సంస్థ రుణం తీర్చుకోవడం హర్షణీయం
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:03 AM
విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నత వైద్యులుగా తీర్చిదిద్దిన గుంటూరు వైద్య కళాశాల రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షణీయమని ఎన్నారై డాక్టర్ పొదిల ప్రసాద్ తెలిపారు.
గుంటూరు(మెడికల్), డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నత వైద్యులుగా తీర్చిదిద్దిన గుంటూరు వైద్య కళాశాల రుణం తీర్చుకునేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షణీయమని ఎన్నారై డాక్టర్ పొదిల ప్రసాద్ తెలిపారు. గురువారం గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో 1999వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య చదివే విద్యార్థులు భవిష్యత్తులో తాము వైద్యులుగా స్థిరపడిన తర్వాత మాతృ సంస్థ రుణం తీర్చుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 99వ బ్యాచ్ విద్యార్థులు వైద్య కళాశాలకు రెండు బస్సులను విరాళంగా ఇవ్వడం సంతోషదాయకమన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కలుసున్న వారంతా ఒకరినొకరు ఆప్యాయయంగా పలుకరించుకుంటూ సందడిగా, ఆటపాటలతో గడిపారు. మహిళా వైద్యులు సంప్రదాయబద్ధంగా చీరలు ధరించి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం అమరావతిరోడ్‌లోని కన్వెన్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో తమకు వైద్య పాఠాలు బోధించిన గురువులను ఘనంగా సన్మానించారు.
కోటి రూపాయల విరాళం ప్రకటన...
1999వ బ్యాచ్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ సందర్భంగా కళాశాలకు కోటి రూపాయలు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ బ్యాచ్ విద్యార్థులు రూ.75 లక్షలతో రెండు కొత్త బస్సులను విరాళంగా ప్రకటించారు. ఇందులో భాగంగా గురువారం ఒక బస్సును ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారికి అందజేశారు. కళాశాల గ్రంథాలయంలో ఆఽధునికీకరణకు అయ్యే ఖర్చును భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అమరావతి రోడ్డులోని జీఎంసీ మెన్స్ హాస్టల్‌లో రూ.8 లక్షలతో రెండు క్రికెట్ పిచ్‌లను కొత్తగా ఏర్పాటు చేయించారు. వైద్య విద్యార్థుల వసతి గృహంలో రెండు వాషింగ్ మెషిన్లను, వాలీబాల్ కోర్టు నెట్‌లను, క్రికెట్ కిట్లను అందజేశారు. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలో ఇతర అభివృద్ధి పనుల కోసం విరాళంగా అందజేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. కార్యక్రమానికి 99వ బ్యాచ్‌కు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పుణ్యాల శ్రీనివాసరెడ్డి సంధానకర్తలుగా వ్యవహరించారు.