Share News

శీతల గిడ్డంగుల్లో రంగు మారుతున్న మిర్చి

ABN , Publish Date - Jul 30 , 2024 | 12:00 AM

మిర్చి మార్కెట్‌లో ధర పతనమైన కారణంగా గత ఏడాది శీతల గిడ్డంగుల్లో నిల్వచేసిన ఎండు మిరపకాయలు రంగు మారిపోతున్నాయి.

శీతల గిడ్డంగుల్లో రంగు మారుతున్న మిర్చి

గుంటూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మిర్చి మార్కెట్‌లో ధర పతనమైన కారణంగా గత ఏడాది శీతల గిడ్డంగుల్లో నిల్వచేసిన ఎండు మిరపకాయలు రంగు మారిపోతున్నాయి. ధర పెరిగే పరిస్థితి లేకపోవడంతో వచ్చిందే దక్కుదల అని భావిస్తూ రైతులు, వ్యాపారులు కోల్డ్‌స్టోరేజ్‌ల నుంచి టిక్కీలు బయటకు తీస్తుంటే వాటిల్లోని మిర్చి నలుపు రంగులోకి మారిపోయి ఉంటోంది. నెలల తరబడి ఒకే లాట్‌లో ఉండటం వలన ఫంగస్‌ కూడా చేరుతున్నది. దీంతో వాటిని మార్కెట్‌యార్డులో విక్రయించేందుకు తీసుకొస్తే క్వింటాల్‌కు కనీసం రూ.8వేలు కూడా ధర రావడం లేదు. దీంతో మిర్చి స్టాకిస్టులు బావురుమంటున్నారు. ఇందుకు కారణం కోల్డ్‌స్టోరేజ్‌లలో మిర్చి నిల్వ చేసినప్పుడు క్వింటాల్‌ ధర రూ.18 వేల నుంచి రూ.20వేల మధ్యన ఉండటం. ఇప్పుడు ధర సగానికి సగం తగ్గిపోవడమే కాకుండా అదనంగా కోల్డ్‌స్టోరేజ్‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుండటంతో తీవ్రంగా నష్టాలను చవి చూస్తున్నారు.

2023 మార్చి నుంచి మే నెలల మధ్యన మిర్చి ధర మార్కెట్‌లో తగ్గింది. అంతకుముందు వరకు క్వింటాల్‌ ఒక దశలో రూ.27వేల వరకు వెళ్లింది. అయితే ఉన్నపళంగా క్వింటాల్‌కి రూ.7వేలకు పైగా ధర తగ్గడంతో అప్పట్లో రైతులు, వ్యాపారస్థులు కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ చేశారు. గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలల వరకు వేచిచూసినా ధర పెరగలేదు. మరోవైపు కొత్త సరుకు రావడం ప్రారంభమైంది. అప్పట్లో దాదాపుగా 35 లక్షల టిక్కీల వరకు స్టోరేజ్‌లలో నిల్వ చేయగా గత సంవత్సరం డిసెంబరు నెల వరకు 15 లక్షల టిక్కీలను ధర తక్కువ అయినా రైతులు విక్రయించేశారు. మరో 20 లక్షలు మాత్రం అలానే స్టోరేజ్‌లలో నిల్వ ఉండిపోయాయి. ఈ ఏడాది(2024) మే నెల వరకు మరో 50 లక్షల టిక్కీలను రైతులు నిల్వ చేశారు. దీంతో ప్రస్తుతం 70 లక్షల టిక్కీలు గిడ్డంగుల్లో ఉన్నట్లు మార్కెట్‌ కమిటీ అధికారులు వివరాలు సేకరించారు.

కాగా గత ఏడాది నిల్వచేసిన వాటిని ఇప్పుడు ఎంత ధర వస్తే అంతకు విక్రయించేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధర కూడా వాటికి లభించడం లేదు. ఇందుకు కారణం నాణ్యత లోపించడమే. మిర్చి ఎప్పుడైనా ఎర్రరంగులో ఉంటేనే ఎగుమతిదారులు కొనుగోలు చేస్తారు. అయితే స్టోరేజ్‌లలో గత ఏడాది నిల్వ చేసినవి నలుపు రంగు తిరిగింది. సహజంగా స్టోరేజ్‌లలో లాట్‌లలోని టిక్కీలను తిరగేస్తుండాలి. అయితే ఎలా పెట్టినవి అలానే కదిలించకుండా ఉంచడంతో చాలా టిక్కీల్లోకి ఫంగస్‌ చేరిపోయింది. దీంతో వాటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఒక విధంగా తాలుకాయల కింద లెక్కకట్టి వాటిని క్వింటాల్‌ రూ.8వేలకు కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. దీనివలన క్వింటాల్‌కి ఒక్కో రైతు రూ.10 వేలకు పైగానే నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా రాబోయే మూడు నెలల్లో ప్రస్తుతం కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ ఉన్న 70 లక్షల టిక్కీల్లో సింహభాగం విక్రయం జరగకపోతే నవంబరు నెల నుంచి కొత్త పంట వస్తుంది. అప్పుడు రైతులు మరింతగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెటింగ్‌ అధికారులు రైతుల పక్షాన నిలిచి తరచుగా ఎక్స్‌పోర్టర్లతో సమావేశాలు నిర్వహించి కొనుగోళ్లు పెరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 30 , 2024 | 12:00 AM