Share News

ఎడతెరిపిలేని వర్షం... ఎండుతున్న పైర్లకు జీవం

ABN , Publish Date - Aug 30 , 2024 | 11:57 PM

గడచిన వారం రోజులుగా వేసవిని తలపించేలా కాస్తున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ఎడతెరిపిలేని వర్షం... ఎండుతున్న పైర్లకు జీవం
వరిపొలాలలో నిండుగా చేరిన వర్షపు నీరు

---- వేసవిని తలపించిన ఎండల నుంచి ఉపశమనం

---- జిల్లాలో సగటున 16.2 మి.మీ వర్షపాతం నమోదు

బాపట్ల, ఆగస్టు30(ఆంధ్రజ్యోతి): గడచిన వారం రోజులుగా వేసవిని తలపించేలా కాస్తున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దిగువన ఉన్న పొలాలకు నీరందకు నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి. వీటన్నింటికి ఉపశమనం కలిగించేలా గడచిన రెండు రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం పడింది. శుక్రవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 40. 5 మిల్లిమీటర్లవర్షపాతం నమోదు కాగా, 16.2 మిల్లిమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రేపల్లెలో 40.2 మి.మీ, అత్యల్పంగా వేటపాలెంలో 4.6 మి.మీ, కర్లపాలెంలో 35.8 మి.మీ, పిట్టలవానిపాలెంలో 18.6 మి.మీ, బాపట్లలో 22.8 మి.మీ, వేమూరులో 26.2 మి.మీ, మార్టూరులో 18.4 మి.మీ నమో దైంది.

గతంలో కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నప్ప టికీ దిగువన ఉన్న పొలాలకు నీరందక వాన రాక కోసం ఆశగా చూసిన అన్నదాతలకు ఈ వర్షాలు ఊపిరి పోశాయి. అద్దంకి, పర్చూరు నియోజక వర్గాల్లో సకాలంలో వర్షాలు కురవక ఎండిపోయే స్థితిలో ఉన్న తరుణంలో ఎడతెరిపి లేని వానలు మొక్కజొన్న రైతుల్లో ఆనందాన్ని నింపాయి. ముఖ్యంగా శివారు ప్రాంతంలో ఉన్న చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల పరిధిలో నీరందక నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి. దీనికి తోడు కాలువల్లో పూడికతీతపనులు ఇంకా పూర్తి కాకపోవడం కూడా అన్నదాతలకు శాపంగా మారింది. అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆయా పైర్లకు జీవం పోశాయి. మరో రెండు రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో రైతులు సంతోషం వ్యక్తం చే స్తున్నారు. నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లోని పొలాలలో నిండుగా వర్షపు నీరు నిలిచింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం భూములలో వరినాట్లు, వెదసాగు చేపట్టారు. ఇంకా 10 శాతం భూములలో కూడా వర్షంతో నాట్లు పడే అవకాశం ఉంది.

30,000 ఎకరాల సాగుకు ఉపయోగం

వైసీపీ గత ఐదేళ్లలో చేసిన నిర్వాకం వల్ల ఎగువన ఉన్న జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నా దిగువన ఉన్న పొలాలకు సకాలంలో సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి దాపురించింది. ఏ కాలువలోనూ పూడికతీత పనులు మరమ్మతుల గురించి కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఎగువన వదిలిన నీరు దిగువకు ప్రవహించకపోవడంతో వర్షాలపైనే రైతులు ఆశ పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కాలువలలో పూడికతీత పనులు చేయిస్తున్నప్పటికీ ఆ పనులు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. లక్షల్లో అప్పులు చేసి సేద్యం మొదలుపెట్టిన రైతులకు.. ఈ వర్షం ఆశలు చిగురించేలా చేసింది. దిగువన ఉన్న దాదాపు 30,000 ఎకరాల సాగుకు ఈ వర్షాలు ఉపయోగపడనున్నాయి.

పారిశుఽఽధ్యంపె దృషి ్టపెట్టాలి....

జిల్లాలో ఇప్పటికే విషజ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఎడతెరిపి లేని వర్షాల ధాటికి ఎక్కడికక్కడ నీళ్లు నిలబడి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీనికి తోడు డ్రైనేజీల్లో వర్షపునీరు నిలబడి రోడ్డుపైకి చేరుతుండటంతో దుర్గంధం వ్యాప్తి చెందుతోంది. పారిశుధ్యం మెరుగుపై అధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో విష జ్వరాలు మరింతగా ప్రబలి ప్రజలు ఆసుపత్రుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది.

Updated Date - Aug 30 , 2024 | 11:57 PM