నామినేటెడ్ జోష్
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:24 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులపై టీడీపీ నేతలతో పాటు క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఆశావహులు వందల సంఖ్యలో ఉండడంతో పాటు సామాజిక కూర్పు కూడా క్లిష్టతరంగా మారడంతో నామినేటెడ్ పదవుల ప్రకటన విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది.
జిల్లాలో పదవుల సందడి
కూటమి శ్రేణుల్లో ఉత్సాహం
పదవుల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట
(బాపట్ల, ఆంధ్రజ్యోతి)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులపై టీడీపీ నేతలతో పాటు క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఆశావహులు వందల సంఖ్యలో ఉండడంతో పాటు సామాజిక కూర్పు కూడా క్లిష్టతరంగా మారడంతో నామినేటెడ్ పదవుల ప్రకటన విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ సందిగ్దానికి తెరదించుతూ వరుసగా నామినేటెడ్ పదవుల ప్రకటనలు వస్తుండడం, వాటిల్లో జిల్లాకు కూడా సముచిత ప్రాధాన్యం దక్కడంతో టీడీపీలో కొత్త జోష్ కనబడుతోంది. ఇకపై ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాల్లో నామినేటెడ్ పదవులు పొందిన వారికి కూడా అధికారిక భాగస్వామ్యం దక్కనుంది. ప్రభుత్వం చేపట్టబోయే వివిధ కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి నామినేటెడ్ పదవులు ఉపకరించనున్నాయి. మరోవైపు జిల్లాలో నామినేటెడ్ పదవుల విషయంలో ఎస్సీ, బీసీలకు అగ్రతాంబూలం దక్కింది. ఇప్పటికే వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు డెరెక్టర్లను ప్రభుత్వం ప్రకటించింది. మరికొద్ది రోజుల్లోనే మార్కెట్ యార్డు చైర్మన్లతో పాటు మరిన్ని పదవుల ప్రకటన ఉండనుంది. దీంతో మరికొన్ని రోజుల పాటు టీడీపీతో పాటు జనసేన, బీజేపీలలో ఈ పదవుల సందడి కనబడనుంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల మీద క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసి మొన్నటి ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం
రాని వారికి పదవుల పంపకంలో ప్రాధాన్యం ఇచ్చారు. అదే విధంగా పార్టీపై కనబరచిన విధేయతను కూడా ప్రామాణికంగా తీసుకునే నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించారు. వీటన్నింటితో పాటు మొన్నటి పదవుల ప్రకటనల్లో జిల్లాకు మూడు కీలకమైనవి ఇస్తే అందులో ఒకటి ఎస్సీ, రెండు బీసీలకు కేటాయించారు. మరో ఇద్దరికి డైరెక్టర్లుగా అవకాశం కల్పించారు. వీటిలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన చైర్మన పదవి జనసేనకు వరించగా, డైరెక్టర్లలో ఒకటి బీజేపీకి దక్కింది.
ప్రభుత్వంలో భాగం మరింతగా..
ప్రభుత్వం చేసే వివిధ ప్రజాపయోగ పనులను జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉంటుంది. ఇకపై నామినేటెడ్ పదవులు పొందినవారు ప్రభుత్వం జిల్లాలో చేపట్టబోయే కార్యక్రమాల్లో అధికారికంగా భాగస్వామ్యం కానున్నారు. వారికి దక్కిన నామినేటెడ్ పదవుల ఆలంబనగా మరింత మందికి ప్రభుత్వం వైపు నుంచి మంచిచేయడం ద్వారా పార్టీ ప్రతిష్ఠను ఇనుమడింప చేసే అవకాశం వారికి దక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరికొన్ని రోజుల పాటు..
నామినేటెడ్ పదవులకు సంబంధించి డైరెక్టర్ల నియామక ప్రక్రియ ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పటికే వీటి విషయంలో ఇద్దరికీ అవకాశం దక్కగా ఒకటి బీజేపీకి, మరొకటి టీడీపీకి దక్కింది. ఇంకా చాలా కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం పెండింగ్ ఉండడంతో మరింత మందికి అవకాశం దక్కనుంది. అదేవిధంగా మార్కెట్‌యార్డు చైర్మన్లతో పాటు త్వరలోనే జరగబోయే సాగునీటి సంఘాల ఎన్నికల వరకు కూటమి పార్టీల్లో ఈ పదవుల సందడి కొనసాగనుంది.