానలో కలెక్టర్‌ వెంకటమురళి

బాపట్ల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలని, దానిని కాపాడాలని కలెక్టర్‌ వెంకటమురళి పిలుపిచ్చారు. అటవీశాఖా ఆధ్వర్యంలో సూర్యలంక సముద్రతీరంలో బుధవారం కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటి నీరు పోశారు. అధికారులతో కూడా మొక్కలు నాటించారు. తదుపరి అధికారులతో కలిసి కార్తీక వన భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలన్నారు. రాబోయే తరాలకు మంచి పర్యావరణం అందించడానికి ఇప్పుడు నాటే మొక్కలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ప్రకృతిని ప్రేమించి చెట్లను, జంతువులను, పక్షులను సంరక్షించాలన్నారు. పరిశ్రమల స్థాపనతో గడిచిన 155 ఏళ్ళల్లో ప్రపంచవ్యాప్తంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందన్నారు. ఉష్ణోగ్రతలలో మార్పులను నియంత్రించాలంటే విరివిగా మొక్కలను నాటాలన్నారు. అటవీశాఖ ద్వారా జిల్లాలో 63 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌, అటవీశాఖాధికారి భీమయ్య, ఆర్డీవో పి.గ్లోరియా, మున్సిపల్‌ కమిషనర్‌ జి.రఘునాఽథరెడ్డి, డీపీవో ప్రభాకర్‌, తహసీల్దార్‌ షేక్‌.సలీమా, వ్యవసాయాధికారి ఎ.రామకృష్ణ, డీఎంహెచవో డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి

తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రాణనష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జె.వెంకటమురళి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారే అవకాశం ఉందన్నారు. ఈ నెల 27 వరకు మత్స్యకారులను వేటకు వెళ్ళనివ్వరాదని చెప్పారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెంటనే బయటకు పిలిపించాలని ఆదేశించారు. ధాన్యాన్ని 22 నుంచి 27వ తేదీ వరకు కోయరాదన్నారు. భారీవర్షాలతో లోతట్టుప్రాంతాలు మునిగితే తక్షణమే ఆ ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు మండల కేంద్రాల్లోనే విధిగా నివాసం ఉండాలన్నారు. ఎంపీడీవోలు మండలాలు విడిచి వెళ్ళరాదన్నారు. సహాయక చర్యల కొరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులు, పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాలలో ఉంచుకోవాలన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:42 AM