అధికారులు మిషన్‌మోడ్‌లో పనిచేయాలి
ABN , Publish Date - Nov 20 , 2024 | 01:13 AM
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించటానికి అధికారులు మిషన్‌మోడ్‌లో పని చేయాలని కలెక్టర్ జె.వెంకటమురళి ఆదేశించారు.
బాపట్ల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించటానికి అధికారులు మిషన్‌మోడ్‌లో పని చేయాలని కలెక్టర్ జె.వెంకటమురళి ఆదేశించారు. డీడబ్ల్యుఎస్‌ఎం (డిస్ర్టిక్ వాటర్ శానిటేషన్ మిషన్) జిల్లా స్థాయి కమిటీ తొలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. కమిటీకి కన్వీనర్‌గా ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ వ్యవహరించగా 14 జిల్లా శాఖల అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారని కలెక్టర్ ప్రకటించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించటం, వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం పగడ్భంధీగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 3.64 లక్షల గృహాలు ఉండగా 1.48 లక్షల గృహాలకు కుళాయిలు బిగించినట్లు తెలిపారు. మిగిలిన 2.16 లక్షల గృహాలకు కనెక్షన్‌లు ఇవ్వలేదన్నారు. జలజీవన్‌మిషన్ కింద జిల్లాకు మంజూరైన పనులలో పెండింగ్ పనులు 994 చేపట్టటానికి అనుమతి పొందాల్సి ఉందన్నారు. రూ.587 కోట్ల నిధులతో పనులు ప్రారంభించటానికి ప్రభుత్వం నుంచి తిరిగి అనుమతి పొందేలా నివేదించాలన్నారు. జిల్లాలో 960 ఆవాస ప్రాంతాలు ఉండగా అందులో 369 పిడబ్ల్యుఎస్ పథకాలు, 25 సిపి డబ్ల్యుఎస్ పథకాలు, 5083 చేతిపంపులు మనుగడలో ఉన్నాయన్నారు. సీపీడబ్ల్యు పథకాల నిర్వహణ, మరమ్మతులకు 6.9కోట్ల రూపాయల నిధులు కావాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాపరిషత్ నిధులతో పనులు చేపట్టాలన్నారు. జలజీవన్‌మిషన్ కింద పెండింగ్‌లో ఉన్న పనులన్ని మంజూరు కొరకు ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించారు. గ్రామాలన్నిటిలో పారిశుధ్య పనులు పగడ్భంధీగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో కన్వీనర్ ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ అనంతరాజు, అనుబంధశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.