ఇళ్ల పట్టాలు.. పునఃపరిశీలన
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:29 AM
నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను పునఃపరిశీలన జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
అర్హులకు అందాయా...వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారా అన్న దానిపై ఆరా
1.38 లక్షల ఇళ్ల పట్టాలను పరిశీలించనున్న రెవెన్యూ అధికారులు
అనర్హులకు ఇచ్చి ఉంటే రీమార్కులతో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
గుంటూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను పునఃపరిశీలన జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజన్లలో కలిపి పంపిణీ చేసిన లక్షా 38 వేల పైచిలుకు ఇళ్ల పట్టాలను సబ్ కలెక్టర్/ఆర్‌డీవో, తహసీల్దార్లు పునఃపరిశీలన చేయనున్నారు. గతంలో పలు పర్యాయాలు ఇళ్ల పట్టాలు పొందిన వారికి కూడా వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు అప్పట్లో రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. నిజమైన పేదవాళ్లలో చాలామందికి అందలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అనర్హుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఆరు అంచెల మూల్యాంకనాన్ని నిర్వహించింది. ఈ పథకంలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. పేదలకు ఇళ్ల పట్టా ఆశ చూపి అప్పటి ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడ్డారు.
భూముల సేకరణలోనూ కుంభకోణం
ఇళ్ల పట్టాల కోసం ప్రైవేటు భూములను సేకరించారు. ఈ క్రమంలో భూముల ధరలను ఆసాంతం పెంచేసి రూ.కోట్ల ప్రభుత్వ సొమ్ముని పోగేసుకున్నారు. దీనిపై అప్పట్లో ఎన్ని ఆరోపణలు చేసినా అప్పటి వైసీపీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు. పైగా అప్పట్లో పని చేసిన అధికారుల్లో కొందరు వారి వాటాలు తీసుకున్నారు. గుంటూరు రెవెన్యూ డివిజన పరిధిలో మేడికొండూరు, పెదకాకాని, పెదనందిపాడు, గుంటూరు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తాడికొండ, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో 2,231.399 ఎకరాలను ప్రభుత్వం వినియోగించింది. ఇందులో 553.855 ఎకరాల ప్రభుత్వ భూమి, 1677.544 ఎకరాల ప్రైవేటు భూమి ఉన్నది. భూసేకరణ కోసం రూ.937.8651 కోట్లు వెచ్చించి 83,313 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. లేఅవుట్ల కోసం వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, తాడికొండ, తుళ్లూరులో ఎక్కువ విస్తీర్ణంలో భూములు సేకరించారు. తెనాలి రెవెన్యూ డివిజన పరిధిలో 1436.727 ఎకరాల భూమిని వినియోగించింది. ఇందులో ప్రభుత్వ భూమి 601.545 ఎకరాలు కాగా ప్రైవేటు భూమి 835.182 ఎకరాలుగా ఉన్నది. ఇందుకోసం రూ.529.1997 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఈ విధంగా జిల్లా మొత్తంగా 2512.726 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించింది. ఇందుకోసం రూ. 1467.06 కోట్లను ఖర్చు చేసింది.
ఫలితం అంతంత మాత్రమే
గతంలో పేదల ఇళ్ల పేరుతో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీగా నిధులు ఖర్చు చేయలేదు. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. కొన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లు నివాస ప్రాంతాలకు సుదూరంగా ఉన్నాయి. దీంతో ఆయా లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు పట్టాలు పొందిన వారు ముందుకు రాలేదు. పీఎంఏవై అర్బన అనేది బీఎల్‌సీ(బెనిఫీషియరీ లెడ్ కనస్ట్రక్షన) స్థలం ఉన్న వారికి మాత్రమే అమలు చేయాలి. అలాంటిది వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని దీనికి ముడి పెట్టింది. ఐదేళ్లు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయలేక చతికిలబడింది. ఈ నేపథ్యంలో అర్హులకు ఇచ్చారా... అనర్హులకు పందేరం చేశారా అనేది తేల్చడానికి ఇళ్ల పట్టాల పునఃపరిశీలన చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించించింది.