పట్టభద్ర ఓటర్లు.. 2.90 లక్షలు
ABN , Publish Date - Nov 24 , 2024 | 01:16 AM
కృష్ణ - గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాని ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆరు జిల్లాల్లో కలిపి 2 లక్షల 90 వేల 978 మంది దరఖాస్తులను ఆమోదించి వారికి ఓటుహక్కు కల్పిస్తూ ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చి విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం సాయంత్రం డ్రాఫ్టు ఓటరు లిస్టుని విడుదల చేసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేసింది.
ముసాయిదా జాబితా విడుదల
అర్హులు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు
40వేలకుపైగా దరఖాస్తుల తిరస్కారం
గుంటూరు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణ - గుంటూరు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాని ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆరు జిల్లాల్లో కలిపి 2 లక్షల 90 వేల 978 మంది దరఖాస్తులను ఆమోదించి వారికి ఓటుహక్కు కల్పిస్తూ ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చి విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం శనివారం సాయంత్రం డ్రాఫ్టు ఓటరు లిస్టుని విడుదల చేసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేసింది. ఇంచుమించుగా 40 వేలకు పైగా దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించింది. ఏ కారణంతో ఓటుహక్కుని తిరిస్కరించారో కూడా దరఖాస్తుదారుడు సంబంధిత బీఎల్‌వో/ఏఈఆర్‌వోని సంప్రదించి తెలుసుకోవచ్చు. కాగా తిరస్కరించిన దరఖాస్తులపై అభ్యంతరాలుంటే నివేదించుకునే అవకాశం కల్పించింది. అలానే ఇంకా ఎవరైనా ఓటరుగా నమోదు కాక పోయి ఉంటే కొత్తగా ఫారం-18 దరఖాస్తు చేసుకునే వెసులుబాటుని కల్పించింది. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటుహక్కు కోసం గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణ, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి ఆనలైన/ఆఫ్‌లైనలో 3 లక్షల 32 వేల 783 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని బీఎల్‌వోలు తొలుత పరిశీలించి అన్ని సవ్యంగా ఉంటే ఏఈఆర్‌వోకు నివేదించారు. ఏఈఆర్‌వో తన రీమార్కులుతో ఆమోదించడమా, తిరస్కరించడమా అనేది పేర్కొంటూ ఈఆర్‌వోకు పంపారు. ఏఈఆర్‌వోల రీమార్కులు నిబంధనల మేరకు ఉన్నవో, లేవో సరి చూసి ఈఆర్‌వో ఖాజావలి తుది నిర్ణయం తీసుకున్నారు. ఓటరు జాబితాలను దరఖాస్తుదారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సరి చూసుకుని వాటిపై ఏమైనా క్లెయిమ్‌లు/అభ్యంతరాలు ఉంటే నివేదించాలని ఈఆర్‌వో సూచించారు. ఇందుకోసం డిసెంబరు 9 వరకు అవకాశం ఉందని చెప్పారు. తమ వద్దకు వచ్చిన క్లెయిమ్‌లు/అభ్యంతరాలను డిసెంబరు 25వ తేదీ లోపు పరిష్కరించి తుది ఓటర్ల జాబితాని ఆ నెల 30న విడుదల చేస్తామన్నారు. ఓటరు నమోదు కోసం ఏఈఆర్‌వోలు 188, డిజిగ్నేటెడ్ అధికారులు 104, అదనపు డిజిగ్నేటెడ్ అధికారులు 119 మంది సేవలను నియోగించుకున్నట్లు తెలిపారు. ఈ దఫా పోలింగ్ కోసం ఆరు జిల్లాలో 416 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుకు ఈసీ నిర్ణయించింది. వాటిలో ఏలూరు జిల్లాలో 20, కృష్ణాలో 76, ఎనటీఆర్‌లో 101, గుంటూరులో 118, బాపట్లలో 28, పల్నాడు జిల్లాలో 73 పోలింగ్ కేంద్రాలను వినియోగించనున్నారు. క్లెయిమ్‌ల సమయంలో ఓటర్ల సంఖ్య పెరిగితే పోలింగ్ కేంద్రాల సంఖ్యని కూడా పెంచే అవకాశం ఉన్నది.
పట్టభద్రుల్లో పురుషులదే పైచేయి
జిల్లాలో సాధారణ ఓటర్లను చూసుకుంటే గత కొన్ని దశాబ్ధాలుగా మహిళలే పైచేయిగా ఉన్నారు. వెయ్యి మంది పురుషులు ఉంటే 1070 మంది మహిళలు ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇటీవల విడుదల చేసిన ఎస్‌ఎస్‌ఆర్-2025 ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్లు 17 లక్షల 94 వేల 25 మంది ఉంటే మహిళలు 9 లక్షల 27 వేల 157, పురుషులు 8 లక్షల 66 వేల 710 మంది ఉన్నారు. ఈ విధంగా 60 వేల 447 ఎక్కువ ఓట్లతో మహిళలు పైచేయిగా ఉన్నారు. అయితే పట్టభద్రుల విషయానికి వచ్చేసరికి పురుషులే ఆధిక్యంలో ఉన్నారు. లక్షా 75 వేల 360 మంది పురుషులు ఉంటే మహిళలు లక్షా 15 వేల 579 మంది ఉన్నారు. 59,781 ఓట్లతో పురుషులు పైచేయిగా ఉన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే చదువు విషయంలో నేటికీ అంతరాలు కొనసాగుతున్నట్లు స్పష్టమౌతుంది. చాలా ఇళ్లల్లో పురుషులను ఉన్నత చదువులు చదివిస్తూ విద్యార్థినులను ఇంటర్మీడియట్ వరకే పరిమితం చేస్తున్నారు. ఈ కారణంగానే ఓటరు నమోదులో వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది.
ముసాయిదా ఓటర్ల జాబితా
జిల్లా పేరు - పురుషులు - మహిళలు - ట్రాన్సజెండర్లు - మొత్తం
ఏలూరు - 8998 - 5574 - 0 - 14572
కృష్ణ - 31950 - 24601 - 5 - 56556
ఎన్టీఆర్ - 38270 - 26110 - 11 - 64391
గుంటూరు - 50683 - 35980 - 16 - 86679
బాపట్ల - 12883 - 7500 - 4 - 20387
పల్నాడు - 32576 - 15814 - 3 - 48393
మొత్తం - 175360 - 115579 - 39 - 290978