ముసాయిదా ముద్రణకు సిద్ధం
ABN , Publish Date - Nov 21 , 2024 | 01:34 AM
కృష్ణా - గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక కోసం జరుగుతోన్న ఓటరు నమోదు ప్రక్రియ ముసాయిదా జాబితాల ప్రచురణ దశకు చేరుకున్నది. నోటిఫికేషన ప్రకారం ఆమోదించిన దరఖాస్తుదారుల పేర్లతో ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణకు చర్యలు చేపట్టారు.
పట్టభద్రుల దరఖాస్తులు దాదాపు పరిష్కారం
బుధవారం సాయంత్రానికి 5 శాతమే పెండింగ్
ఓటు కోసం 3 లక్షల 32 వేల 783 మంది దరఖాస్తు
23న డ్రాఫ్టు లిస్టు విడుదల చేస్తామన్న ఈఆర్‌వో కాజావలి
గుంటూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కృష్ణా - గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక కోసం జరుగుతోన్న ఓటరు నమోదు ప్రక్రియ ముసాయిదా జాబితాల ప్రచురణ దశకు చేరుకున్నది. నోటిఫికేషన ప్రకారం ఆమోదించిన దరఖాస్తుదారుల పేర్లతో ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణకు చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి వరకు దరఖాస్తుల పరిష్కారానికి సమయం ఉండటంతో పెండింగ్‌లో ఉన్న 5 శాతం కూడా క్లియర్ చేసి డ్రాఫ్టు ఓటరు లిస్టుని ప్రింటింగ్‌కు పంపుతామని ఈఆర్‌వో ఎనఎస్‌కే కాజావలి తెలిపారు. ఈసీ ఆమోదంతో ఈ నెల 23న తుది ఓటర్ల జాబితాని ప్రచురించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు హార్డ్/సాఫ్టు కాపీలను అందజేస్తామన్నారు. పట్టభద్రులు ఈ దఫా ఓటరు నమోదులో ఎక్కువగా ఆనలైన సర్వీసులను వినియోగించుకున్నారు. ఈసీఐ వెబ్‌సైట్ ద్వారా ఫారం-18లను పంపించారు. బాపట్ల జిల్లాలో 21519, ఏలూరులో 14709, గుంటూరులో 91013, కృష్ణాలో 48040, ఎనటీఆర్‌లో 58154, పల్నాడులో 50300 మంది కలిపి మొత్తం 2 లక్షల 83 వేల 735 మంది ఆనలైనలో దరఖాస్తు చేసుకున్నారు. అలానే ఆఫ్‌లైనలో ఈ ఆరు జిల్లాల నుంచి 49048 మంది దరఖాస్తులు పెట్టారు. ఆనలైన, ఆఫ్‌లైనలో కలిపి మొత్తం 3 లక్షల 32 వేల 783 మంది ఓటుహక్కు కోసం దరఖాస్తు చేశారని ఎన్నికల అధికారులు తెలిపారు.
దరఖాస్తుల పరిష్కారం ఇలా..
ఓటరు దరఖాస్తులను మూడు దశల్లో పరిష్కరించారు. తొలుత బీఎల్‌వోల ద్వారా కార్యశాలలో దరఖాస్తులను పరిశీలింపచేశారు. ఆ తర్వాత వాటిని ఏఈఆర్‌వోలు పరిశీలించి ఆమోదించారు. వాటిని ఆఖరుగా ఈఆర్‌వో పరిశీలించి ఆమోదం తెలిపారు. అర్హతులు సరిగా జత చేయని దరఖాస్తులను తిరస్కరించారు. ఆనలైనలో వచ్చిన దరఖాస్తుల్లో 2 లక్షల 35 వేల 295 ఆమోదించారు. 32,093 తిరస్కరించారు. ఇంకా ఏఈఆర్‌వో లాగినలో 11,758, ఈఆర్‌వో వద్ద 4589 పెండింగ్‌లో ఉన్నాయి. ఆఫ్‌లైనలో వచ్చిన దరఖాస్తుల్లో 47742 ఆమోదించారు. 980 తిరస్కరించారు. 326 పెండింగ్‌లో ఉన్నాయి.
గుంటూరులోనే ఎక్కువ దరఖాస్తుల పెండింగ్
బుధవారం సాయంత్రానికి పెండింగ్ ఉన్న 5.01 శాతం దరఖాస్తుల్లో ఎక్కువ సంఖ్యలో గుంటూరు జిల్లాలోనివే ఉన్నాయి. మొత్తం 16673 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే వాటిల్లో 11249 గుంటూరు జిల్లాలోనివే. అందులోనూ గుంటూరు నగరంలోనివి ఎక్కువగా ఉన్నాయి. మిగతా జిల్లాలో దరఖాస్తులను దాదాపుగా పరిష్కరించారు. బాపట్లలో 751, ఏలూరులో 354, కృష్ణలో 277, ఎనటీలో 1443, పల్నాడులో 2599 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా ఇవన్ని అర్ధరాత్రి లోపు క్లియర్ చేసి ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణ కోసం పంపుతామని ఈఆర్‌వో కాజావలి తెలిపారు.