Share News

నరేంద్ర వర్గం.. నిర్వేదం

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:40 AM

పొన్నూరు నుంచి ఆరు సార్లు విజయం సాధించి పార్టీ కోసం అహరహం శ్రమించే తమ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కూటమి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం దక్కలేదని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు నిర్వేదంలో ఉన్నారు.

నరేంద్ర వర్గం.. నిర్వేదం
ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర

చీఫ్‌విప్‌ పదవి ఆశించి ధూళిపాళ్ల భంగపాటు

విప్‌ ప్రతిపాదనపై ఎమ్మెల్యే నరేంద్ర విముఖత

రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు మొక్కుబడిగా హాజరు

తమ నేతకు అన్యాయం జరిగిందని అనుయాయుల అసంతృప్తి

గుంటూరు, పొన్నూరుటౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పొన్నూరు నుంచి ఆరు సార్లు విజయం సాధించి పార్టీ కోసం అహరహం శ్రమించే తమ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కూటమి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం దక్కలేదని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు నిర్వేదంలో ఉన్నారు. నరేంద్రకు అన్యాయం జరిగిందంటూ రెండు రోజులుగా వివిధ సామాజిక వర్గాల నేతలు పత్రికా ప్రకటనలతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఈ పర్యాయం చంద్రబాబు కేబినెట్‌లో నరేంద్రకు చోటు దక్కుతుందని, ఆ తర్వాత కీలక పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు. 2014లో ఐదో సారి గెలుపొందినప్పుడే నరేంద్రకు మంత్రి పదవి ఖాయమని భావించారు. అప్పట్లో టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమకు ఇవ్వకపోయినా పర్వాలేదు.. నరేంద్రకు ఇవ్వడానికి వీల్లేదని అడ్డుపడ్డారు. సంగం డెయిరీ చైర్మనగా నరేంద్ర వ్యవహరిస్తున్నందున ఆయనకు ప్రత్యేకంగా మంత్రి ఇవ్వాల్సిన అవసరం లేదనే సాకు కూడా ప్రత్యర్థి వర్గం లేవనెత్తుతున్నది. 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన నరేంద్ర ఐదేళ్లుగా పార్టీకి కొమ్ముకాస్తూ అధినేత చంద్రబాబుకు అండగా ఉంటూ వచ్చారు. జగన సీఎంగా ఉన్న సమయంలో ఆయనపై నిత్యం విమర్శలు చేస్తూ ఒక దశలో జగన నా వెంట్రుక కూడా పీకలేడని విమర్శించి 32 రోజులు జైలు పాలయ్యారు. అయినా వెరవకుండా వైసీపీ ప్రభుత్వ తీరుపై పోరాటం ఆపలేదు. ఈ పర్యాయం ఆరో సారి నరేంద్ర విజయాన్ని సాఽధించగా తొలుత మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆయన అనుయాయులు భావించారు. అయితే కుల సమీకరణల్లో భాగంగా అవకాశం దక్కలేదు. ఆ తర్వాత చీఫ్‌విప్‌ పదవి దాదాపు ఖాయమని ప్రచారం జరిగింది. అయితే పల్నాడు జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడంతో ఆ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేయడంతో నరేంద్ర పేరు వెనక్కు వెళ్ళిపోయింది. వినుకొండ నుంచి గెలుపొందిన జీవీ ఆంజనేయులును చీఫ్‌విప్‌ పదవి వరించింది. ఈ క్రమంలో నరేంద్రకు విప్‌ పదవి ఇస్తామని ప్రతిపాదించగా ఆయన సుముఖత వ్యక్తం చేయనట్లు తెలిసింది. కేబినెట్‌ హోదా స్థాయి పదవిని ఆశిస్తున్నట్లు నరేంద్ర అధిష్ఠానానికి తెలియజేసినట్లు సమాచారం. కాగా నరేంద్రకు చీఫ్‌విప్‌ పదవి రాలేదని తెలిసినప్పటి నుంచి పార్టీ శ్రేణులు అసంతృప్తి గళం వినిపిస్తున్నాయి. నరేంద్ర కూడా కొంత మనస్థాపానికి గురై రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలకు మొక్కుబడిగా హాజరవుతున్నారు.

ప్రతిసారీ నిరాశే

రాష్ట్ర ప్రభుత్వ పదవుల పందేరంలో పొన్నూరు నియోజకవర్గానికి సరైన ప్రాధాన్యం లభించడంలేదని టీడీపీ శ్రేణులు అసంతృత్తి, ఆవేదనకు గురవుతున్నాయి. నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా నిలిపిన ఘనత ధూళిపాళ్ల కుటుంబానిది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పొన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికై 1989 వరకు రెవెన్యూ వాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో రోడ్డు ప్రమాదంలో వీరయ్యచౌదరి మృతి చెందగా ఆయన వారసుడిగా నరేంద్ర రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆయన వరసుగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. 2019 ఎన్నికలో స్వల్ప తేడాతో ఓటమి పాలైనా తిరిగి 2024లో అఖండ విజయాన్ని సాధించారు. అయితే ప్రతిసారి నరేంద్ర పేరు మంత్రి పదవి రేసులో ఉండటం భంగపడటం నరేంద్రతో పాటు ఆయన అనుయాయులకు పరిపాటిగా మారింది. వీరయ్యచౌదరి తర్వాత 35 ఏళ్లుగా నియోజకవర్గానికి అమాత్య యోగం దక్కలేదు. అంతే కాకుండా నామినేటెడ్‌ పదవుల్లో సైతం పొన్నూరుకు సరైన ప్రాథాన్యం లేదని కార్యకర్తలు తీవ్ర నిరాశతో ఉన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:41 AM