Share News

బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రణాళిక

ABN , Publish Date - Nov 17 , 2024 | 01:22 AM

రాష్ట్రంలో బీసీల కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, వారి అభ్యున్నతే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌ సవిత తెలిపారు. గుంటూరు రాజాగారితోటలోని బీసీ స్టడీ సర్కిల్‌ను సందర్శించి డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ప్రారంభించారు.

బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రణాళిక
డీఎస్సీ అభ్యర్థుల కోసం ఎమ్మెల్సీ లక్ష్మణరావు పంపిణీ చేసి ఉచిత స్టడీ మెటిరియల్‌ ఆవిష్కరిస్తున్న మంత్రి సవిత

బీసీ భవన్‌ ఆవరణల్లోనే స్టడీసర్కిల్స్‌ నిర్మాణం

చిన్న మఽధ్యతరహా పరిశ్రమల స్థాపనకు ఆర్థిక చేయూత

డీఎస్సీ ఉచిత శిక్షణా కేంద్రం ప్రారంభ సభలో మంత్రి సవిత

గుంటూరు(విద్య), నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీల కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, వారి అభ్యున్నతే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌ సవిత తెలిపారు. గుంటూరు రాజాగారితోటలోని బీసీ స్టడీ సర్కిల్‌ను సందర్శించి డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని తయారు చేసేందుకు ఆర్థిక చేయూత, ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా యువతకు రుణాలు మంజూరు చేసి వారి స్వయం ఉపాధికి కృషి చేస్తామన్నారు. ప్రతీ జిల్లాలో బీసీ భవన నిర్మాణం కోసం ఒకటిన్నర ఎకరాల భూమి సేకరించామని అందులో కొంతభాగంలో స్టడీసర్కిల్‌ భవనం నిర్మించి నిరుద్యోగ యువతకు వివిధ ఉద్యోగ పరీక్షలకు శిక్షణ ఇస్తామని తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్స్‌ ద్వారా రాష్ట్రంలో 5720 మందికి డీఎస్సీ శిక్షణ ఇస్తున్నామని, శిక్షణను సమర్ధవంతంగా ఉపయోగించుకుని ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. శిక్షణలో నెలకు రూ.1500 స్టయిఫండ్‌, పుస్తకాలకు రూ.1000 చొప్పున అందిస్తామన్నారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ ద్వారా ఇచ్చే డీఎస్సీ శిక్షణను త్వరలో ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ త్వరలో స్టడీసర్కిల్స్‌లో సివిల్‌ సర్వీసెస్‌కు శిక్షణ ఇస్తామన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ డీఎస్సీ శిక్షణకు సమర్ధవంతమైన అధ్యాపకుల్ని నియమించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏసురత్నం, ఎమ్మెల్యే నసీర్‌, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ మల్లికార్జునరావు, జేడీ తనూజారాణి, అదనపు డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి, జేసీ భార్గవ్‌తేజ, బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌ మయూరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 01:22 AM