పల్లెపండుగ పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:46 AM
పల్లెపండుగలో భాగంగా మంజూరు చేసిన మౌలిక సౌకర్యాల అభివృద్ధి పనులు వెంటనే పూర్తి అయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు.
అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్న కలెక్టర్
పెదకాకాని, కొప్పురావూరు, ఉప్పలపాడులో నాగలక్ష్మి పర్యటన
పెదకాకాని, నవంబర్ 13( ఆంధ్రజ్యోతి): పల్లెపండుగలో భాగంగా మంజూరు చేసిన మౌలిక సౌకర్యాల అభివృద్ధి పనులు వెంటనే పూర్తి అయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు.బుధవారం మండలంలోని పెదకాకాని, కొప్పురావూరు, ఉప్పలపాడు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. పెదకాకానిలో అంగన్వాడీ కేంద్రంలో నిర్మిస్తున్న రూఫ్‌టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణాన్ని, పోషణ్ వాటికకు గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ చిన్నారులకు ఇంగ్లీష్ అక్షరాలు, రంగుల గుర్తించడంలో వారి సామర్థ్యాలను పరీక్షించారు. చిన్నారులకు ఆంగ్ల అక్షరాలు, పాటలు, రంగులపై అర్థమయ్యేలా బోధన చేయాలని అంగన్వాడీ టీచర్‌కు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు సక్రమంగా సరుకులు సరఫరా అయ్యేలా సూపర్వైజర్లు, ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. పుష్పరాజ్‌కాలనీలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. పనులు వేగవంతంగా నిర్వహించి నిర్ధేశిత సమయంలో పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పల్లెపండుగలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేసిన సీసీ రోడ్డు, కాల్వల నిర్మాణ పనులు పూర్తి చేసిన ఆనలైన్‌లో అప్లోడ్ చేయాలన్నారు. పెదకాకానిలో స్థానికులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొప్పురావూరులో నిర్మిస్తున్న పశువుల పాకను కలెక్టర్ పరిశీలించి, లబ్థిదారుల ఆదాయ వివరాల గురించి తెలుసుకున్నారు. కుక్కలు, కోతుల బెడదా ఎక్కువుగా ఉందని, పొగాకు కాలుష్యంపై గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే లైనును గ్రామం మధ్యలో నుంచి కాకుండా మార్చాలని కోరారు. పొగాకు ఫ్యాక్టరీకి సంబంధించి కాలుష్య నియంత్రణ అధికారులతో తనిఖీ చేయిస్తామని కలెక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఉప్పలపాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న రూఫ్‌టాప్ రైయిన్ వాటర్ హార్వెస్టింగ్‌స్ట్రక్చర్ పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. డిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న, స్వర్ణాంధ్ర విజన్ ప్రేరణలో బహుమతులు సాధించిన, జాతీయ స్థాయిలో వాలీబాల్, హ్యండ్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు. గ్రామంలో జరుగుతున్న ఇళ్ళ జియో ట్యాగింగ్, ఎన్‌సీపీ సర్వేను కలెక్టర్ పరిశీలించారు.పాఠశాల రోడ్డు సక్రమంగా లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా ప్రతిపాదనలు సిద్థం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జ్యోతి బసు, డ్వామా పీడీ శంకరరావు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ బ్రహ్మయ్య, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ కృష్ణకాంత్, ఎంపీడీవో రమావత్ శ్రీనివాసరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కామినేని శ్రీనివాసరావు, ఎంపీటీసీ మోపర్తి శ్రీనివాసరావు,సర్పంచలు గోళ్ళ స్వరుపారాణి, ఆలా సాంబశివరావు,కే శ్రీనివాసరావు, వలివేటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.