Share News

రయ్‌..రయ్‌.. నెరవేరిన చిలకలూరిపేట వాసుల ఆకాంక్ష..

ABN , Publish Date - Nov 13 , 2024 | 01:02 AM

సర్వాంగ సుందరంగా.. అధునాతనంగా.. ఆహ్లాదకరంగా.. రక్షణాత్మకంగా.. పర్యావరణహితంగా.. చిలకలూరిపేట బైపాస్‌ అందుబాటులోకి వచ్చేసింది. ఎన్నో ఏళ్లుగా.. చిలకలూరిపేటవాసుల కలగా.. చిలకలూరిపేట మీదగా రాకపోకలు సాగిస్తూ ఇబ్బంది పడే వారి కష్టాలను తీరుస్తూ ఎట్టకేలకు బైపాస్‌ నిర్మాణం జరిగింది.

రయ్‌..రయ్‌.. నెరవేరిన చిలకలూరిపేట వాసుల ఆకాంక్ష..
పూర్తయిన చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డు

సుందరంగా చిలకలూరిపేట బైపాస్‌

దేశంలోనే మొదటి మోడల్‌ బైపాస్‌ రోడ్డు

ఈ నెలాఖరులో ప్రారంభించడానికి సన్నాహాలు

చిలకలూరిపేటకు మణిహారంగా రోడ్డు నిర్మాణం

సర్వాంగ సుందరంగా.. అధునాతనంగా.. ఆహ్లాదకరంగా.. రక్షణాత్మకంగా.. పర్యావరణహితంగా.. చిలకలూరిపేట బైపాస్‌ అందుబాటులోకి వచ్చేసింది. ఎన్నో ఏళ్లుగా.. చిలకలూరిపేటవాసుల కలగా.. చిలకలూరిపేట మీదగా రాకపోకలు సాగిస్తూ ఇబ్బంది పడే వారి కష్టాలను తీరుస్తూ ఎట్టకేలకు బైపాస్‌ నిర్మాణం జరిగింది. 16వ నంబరు జాతీయ రహదారిపై గుంటూరు, ఒంగోలు మధ్య చిలకలూరిపేట పట్టణాన్ని బైపాస్‌ చేస్తూ సుమారు రూ.వెయ్యి కోట్ల వ్యయంతో 16.384 కిలోమీటర్ల మేర ఆరు వరుసల్లో నిర్మాణం చేశారు. దేశంలోనే మొదటిసారిగా మోడల్‌ బైపాస్‌గా రూపొందించిన చిలకలూరిపేట ఈ రోడ్డుపై వాహనదారులు రయ్‌రయ్‌మంటూ త్వరలో ప్రయాణించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో నిర్మాణం జరిగిన బైపాస్‌ను ఈ నెలాఖరుకు ప్రారంభించే అవకాశం ఉంది.

చిలకలూరిపేట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా ఎన్నో సవాళ్లు.. మరెన్నో అవాంతరాలను అధిగమించి ఎట్టకేలకు చిలకలూరిపేట బైపాస్‌ రహదారి అందుబాటులోకి వచ్చేసింది. జాతీయ రహదారిపై మార్టూరు గుంటూరు మధ్య రామచంద్రాపురం వద్ద ప్రారంభమై తిమ్మాపురం గ్రామం వరకు నిర్మాణం జరిగింది. బైపాస్‌ రోడ్డు భూసేకరణకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేయగా, రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేశారు. సర్వాంగ సుందరంగా, వాహనదారులకు ఇబ్బంది లేని రీతిలో బైపాస్‌ రోడ్డు నిర్మించారు. ఈ మార్గంలో ఓగేరు, కుప్పగంజి వాగులపై రెండు వంతెనలను నిర్మించారు. ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ ల వద్ద విద్యుత దీపాలను ఏర్పాటు చేశారు. బొప్పూడి, పురుషోత్తమపట్నం, చిలకలూరిపేట, గణపవరం, నాదెండ్ల వద్ద అండర్‌ పాస్‌ల నిర్మాణం చేశారు. బొప్పూడి, కోటప్పకొండ, గణపవరం, నాదెండ్ల ప్రాంతాల్లో 8 బస్‌ షెల్టర్లు నిర్మించారు. రోడ్డుకు ఒకవైపున ప్రధాన సర్వీస్‌ రోడ్డు ఉంటుంది. అండర్‌ పాస్‌ల వద్ద రెండు వైపులా సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్లు 15 సంవత్సరాల పాటు ఈ రోడ్డు నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుంది. బైపాస్‌ రోడ్డుకు రెండు వైపులా 16 కిలోమీటర్ల పొడవునా శాశ్వత గోడ నిర్మాణం చేశారు. పశువులు రోడ్డుపైకి రాకుండా ఉండడానికి, ఆక్రమణలను అరికట్టడానికి, ప్రమాదాల నివారణకు ఈ గోడను నిర్మించారు. రోడ్డు పక్కన గణపవరం వద్ద హైవేస్‌కు చెందిన విశాలమైన ప్రదేశం రెండు చోట్ల ఉంది. దీంతో దానిని సద్వినియోగం చేసుకునేందుకు ఒక మెగా వాట్‌ సోలార్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సోలార్‌ ప్లేట్లను బిగిస్తున్నారు. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుతను పగటి వేళలో గ్రిడ్‌కు అనుసంధానం చేసి, రాత్రిళ్లు రోడ్డుపై లైట్ల వెలుగులకు వినియోగించనున్నారు. బైపాస్‌ రోడ్డు పొడవునా ఒకవైపున 3,500 మొక్కలను నాటుతున్నారు. వాటిలో గానుగ, వేప, నల్లమద్ది, గుల్మోరా, పెంట్‌ ఫామ్‌ జాతుల మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు ట్రీ గార్డును ఏర్పాటు చేస్తున్నారు. వీటికి నిత్యం నీటిని అందించి సంరక్షించేందుకు రెండు చోట్ల బోరు పాయింట్లు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ఏర్పాటు చేశారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లపై కాగితం పూల మొక్కలను నాటారు.

బైపాస్‌ రోడ్డు ప్రత్యేకతలు

- చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డుకు రెండు వైపులా 16 కిలోమీటర్ల పొడవునా శాశ్వత గోడ నిర్మాణం.

- గణపవరం వద్ద విశాలమైన ప్రదేశంలో రెండు చోట్ల ఒక మెగా వాట్‌ సోలార్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు.

- రోడ్డు పొడవునా ఒకవైపున ట్రీ గార్డులతో 3,500 మొక్కలను నాటుతున్నారు. డివైడర్లపై కాగితం పూల మొక్కలను నాటారు.

- బైపాస్‌ రోడ్డులో అత్యంత ఆధునాతనమైన ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కెమెరాల ఏర్పాటు చేశారు.

- ఒంగోలు గుంటూరు మధ్య ప్రయాణం చేసే వాహనదారులకు సుమారు 30 నిమిషాల సమయం ఆదా.

- మొత్తం మూడు ఫ్లై ఓవర్లు, ఆరు అండర్‌ పాస్‌ల నిర్మాణం

నాణ్యతా ప్రమాణాల తనిఖీలు

రోడ్డు నిర్మాణం పనులు పూర్తయినట్లుగా బీఎస్‌సీపీఎల్‌ కంపెనీ కాంట్రాక్టర్లు నేషనల్‌ హైవే సంస్థకు నివేదించారు. దీంతో హైవేస్‌ అధికారులు పనుల నాణ్యతా ప్రమాణాల పరిశీలన చేస్తున్నారు. పరిశీలన అనంతరం రోడ్డు ప్రారంబోత్సవానికి పచ్చజెండా ఊపుతారు. ఇప్పటికే నేషనల్‌ హైవేస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పార్వతీశం ఆధ్వర్యంలో రోడ్డు తనిఖీ జరిగింది. బైపాస్‌ రోడ్డులో అత్యంత ఆధునాతనమైన ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కెమెరాల ఏర్పాటు జరిగింది. వాహనాల వేగంపై కన్నేసి ఉంచేందుకు ప్రత్యేక పరికరాలు బిగించారు. ఎప్పటికప్పుడు ఈ సమాచారం గుంటూరు విజయవాడ మధ్య ఉన్న కాజ టోల్గేట్‌ వద్దకు చేరే విధంగా ఏర్పాటు జరిగింది.

టోల్‌గేట్‌లేని మార్గంగా బైపాస్‌

చిలకలూరిపేట వద్ద బైపాస్‌ రోడ్డు నిర్మాణం పూర్తయినా ఈ మార్గంలో టోల్‌గేట్‌ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వ్యయాన్ని రాబట్టుకోవడానికి గుంటూరు విజయవాడ మధ్య ఉన్న కాజ టోల్‌గేట్‌ వద్ద రేట్లను పెంచవచ్చని సమాచారం.

చిలకలూరిపేట ప్రజలకు తప్పిన తిప్పలు

బైపాస్‌ రోడ్డుపై అధికారికంగా రాకపోకలకు అనుమతిస్తే చిలకలూరిపేట ప్రజలకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం పట్టణం మధ్యగా వెళ్లే జాతీయ రహదారిపై మూడు ప్రధాన సెంటర్లలో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నది. దీనివల్ల ఒంగోలు గుంటూరు మధ్య ప్రయాణం చేసే వారికి సుమారు 30 నిమిషాల సమయం వృథా అవుతున్నది. పట్టణ ప్రజలు రోడ్డు దాటి వెళ్లాలంటే కనీసం 20 నిమిషాల సమయం పడుతున్నది. దీనికి తోడు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. బైపాస్‌ రోడ్డును ప్రారంభిస్తే అధిక శాతం వాహనాలు ఆ

మార్గంలో వెళ్తాయి కాబట్టి పట్టణ ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోతాయి. కాలుష్యం సమస్యకు కూడా తెరపడుతుంది.

Updated Date - Nov 13 , 2024 | 07:13 AM