Share News

వాడవాడలా.. మద్యం

ABN , Publish Date - Nov 22 , 2024 | 01:00 AM

ప్రభుత్వ మద్యం దుకాణాలు పోయి.. ప్రైవేటు వైన్స వచ్చేశాయి. కావాల్సిన బ్రాండ్లు కొనుక్కోవచ్చు. తాగొచ్చు. అయితే ఎక్కడో ఉన్న వైన్సకు వెళ్లి కొనుక్కునేందుకు ఇబ్బంది పడకుండా అందుబాటులో కూడా మద్యం దొరికే సౌలభ్యం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రతీ పల్లెలోనూ, పట్టణాల పరిధిలోని కాలనీల్లోనూ ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని బడ్డీ కొట్టుకు వెళ్తే మందు దొరుకుతుండటంతో మందుబాబులు ఖుషీఖుషీగా ఉంటున్నారు.

వాడవాడలా.. మద్యం

ఎక్కడికక్కడ వెలిసిన బెల్ట్‌ షాపులు

టీడీపీ నేతల కనుసన్నల్లో నిర్వహణ

పల్లెలు, కాలనీల్లో అందుబాటులో మద్యం

బెల్ట్‌ షాపులను ప్రోత్సహిస్తున్న వ్యాపారులు

తూతూమంత్రంగా కేసులు, దాడులతో ఎక్సైజ్‌ సరి

నియంత్రణలో వైఫల్యం.. మామూళ్ల వసూళ్లలో అధికారులు

ప్రభుత్వ మద్యం దుకాణాలు పోయి.. ప్రైవేటు వైన్స వచ్చేశాయి. కావాల్సిన బ్రాండ్లు కొనుక్కోవచ్చు. తాగొచ్చు. అయితే ఎక్కడో ఉన్న వైన్సకు వెళ్లి కొనుక్కునేందుకు ఇబ్బంది పడకుండా అందుబాటులో కూడా మద్యం దొరికే సౌలభ్యం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రతీ పల్లెలోనూ, పట్టణాల పరిధిలోని కాలనీల్లోనూ ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని బడ్డీ కొట్టుకు వెళ్తే మందు దొరుకుతుండటంతో మందుబాబులు ఖుషీఖుషీగా ఉంటున్నారు. ఆదాయం అధికంగా ఉంటుండఢంతో బెల్ట్‌ షాపుల నిర్వహణకు పలువురు పోటీపడుతున్నారు. ఇదే అవకాశంగా గ్రామాల్లోని అధికార పార్టీ నాయకులు బెల్ట్‌

షాపుల నిర్వహణకు ముందుకొస్తున్నారు. అధికారులు కూడా తూతూమంత్రంగా దాడులు, కేసులతో సరిపెడుతున్నారు. బెల్ట్‌ షాపుల నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టడంలేదు. దీంతో ప్రతి గ్రామం, కాలనీల్లో ఎనీటైం మద్యం అందుబాటులో ఉంటుంది.

=============

డిపాజిట్‌ కడితేనే బెల్ట్‌

రేపల్లెలో బెల్టు షాపుల నిర్వహణ కోసం చిన్న గ్రామమైతే రూ.50,000, పెద్ద గ్రామానికి రూ.లక్ష డిపాజిట్‌ చేసేలా మద్యం షాపులు యజమానులు రేటు ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. కర్లపాలెం మండల పరిధిలో రెండు గ్రామాలలో బెల్టు షాపుల నిర్వహణకు పోటీ అధికంగా ఉండడంతో పంచాయితీ నడుస్తున్నట్లు సమాచారం. వేమూరు నియోజకవర్గ పరిధిలో బెల్టు షాపుల నిర్వహణకు దాదాపు రూ.3 లక్షలు ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గ్రామాలలో ఇంతకుముందే ఈ బెల్టు

షాపులు నిర్వహించిన వారికే ప్రస్తుతం కూడా ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం. బెల్టు షాపులు ఎక్కడ జోరుగా నడుస్తున్నాయోనని తెలుసుకుని వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మద్యం వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. పల్నాడులో మద్యం దుకాణాల నిర్వాహకులు రూ.50 వేలు వసూలు చేసుకుని బెల్ట్‌షాపు నిర్వహణకు అనుమతి ఇవ్వడంతో పాటు అక్కడకు మద్యం సరఫరా చేస్తున్నారు.

===============

దొరికితే.. పండుగే

ఇటీవల ముప్పాళ్ళ మండలంలోని ఓ గ్రామంలో మద్యం బెల్టు షాపు నిర్వాహకుడిని ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్టేషనలో పని చేసే కానిస్టేబుల్‌ ఒకరు కేసు పెట్టించుకుంటావా?, సార్‌తో సెటిల్‌ చేసుకుంటావా? అంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బెల్టు షాపు నిర్వాహకుడు కానిస్టేబుల్‌ చెప్పినంత డబ్బులు సమర్పించుకుని కేసు లేకుండా బయటపడ్డాడు. ఇలా అధికారులకు బెల్ట్‌ దుకాణంపై ఫిర్యాదు అందితే దానిని నియంత్రించకుండా కేసులతో బెదిరించి మామూళ్లు పిండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

=================

రూ.50 వరకు అదనం..

రూ.లక్షలు కట్టి వైన్స లైసెన్సు పొందిన వ్యాపారులు బెల్ట్‌ షాపుల ద్వారా మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌కు అదనంగా రూ.10 తీసుకుని బెల్ట్‌ దుకాణాలకు మద్యం సరఫరా చేస్తున్నారు. వారు బ్రాండ్లను బట్టి రూ.40 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. తమ ప్రాంతం నుంచి వైన్సకు వెళ్లకుండా అందుబాటులో మద్యం దొరుకుతుండటంతో మందుబాబులు అదనపు మొత్తాన్ని భారంగా భావించడంలేదు. ఏ సమయంలోనైనా కావాల్సిన మందు దొరుకుతుండటంతో మందుబాబులు

బెల్ట్‌ దుకాణాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌)

కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి నెలరోజులు అవుతుంది. ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి ప్రైవేట్‌ వైన్స్‌ షాపు లకు అనుమతించింది. ఇదే సమయంలో అన్ని ప్రాంతాల్లో, గ్రామాలలో వాడవాడల మద్యం బెల్టు షాపులు కూడా వెలిశాయి. గతంలో ప్రభుత్వ వైన్స కావడం.. డిమాండ్‌ ఉన్న బ్రాండ్లు అందుబాటులో లేక పోవడంతో బెల్ట్‌ షాపులపై పెద్దగా ఎవరూ దృష్టి సారించలేదు. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు వైన్స నిర్వహిస్తుండటం.. వారి ద్వారా కావాల్సినంత మద్యం, కోరిన బ్రాండ్లు దొరుకుతుండటంతో బెల్ట్‌షాపుల యథేచ్ఛగా వెలిశాయి. వైన్స లైసెన్స్‌దారులతో సిండికేటైన కొందరు నేతలు గ్రామాల్లో తమ అనుచరుల ద్వారా బెల్ట్‌షాపులను నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతల అండ ఉండటం, కొన్ని దగ్గర్ల వారి అనుచరులే దుకాణాల నిర్వహిస్తుండటంతో వీటిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. కొన్ని ప్రాంతాల్లో బెల్ట్‌ షాపుల బెడదతను తట్టుకోలేక స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం ఉండటంలేదు. ప్రతి గ్రామంలోనూ మూడు నుంచి నాలుగు వరకు బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయి. బెల్టు ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుందని గ్రహించిన మద్యం వ్యాపారులు కూడా వాటిని ప్రోత్సహిస్తున్నారు. బెల్టు నిర్వహించుకునే వారి నుంచి రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు ప్రాంతాన్ని బట్టి వసూలు చేస్తున్నారని సమాచారం. ఈ వసూళ్ల క్రమంలో కొన్ని గ్రామాల్లో నేతలు, మద్యం వ్యాపారుల మధ్య వివాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

ఎనీటైం మద్యం..

బెల్ట్‌ దుకాణాలతో పలు కాలనీల్లో, పల్లెల్లో మద్యం మందుబాబులకు చేరువైంది. కొన్ని గ్రామాల్లో డోర్‌ డెలివరీ సౌకర్యాన్ని కూడా వ్యాపారులు అమలు చేస్తున్నారని సమాచారం. బెల్ట్‌షాపుల్లో 24 గంటలూ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మందుబాబులు తెల్లవారుజాము నుంచే ఆయా షాపుల వద్ద బహిరంగంగానే మద్యం తాగుతున్నా అధికారులు, పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి చూడటంలేదు. బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అమ్మేవారు కూడా తాము అధికారులను ప్రసన్నం చేసుకునే విక్రయాలు జరుపుతున్నామని చెబుతుండడం విశేషం. బెల్ట్‌ దుకాణాల బెడదపై

అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆయా ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. బెల్టుషాపులు యథేచ్ఛగా నడుస్తున్నా మొక్కుబడి కేసులతో ఎక్సైజ్‌ అధికారులు సరిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. దాడుల్లో పట్టుబడ్డ మద్యం ఏ షాపు నుంచి వచ్చిందో మూలాలను కనుక్కొని వాటిపై చర్యలు తీసుకోవడంలేదు.

- గుంటూరుకి సమీపంలోని గొర్లవారిపాలెం, రాజీవ్‌గృహకల్ప, పలకలూరు, రాజేశ్వరావుకాలనీ, ఓబులనాయుడిపాలెం, వెంగళాయపాలెం, బుడంపాడు, లాల్‌పురం, నగరంలోని శివారు కాలనీల్లో బెల్ట్‌షాపులున్నాయి.

- పెదకాకాని మండలంలోని వెనిగండ్ల సుగాలికాలనీ, ఎరుకలకాలనీ, గోళ్లమూడి, తక్కెళ్లపాడు, ఉప్పలపాడు, వెంకటకృష్ణాపురం, కొప్పురావూరులో బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నారు.

- మంగళగిరిలోని బాప్టిస్టుపేట, పాతమంగళగిరి, కుప్పురావుకాలనీ, వీవర్స్‌ కాలనీతోపాటు మండల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఎనీ టైం మద్యం లభిస్తోంది. తాడేపల్లి పరిధిలోని డోలాస్‌నగర్‌, ప్రకాష్‌నగర్‌, నులకపేటలో బెల్ట్‌ షాపులున్నాయి. సీతానగరం ఘాట్ల వద్ద నిత్యం ఓపెన బార్‌ నడుస్తుంది. ఇక్కడ తెల్లవారుజామున 4 గంటల నుంచే మందుబాబులు ఫుల్‌గా తాగి గొడవలు పడుతుంటారు.

- తాడికొండ గ్రామంలో చింతచెట్టు సెంటర్‌, పడమర వీధి రామాలయం, రావిచెట్టు సెంటర్‌, ఎస్సీ కాలనీలో, పొన్నెకల్లు బైపాస్‌లో మూడు షాపుల్లో, సత్రం సెంటర్‌, జడలం బావి సెంటర్‌లో, లాం, నిడుముక్కల, మోతడక, పాములపాడు, బండారుపల్లిలో మద్యాన్ని విక్రయిస్తున్నారు.

- కాకుమాను మండలంలోని కొమ్మూరు, రేటూరు, అప్పాపురం, గరికపాడు, బీకే పాలెం, చిన్నలింగాయపాలెం గ్రామాల్లో బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఇటీవల కొమ్మూరులో బెల్టు షాపులను తొలగించాలని ఎమ్మెల్యే రామాంజనేయులకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.

- నరసరావుపేట నియోజకవర్గంలోని ఒకటి రెండు గ్రామాలు మినహా అన్ని పల్లెల్లో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. రొంపిచర్ల మండలంలో మద్యం షాపులు నిర్వహకుల మధ్య పోటీ నెలకొనడంతో ఒక వర్గం అధికారం అండతో బెల్టు షాపులను గ్రామాల్లో నిర్వహిస్తోంది. వీరు తప్ప మరేవరు గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించకూడదని బెదిరిస్తుంది. నరసరావుపేట మండలంలో వ్యాపారులు సిండికేటై బెల్ట్‌ షాపులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

- చిలకలూరిపేటలోని శివారు కాలనీలతో పాటు యడ్లపాడు మండలంలో ప్రతి గ్రామంలోనూ బెల్టు షాప్‌లు ఉన్నాయి. సాతులూరు వంటి గ్రామాల్లో ఏడు నుంచి పది బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నారు.

- పిడుగురాళ్ల, బ్రాహ్మణపల్లి, కరాలపాడు, గురజాల, మాచవరం, మోర్జంపాడు, అంబాపురం, పులిపాడు, దైద, జంగమహేశ్వరపురంలో బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. తెలంగాణ మద్యాన్ని కూడా కొందరు గుట్టుగా విక్రయిస్తున్నారు. కారంపూడిలో 3 మద్యం షాపుల నిర్వాహకులే పలు బడ్డీ బంకుల వద్ద మద్యం ఉంచి క్వార్టర్‌కు రూ.30 అదనంగా అమ్మిస్తున్నారు.

- రెంటచింతల మండలంలోని జెట్టిపాలెం, తుమృకోట గ్రామాల్లోని బెల్ట్‌షాపులపై కేసులు నమోదయ్యాయి. దుర్గి మండల పరిధిలో రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో యఽథేచ్ఛగా హైవే రోడ్డు పక్కన దాబాల్లో మద్యం విక్రయాలు సాగుతున్నాయి. కొందరు యువకులు మద్యం షాపుల్లో మద్యం కొనుగోలు చేసి నాగులేటి పరిసర ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు.

- బాపట్ల నియోజకవర్గ పరిధిలో ముత్తాయపాలెం, మద్దిబోయినవారిపాలెం, కనకాద్రి నగర్‌తో పాటు సూర్యలంక తీర ప్రాంతంలో అనధికార మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల పరిధిలోని చాలా గ్రామాల్లో వైసీపీ హయాంలో ఎవరైతే బెల్టు షాపులు నిర్వహించారో వారే ఇప్పుడు కూడా బెల్టు దందాను నడుపుతున్నారు.

- - చీరాలలో సుదీర్ఘకాలంగా మద్యం వ్యాపారంలో ఉన్న ఓ టీడీపీ ద్వితీయశ్రేణి నేత బెల్టు షాపుల సిండికేట్‌ విషయంలో ఎడతెగని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక్కడ టీడీపీకి చెందిన వారితో పాటు వైసీపీకి చెందిన వారు కూడా దాదాపు 7 షాపులు దక్కించుకున్నారు. వారిని కూడా ఈ బెల్టు సిండికేట్‌లో భాగస్వామ్యం అయ్యే విధంగా సదరు నేతే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Nov 22 , 2024 | 01:00 AM