తీరంలో విస్తృతంగా మొక్కలు నాటాలి
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:31 AM
సూర్యలంక సముద్రతీరం వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు విస్తృతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు.
బాపట్ల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : సూర్యలంక సముద్రతీరం వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం కొరకు విస్తృతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. అధికారులతో కలిసి శనివారం ఆయన సూర్యలంక సముద్రతీరాన్ని సందర్శించారు. కార్తీక మాసంలో తీరానికి విస్తృతంగా పర్యాటకులు, భక్తులు వస్తున్నందున ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నందున బీచ్ వద్ద గజ ఈతగాళ్ళను ఉంచామన్నారు. స్నానాలకు ఏర్పాట్లు, దుస్తులు మార్చుకోవటానికి చేసిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటి పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పెంచేలా తీర్చిదిద్దాలన్నారు. బాపట్ల పరిధిలోని సూర్యలంక, ఓడరేవు, రామాపురం, పాండురంగాపురం బీచ్‌లు పర్యాటకులను ఆకట్టుకునేలా చేయాలన్నారు. డ్వామా, అటవీశాఖాధికారులు సంయుక్తంగా ఫైలెట్ ప్రాజెక్ట్ కింద 20 వేల మొక్కలు నాటాలన్నారు. బీచ్ వద్ద కనీసం 10 ఎకరాలలో మొక్కలు నాటటానికి చర్యలు తీసుకోవాలన్నారు. సముద్ర మత్స్యసంపద విక్రయాలను పరిశీలించి వసతి సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విజయలక్ష్మి, అటవీశాఖాధికారి భీమయ్య, తహసీల్దార్ షేక్ సలీమా తదితరులు పాల్గొన్నారు.