ఆదాయం.. వద్దంట
ABN , Publish Date - Nov 18 , 2024 | 01:10 AM
ఆదాయ వనరులను అందిపుచ్చుకోవడం.. లేదంటే వాటి కోసం అన్వేషించడం పరిపాటి. ఆదాయ వనరులను పెంచుకుని తద్వారా అభివృద్ధి పనులకు నిధులను సమకూర్చుకోవాల్సిన బాధ్యత మున్సిపాల్టీలది. కానీ నరసరావుపేట మున్సిపాల్టీ మాత్రం ఉన్న ఆదాయ వనరులను గాలికి వదిలేసి ఆదాయాన్ని చేజార్చుకోవడంలో ముందున్నది.
74 దుకాణాల లీజుపై నిర్లక్ష్యం
గత ఐదేళ్లూ పాడుపెట్టిన అధికారులు
ఇప్పటికి రూ.2.50 కోట్ల కోల్పోయిన మున్సిపాల్టీ
అధికారుల తీరుపై నరసరావుపేటవాసుల ఆగ్రహం
ఆదాయ వనరులను చేజార్చుకోవడంలో ముందున్న వైనం
(నరసరావుపేట, ఆంఽధ్రజ్యోతి)
ఆదాయ వనరులను అందిపుచ్చుకోవడం.. లేదంటే వాటి కోసం అన్వేషించడం పరిపాటి. ఆదాయ వనరులను పెంచుకుని తద్వారా అభివృద్ధి పనులకు నిధులను సమకూర్చుకోవాల్సిన బాధ్యత మున్సిపాల్టీలది. కానీ నరసరావుపేట మున్సిపాల్టీ మాత్రం ఉన్న ఆదాయ వనరులను గాలికి వదిలేసి ఆదాయాన్ని చేజార్చుకోవడంలో ముందున్నది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని మున్సిపల్ దుకాణాల సముదాయాల్లోని 74 దుకాణాలను లీజుకు ఇవ్వకుండా పాడుబెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఆ దుకాణాల లీజుకు వేలం వేసి ఆదాయం సమకూర్చుకోవాలన్న ఆలోచన అధికారులు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుకాణాలను లీజుకు ఇచ్చి వాటి ద్వారా ఏటా లక్షల్లో ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. సొంత షాపులైతే ఇలానే ఆదాయం లేకుండా వదిలేస్తారా.. అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు దుకాణాలను లీజుకు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు దాదాపు రూ.2.50 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. టీడీపీ కౌన్సిల్ హయాంలో రూ.7.40 కోట్లతో 66 దుకాణాలతో నాగసరపు సుబ్బరాయ గుప్తా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఇందులో 53 దుకాణాలను వినియోగించడంలేదు. ఇక్కడ దుకాణాలను హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు వినియోగిస్తున్నారు. ఈ షాపులకు కూడా పూర్తిస్థాయిలో అద్దెలు ఖరారు చేయలేదు. రైతుల కోసం కాంప్లెక్స్‌లో విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినా వీటిని వినియోగించడంలేదు. ఈ గదుల్లో 6, 7 వార్డుల సచివాలయాలను ఏర్పాటు చేశారు. రైతుల కోసం నిర్మించిన గదుల్లో సచివాలయాలు ఏర్పాటు విమర్శలకు దారితీస్తోంది. ఆడిట్ కార్యాలయాన్ని కూడా ఇదే కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నారు.
షాపులు ఉన్నా రోడ్లపైనే విక్రయాలు
మటన, చేపల మార్కెట్లను మూసివేసి ఉంచారు. సుబ్బరాయ గుప్తా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని ప్రధాన రహదారి వైపు ఉన్న పది షాపులను కూడా లీజుకు ఇవ్వలేదు. దీంతో రోడ్లపైనే ప్రతి ఆదివారం మాంసం, చేపల విక్రయాలు జరుగుతున్నాయి. వీటిని నిరోధించి ఈ షాపులను తరలించే ప్రయత్నాలు జరగడంలేదు. ఈ షాపుల షట్టర్లకు కనీసం తాళాలు కూడా వేయలేదు. వీటిలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. మందుబాబులు ఈ షాపులను అడ్డగా మార్చుకున్నారు. ఇక్కడ అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తున్నది. ఈ దుకాణాలను లీజుకు ఇవ్వకపోవడంతో ఇప్పటి వరకు మున్సిపాల్టీ రూ.1.50 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని అంచనా.
కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్సులో..
స్టేషన్ రోడ్డులోని కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్సులో 21 షాపులు పాటుబెట్టి ఉన్నాయి. దాదాపు 11 ఏళ్లుగా ఈ షాపులను లీజుకు ఇవ్వలేదు. కాంప్లెక్స్ నిర్మాణానికి ముందు ఉన్న పాత కాంప్లెక్స్‌లో ఉన్న లీజుదారులకు తిరిగి షాపులు ఇచ్చే ఒప్పందంతో కొత్త కాంప్లెక్స్‌ను నిర్మించారు. అయితే సదరు బాధితులకు షాపులు కేటాయించకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. వారితో మున్సిపల్ అధికారులు చర్చలు జరిపి దుకాణాలను కేటాయించే ప్రయత్నాలు జరగడంలేదు. దీంతో మున్సిపాల్టీ భారీగా ఆదాయన్ని కోల్పోతోంది. దాదాపు రూ.కోటి వరకు ఆదాయాన్ని కోల్పోయినట్టు అంచనా.