శిరస్ర్తాణంపై.. నిర్లక్ష్యమేల?
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:00 AM
ద్విచక్ర వాహనాలను నడపడంలో తాము నేర్పరులమని, హెల్మెట్లు అవసరం లేదని కొందరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
నవంబరు 25న గుంటూరు నగరం ఇన్నర్‌రింగురోడ్డులో ద్విచక్రవాహనంతో రోడ్డు దాటుతున్న మరొక ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వారిద్దరూ హెల్మెట్ ధరించకపోవడంతో తల రోడ్డును బలంగా తాకడంతో అక్కడిక్కడే వారు మృతి చెందారు. హెల్మెట్ ధరించి ఉంటే ఇద్దరూ ప్రాణాలతో బయటపడే వారు.
అక్టోబరు చివరి వారంలో గుంటూరు నగరం మిర్చియార్డు వద్ద వేగంగా వస్తున్న లారీ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. హెల్మెట్ ధరించి ఉంటే అతడి ప్రాణాలు దక్కేవి.
ఇటీవల ఓ ఉపాధ్యాయురాలు కుమారుడి వాహనంపై విధులకు వెళ్తుండగా ఆమె చీర బైక్ చైన్‌లో ఇరుక్కుంది. దీనిని గమనించకుండా వాహనాన్ని వేగంగా ముందుకు పోనీయడంతో ఆమె బైక్‌పై నుంచి కింద పడి అక్కడిక్కడే మృతి చెందారు. ఆమె హెల్మెట్ ధరించినట్లైతే ప్రమాదం నుంచి బయట పడేది.
... ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పలువురు మృత్యువాత పడుతున్నారు. హెల్మెట్లు ధరించకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. హెల్మెట్‌లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించేలా చర్యలు తీసుకోవాలని తామిచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని హైకోర్టు ప్రస్తావించింది. దీంతో ఇతర జిల్లాల్లో అధికారులు హైల్మెట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికారులు కనీసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు.
గుంటూరు(తూర్పు), డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాలను నడపడంలో తాము నేర్పరులమని, హెల్మెట్లు అవసరం లేదని కొందరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంత మంది హెల్మట్లను అడ్డంకిగా భావిస్తున్నారు. చాలామంది హెల్మెట్లను ధరించాలంటే ఆసక్తి చూపడం లేదు. కొంతమంది ద్విచక్ర వాహనదారులు తల వెంట్రుకలు రాలిపోతాయని, ఇతర ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయంటూ హెల్మెట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి కొంత మంది ద్విచక్ర వాహనాలను రూ.లక్షలతో కొనుగోలు రూ.వెయ్యి లోపు ఖర్చయ్యే హెల్మెట్‌ను కొనుగోలు చేసేందుకు వెనుకాడుతుంటారు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు గాయపడినా బతకవచ్చు.. కానీ తలకు గాయమైతే ప్రాణానికి ముప్పు తప్పదని తెలిసి కూడా హెల్మెట్ ధరించాలన్న ఆలోచన చేయడంలేదు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి ద్విచక్ర వాహనదారుడు, అతడి వెనకాల కూర్చున్న వారు తప్పనిసరిగా విధిగా హెల్మెట్ ధరించాలి. కానీ ఈ నిబంధన సక్రమంగా అమలు కావడం లేదు. హైల్మెట్ వినియోగించాలన్న నిబంధనను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులు, రవాణా శాఖపై ఉంది. అంతకు మించి ప్రాణరక్షణ కోసం వాహనదారులు కూడా శిరస్త్రాణం ధరించాలి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. మిగిలిన సమయాల్లో కేసులు కూడా నమోదు చేయడం లేదు. దీంతో వాహనదారులు హెల్మెట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి రోజు ప్రధాన కూడళ్లు వద్ద నిత్యం డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తున్నారు. పట్టుబడితే రూ.10 వేల వరకు జరిమానా విధించి, కేసులు పెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, హెల్మెట్ల విషయంలో దృష్టి పెట్టడం లేదని విమర్శలున్నాయి.
ఫవాహనంతోనే హెల్మెట్
మోటారు వాహన చట్టం ప్రకారం ప్రతీ డీలరు వాహనం విక్రయించే సమయంలో వినియోగదారుడికి తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాలి. నాణ్యత ప్రమాణాలతో ఉన్న ఐఎస్‌ఐ మార్కు కల్గిన హెల్మెట్‌నే వాహనదారులు వినియోగించాలి. అయితే నూతన ద్విచక్ర వాహనాన్ని విక్రయించేటప్పుడు వాటికి హెల్మెట్‌లను జతచేసి ఇవ్వాలనే నిబంధనను డీలర్లు అమలు చేయడం లేదు.
హెల్మెట్ తప్పనిసరి
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ విధిగా ధరించాలి. ధరించని వారిపై కేసు నమోదు చేసి రూ.1000 జరిమానా విధిస్తాం, రెండోసారి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తాం. రోడ్డు ప్రమాదాలను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా ఎవరినీ ఉపేక్షించేది లేదు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా నిబంధనలను కఠినంగా అమలు చేస్తాం.
-సత్యనారాయణ ప్రసాద్, ఆర్టీవో, గుంటూరు