Share News

నాడు-నేడు అవినీతిపై విచారణ చేయాలి

ABN , Publish Date - Jul 24 , 2024 | 12:26 AM

సెంట్రల్‌ ప్రొక్యూర్మెంట్‌ పేరుతో జగన్‌ చేసిన నాడు-నేడు పనుల్లో భారీ అవినీతిపై సమగ్ర విచారణ చేయాలని మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.

నాడు-నేడు అవినీతిపై విచారణ చేయాలి

పొన్నూరుటౌన్‌, జూలై 23: సెంట్రల్‌ ప్రొక్యూర్మెంట్‌ పేరుతో జగన్‌ చేసిన నాడు-నేడు పనుల్లో భారీ అవినీతిపై సమగ్ర విచారణ చేయాలని మంగళవారం శాసనసభలో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పథకంలో ఫేజ్‌-1, 2 కింద రూ.9వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇంకా రూ.4,700కోట్లు ఖర్చు చేస్తే కానీ పథక నిర్మాణం పూర్తి కాదన్నారు. ఈ పథకం ద్వారా అద్భుతాలు జరిగినట్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని ఎద్దేవా చేశారు. సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పేరుతో టెండర్లు పిలిచి స్థానికంగా కావలసిన ఫర్నిచర్‌ కొనుగోలు చేసి వైసీపీ నాయకులే ఖర్చుబెట్టారని ఆరోపించారు. పొన్నూరు పురపాలక సంఘంలో ఈ పనులను పరిశీలిస్తే పనులు చేయకుండానే నిధులు డ్రా చేసినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. పురపాలక సంఘం పరిధిలో ఐదు పాఠశాలలు పరిశీలిస్తే ఈ అవినీతి బాగోతం వెలుగు చూసినట్లు చెప్పారు. శ్రీరామ మున్సిపల్‌ హైస్కూల్‌లో పథకం కింద రూ.26లక్షలు ఖర్చు చేసి పాత నిర్మాణాలకే రంగులు వేయటం, పాత టాయిలెట్లనే కొత్తగా నిర్మించినట్లు చూపారని ఆరోపించారు. కిందిస్థాయిలో పేరెంట్స్‌ కమిటీ, హెచ్‌ఎంలను ఈ పథకానికి బాధ్యులుగా ఎంచుకున్నారని ఆరోపించారు. వైసీపీ పెద్దలు రాష్ట్రంలో దోచుకుంటే, పట్టణాలు, మండలాల్లో స్థానిక వైసీపీ నాయకులు పాఠశాలలను పంచుకుని ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారని ఆరోపించారు. పాఠశాలల్లో బాగున్న నాపరాయి ఫ్లోరింగ్‌ను తొలగించి గ్రానైట్‌ రాయిని ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఫ్లోరింగ్‌లు వేశారని ఆరోపించారు. ప్రభుత్వ పనులకు ఉచిత ఇసుక అని చెప్పి కాంట్రాక్టర్లకు బిల్లులు చూపించి మినహాయింపులు ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను వేదికగా చేసుకుని వైసీపీ పెద్దలు దోపిడీ చేశారని ఆరోపించారు. ఈ పఽథకం కింద ప్రారంభించిన భవనాలు అసంపూర్తిగా ఆగిపోయి అగమ్య గోచరంగా మిగిలిపోయాయన్నారు. సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే నరేంద్ర విద్యాశాఖ మంత్రిని కోరారు.

Updated Date - Jul 24 , 2024 | 12:26 AM