ఉచిత ఇసుకేది?
ABN , Publish Date - Nov 24 , 2024 | 01:17 AM
‘ప్రభుత్వం ఉచితంగా ఇసుక అంటుంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ.. ఎప్పుడు.. ఎవరికి ఇచ్చారో చెప్పాలి. ఇసుక రీచ్‌లకు రౌడీలను కాపాలాపెట్టి లోపలికి వస్తే కాళ్లు విరగ్గొడతాం అంటున్నారు.
జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ధ్వజం
నూరుశాతం ఈ-క్రాప్ బాధ్యత వ్యవసాయశాఖదే
ఎన్నికల తర్వాత అందరూ ఒకటే : కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని
గుంటూరు సిటీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వం ఉచితంగా ఇసుక అంటుంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ.. ఎప్పుడు.. ఎవరికి ఇచ్చారో చెప్పాలి. ఇసుక రీచ్‌లకు రౌడీలను కాపాలాపెట్టి లోపలికి వస్తే కాళ్లు విరగ్గొడతాం అంటున్నారు. వేల టన్నుల ఇసుక ఇతర రాష్ర్టాలకు వెళ్ళిపోతుంది. అమరావతి మండలంలోని జిడుగు, ధరనికోట, వైకుంఠపురం రీచ్‌ల నుంచి రేయింబవళ్లు వందల లారీల ఇసుక బయటకు పోతుంది. అధికారులు ఏమి చేస్తున్నారు..’ అని పలువురు జడ్పీటీసీలు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం జరిగింది. జడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టీనా అధ్యక్షత వహించన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఏసురత్నం, మర్రి రాజశేఖర్, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, కలెక్టర్ నాగలక్ష్మి, బాపట్ల, పల్నాడు జేసీలు ప్రకాష్‌జైన్, సూరజ్‌ధనుంజయ్, సీఈవో జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో చొప్పర కృష్ణ పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సభ్యులు చెప్పే సమస్యలు విని, వాటికి పరిష్కారం అన్వేషించేందుకే తాను ఈ సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత అందరూ ఒకటేనని చెప్పారు. జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన నిధులను ఎక్కడ నుంచి తీసుకురావచ్చో ఆలోచించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వరి కోతలు ఆరంభమైనా కొనుగోలు కేంద్రాలు తెరవలేదని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ హనుమంతరావు ప్రశ్నించారు. దీనిపై బాపట్ల జేసీ స్పందిస్తూ మంగళవారం నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెప్పారు. తేమ ఎక్కువ ఉందని పత్తి కొనుగోలు చెయ్యకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్సీ రాజశేఖర్ ప్రస్తావించగా, కేంద్ర మంత్రి పెమ్మసాని జోక్యం చేసుకుని ఈ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించానన్నారు. కొందరు సీసీఐ అధికారులు, దళారులతో కుమ్మక్కు అయిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక అధికారిని నియమించేలా చూశానని చెప్పారు. కౌలు రైతుల సంఖ్య ఎందుకు తగ్గించి చెబుతున్నారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రశ్నించారు. కౌలు రైతులకు, పొలం యజమానులకు విడివిడిగా రుణాలు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ-క్రాప్ నూరు శాతం చేసే బాధ్యత వ్యవసాయశాఖదేనని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. తెల్ల, నల్ల నల్లితో మిర్చి రైతులు నష్టపోతున్నారని, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు పల్నాడు జిల్లాలోని భూములు అనువుగా ఉంటాయని ఉద్యానశాఖ అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్సీ ఏసురత్నం సూచించారు. పల్నాడు జిల్లాలో వ్యవసాయశాఖ నమోదు చేసిన విజిలెన్స్ కేసులపై ఎమ్మెల్సీ రాజశేఖర్ అధికారులను నిలదీశారు. శనగ విత్తనాలు సబ్సిడీపై జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు హష్మి ప్రస్తావించారు. వరికపూడిశెల నిర్మాణ పనులను రూ.290 కోట్లతో మెగా సంస్థ దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు. అమరావతి మండలం కృష్ణ కెనాల్ జంగిల్ క్లియరెన్స్ పనులకు టెండర్ల ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని చెప్పారు. నరసరావుపేట కేంద్రంగా నూనెలు కల్తీ జరుగుతుందని, వాటి వల్ల ఎందరో మరణిస్తున్నారని జడ్పీటీసీ ఓబుల్‌రెడ్డి తెలిపారు. దీనిపై సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. అమరావతి మండలంలో 25 పైగా అనధికార వెంచర్లు వేశారని, దానివల్ల రైతులు నష్టపోతున్నారని ఎంపీపీ హనుమంతరావుయాదవ్ తెలిపారు.
ఫీజుల కోసం పీడిస్తున్నారు..
ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే విషయంలో జడ్పీ సమావేశంలో చర్చ జరిగింది. విద్యా సంవత్సరం మధ్యలో పేద విద్యార్థులను ఫీజులు చెల్లించాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. జిల్లా పరిషత్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా సరఫరా చేస్తున్న స్టడీ మెటీరియల్ ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశ్నించారు. డిసెంబరు 15 నాటికి అందజేస్తామని జడ్పీ చైర్‌పర్సన్ తెలిపారు. కాకుమాను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, అనేక సందర్భాల్లో ఈ సమస్య గురించి మాట్లాడినా అధికారులు పరిష్కరించలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రస్తావించారు. జనవరి నాటికి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అమరావతి, రెంటచింతల మండలాల్లో జడ్పీ హై స్కూల్ ఏర్పాటుపై సభ్యులు ప్రస్తావించారు. మాచర్ల నియోజకవర్గంలోని ఎత్తిపోతల, గిరిజన ఆవాస పాఠశాలల్లో సరైన వసతులు లేవని జడ్పీటీసీ తెలిపారు. నాడు-నేడు కింద పనులు పూర్తయినా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయలేదని అమరావతి ఎంపీపీ అధికారులను నిలదీశారు.
వైద్యులు అందుబాటులో లేరు..
భట్టిప్రోలులోని ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు ఉన్నా ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరని జడ్పీ టీసీ తెలిపారు. నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉండటంలేదని జడ్పీటీసీ ఓబుల్‌రెడ్డి తెలిపారు. మందులకు కొరత లేదని డీఎంహెవో రవి చెప్పారు. అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గైనకాలజిస్ట్ సమస్య ఉందని, కనీసం ప్రతి నెల 9న అయినా ప్రత్యేక డాక్టర్‌ను నియమించాలని ఎంపీపీ కోరారు. అచ్చంపేట మండలం చింతపల్లిలో పీహెచ్‌సీ మంజూరైనా ఇంకా ప్రారంభించలేదని జడ్పీ టీసీ విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లాలో కొత్తగా 7 పీహెచ్‌సీలు మంజూరైనా వాటికి భవన నిర్మాణాలు, సిబ్బంది నియామకం జరగలేదని డీఎంహెచ్‌వో రవి సభ్యులకు చెప్పారు.
ప్రొటోకాల్ అంశంపై ఎమ్మెల్సీ లక్ష్మణరావు, రొంపిచర్ల జడ్పీటీసీ ఓబుల్‌రెడ్డి మాట్లాడారు. బాపట్లలో జరిగిన కౌలుదారుల వర్క్‌షాపునకు తనను ఆహ్వానించలేదని లక్ష్మణరావు అన్నారు. శిలాఫలకంపై ఎంపీపీ, జడ్పీటీసీ, కొన్ని సందర్భాల్లో జడ్పీ చైర్‌పర్సన్ పేరు కూడా లేకుండా స్థానికంగా ఉన్న అనామకుల పేర్లు వేస్తున్నారని పలువురు సభ్యులు ఆరోపించారు. ఇంతకు ముందే ఈ సమస్యను పల్నాడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని అమరావతి ఎంపీపీ తెలిపారు. అధికారులు ఎమ్మెల్యేలు చెప్పినట్లే పనిచేయాలని, లేకుంటే వారిని బదిలీ చేయిస్తారని, ప్రొటోకాల్ విషయంలో అధికారులను బలిచెయ్యడం కన్నా కలెక్టర్లు చొరవ తీసుకుని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కోరారు.
కనిపించని మంత్రులు
17 మంది ఎమ్మెల్యేలకు ఇద్దరే హాజరు
మంత్రులు, మెజారిటీ ఎమ్మెల్యేలు లేకుండానే జడ్పీ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ముగ్గురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాత్రమే హాజరయ్యారు. వాస్తవానికి జడ్పీ సమావేశం గురువారం జరగాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఎమ్మెల్యేల సౌలభ్యం కోసం అని శనివారానికి వాయిదా వేశారు. అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేదు. కూలేందుకు సిద్ధంగా ఉన్న జడ్పీ భవనాన్ని మంత్రులకు చూపించాలని అధికారులు, జడ్పీటీసీలు భావించారు. అయితే వారెవ్వరూ రాకపోవడంతో నిరాశ చెందారు. జిల్లా లోని ముఖ్యమైన సమస్యలపై పలువురు సభ్యులు ప్రశ్నలు సంధించినా అధికారుల నుంచి సరైన సమాధానాలు రాలేదు. అదే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటే అధికారులు బాధ్యతగా సమాధానాలు చెప్పి ఉండేవారని పలువురు అభిప్రాయపడ్డారు.
సచివాలయాల్లో ఈగల మందలా ఉద్యోగులు
‘సచివాలయాల్లో ఉద్యోగులు ఈగల మందలా ఉన్నా ఈ-క్రాప్ నమోదులో అలసత్వం వహిస్తున్నారని, ఆరు వేల మందికి కౌలు రైతులకు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెలు, కాల్వ గట్ల దగ్గర ఇళ్లు వేసుకుని నివసించే కౌలు రైతుల దగ్గరకు వెళ్ళి పేర్లు నమోదు చేసి కార్డులు ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఉద్యోగుల అలసత్వం వల్ల కౌలు రైతుల ప్రయోజనాలకు గండి పడుతుందన్నారు. సరైన సమయంలో వారికి రుణాలు ఇప్పించడంలో విఫలం అవుతున్నారన్నారు. కలెక్టర్లకు 50 శాఖల పైగా ఉంటాయని, వారు ఎన్ని కార్యక్రమాలు పర్యవేక్షిస్తారని ప్రశ్నించారు. ఆయా శాఖల జిల్లా అధికారులు ఒక కలెక్టర్‌లా కింది స్థాయి సిబ్బందితో పనులు చేయించాలని సూచించారు.