యార్డుకు.. లక్షన్నర టిక్కీలు
ABN , Publish Date - Nov 12 , 2024 | 11:33 PM
మిర్చి కొత్త పంట రాక ప్రారంభం అవుతుండగా.. కోల్డ్‌స్టోరేజ్‌ల్లో నిల్వ చేసిన టిక్కీలను విక్రయించేందుకు రైతులు పోటీ పడుతున్నారు. ఈ రెండు నెలల్లో విక్రయించుకోలేకపోతే జనవరి నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి వచ్చే కొత్త పంటతో ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తూ ప్రస్తుత అనసీజనలో రోజుకు లక్షన్నర టిక్కీల శాంపిల్స్‌ని విక్రయానికి పెడుతున్నారు.
క్వింటాల్‌కు రూ.1500 తగ్గిన ధర
మిర్చి విక్రయానికి పోటీపడుతోన్న రైతులు
కృష్ణ, ప్రకాశం, నంద్యాల నుంచి కూడా రాక
50 వేల టిక్కీలకే ఈనామ్‌లో బిడ్డింగ్ అవకాశం
గుంటూరు, నపంబరు 12 (ఆంధ్రజ్యోతి): మిర్చి కొత్త పంట రాక ప్రారంభం అవుతుండగా.. కోల్డ్‌స్టోరేజ్‌ల్లో నిల్వ చేసిన టిక్కీలను విక్రయించేందుకు రైతులు పోటీ పడుతున్నారు. ఈ రెండు నెలల్లో విక్రయించుకోలేకపోతే జనవరి నుంచి గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి వచ్చే కొత్త పంటతో ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తూ ప్రస్తుత అనసీజనలో రోజుకు లక్షన్నర టిక్కీల శాంపిల్స్‌ని విక్రయానికి పెడుతున్నారు. అయితే ఎగుమతుల డిమాండ్ లేకపోవడంతో కనీసం 50 శాతం టిక్కీలు కూడా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో ధర నేలచూపులు చూడటం ప్రారంభించింది. కొద్ది రోజుల నుంచి గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచే కాకుండా కృష్ణ, ప్రకాశం, నంద్యాల నుంచి కూడా రైతులు కోల్డ్‌స్టోరేజ్‌ల నుంచి మిర్చి టిక్కీలను తీసుకొస్తున్నారు. అన సీజనలో రైతులు కేవలం శాంపిల్స్ మాత్రమే తీసుకొస్తారు. ఆయా శాంపిల్స్‌కు సంబంధించిన లాట్స్‌లో ఎన్ని టిక్కీలు ఉన్నాయో పేర్కొంటారు. ఆ విధంగా చూసుకుంటే రోజుకు 1.50 లక్షల టిక్కీలకు సంబంధించిన శాంపిల్స్ పెడుతున్నారు. అన సీజనలో ఇంత భారీగా మిర్చి టిక్కీలను విక్రయానికి పెట్టిన దాఖలాలు గతంలో లేవు. ఈ కారణంతో మేలిమి రకాలు నెల క్రితం క్వింటాల్ రూ.18500 దాటగా నేడు రూ.1500లకు పైగా తగ్గాయి. మంగళవారం గుంటూరు మిర్చియార్డులో తేజ వెరైటీ క్వింటాల్ రూ.16500, ఆర్మూరు, బ్యాడిగి రకాలు రూ.12500, 334 రకం రూ.13 వేలు ధర మాత్రమే లభించింది.
క్షీణించిన ఎగుమతులు
బంగ్లాదేశ, చైనా దేశాలకు ఎగుమతులు తగ్గిపోయాయి. బంగ్లాదేశలో కొత్త పంట మార్కెట్‌ని ముంచెత్తడంతో దాని ప్రభావం తేజపై పడింది. చైనాలోనూ కొత్త పంట వచ్చిన కారణంగా ఆ దేశ దిగుమతిదారులు ఆర్డర్స్ పెట్టడం లేదు. మిర్చియార్డులో ఎక్స్‌పోర్టు వెరైటీలుగా తేజ, బ్యాడిగి, ఆర్మూరుకు గుర్తింపు ఉన్నది. మిగతా రకాలన్నీ కారం తయారీకి వినియోగిస్తారు. అలాంటిది ఇప్పుడు తేజ, బ్యాడిగి, ఆర్మూరుకు డిమాండ్ లేకపోవడంతో ఎగుమతులు జరగడం లేదు. శీతల గిడ్డంగుల్లో నేటికీ 35 లక్షల మిర్చి టిక్కీల వరకు నిల్వ ఉన్నట్లు మార్కెటింగ్ వర్గాల సమాచారం. కర్ణాటక, నంద్యాల నుంచి రోజుకు వెయ్యికి పైగా కొత్త మిర్చి పంట టిక్కీలు వస్తున్నాయి. వీటి వల్ల కోల్డ్‌స్టోరేజ్‌లలోని నిల్వలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. మరో రెండు నెలల పాటు రోజుకు 50 వేలకు పైగా మిర్చి టిక్కీల విక్రయం జరిగితేనే కోల్డ్‌స్టోరేజ్‌లు ఖాళీ అవుతాయి. కాగా ప్రస్తుతం నిల్వ ఉన్న టిక్కీలలో 15 లక్షల టిక్కీల వరకు తాలుకాయలు ఉన్నట్లు సమాచారం.
ధర పతనంపై రైతుల్లో ఆందోళన
గత ఏడాది మిర్చి క్వింటాల్ ధర రూ.19 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉన్నప్పుడు రైతులు ఇంకా ఎక్కువ ధర వస్తుందని ఆశించి డిమాండ్ ఉన్నా విక్రయించలేదు. అప్పట్లో క్వింటాల్ రూ.28 వేలకు చేరుకుంటుందని అంతా భావించారు. అయితే అప్పటి నుంచి ధర పెరగకపోగా ఇంకా తగ్గింది. ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో మార్కెట్‌లో వచ్చిన ధరకు విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ కారణంగా కోల్డ్‌స్టోరేజ్ చార్జీల రూపంలో భారీగానే నష్టపోతున్నారు. ఇంకా కోల్డ్‌స్టోరేజ్‌ల నుంచి సరుకు బయటకు తీసుకురాకపోతే మరింత నష్టపోవాల్సి ఉంటుందన్న భావనతో ప్రస్తుతం డిమాండ్‌కు మించి మిర్చి టిక్కీలను తీసుకొస్తున్నారు. అయితే ఎగుమతుల డిమాండ్ లేకపోవడంతో కనీసం 50 శాతం టిక్కీలు కూడా కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో ధర నేలచూపులు చూస్తోంది. వివిధ రకాల మిరపకాయలకు క్వింటాల్‌కు దాదాపుగా రూ.1500 వరకు ధర తగ్గినట్లు దిగుమతి వ్యాపారులు చెబుతున్నారు. ఇంకా ధర తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.