నిరాడంబరంగా.. బడి సంబరం
ABN , Publish Date - Dec 08 , 2024 | 01:10 AM
బడి పండుగ.. నిరాడంబరంగా, ఆసక్తికరంగా, విద్యార్థులను ఉత్సాహపరుస్తూ, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచనల మధ్య సాగింది.
హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్
బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో పెండింగ్‌లోని నిర్మాణాలకు హామీ
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం అంటూ ముఖ్యమంత్రి పిలుపు
అందరూ బాధ్యతతో ఉంటే విద్యార్థుల భవిష్యత్ బంగారుబాటేనన్న బాబు
(బాపట్ల, ఆంధ్రజ్యోతి)
బడి పండుగ.. నిరాడంబరంగా, ఆసక్తికరంగా, విద్యార్థులను ఉత్సాహపరుస్తూ, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచనల మధ్య సాగింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాపట్ల మున్సిపల్ హైస్కూల్ వేదికగా శ్రీకారం చుట్టారు. నేతల హడావుడి లేకుండా.. హంగు ఆర్భాటాలకు తావులేకుండా.. అధికరదర్పం కానరాకుండా.. కేవలం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థుల భవిష్యత్ బంగారు బాట కావాలంటే అందరూ బాధ్యతగా ఉంటేనే సాధ్యపడుతుందని ఈ మీట్ ద్వారా సందేశమిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ దాదాపు మూడు గంటల పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల మధ్య గడిపారు. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలు సవరించుకోవడం కోసం అర్థవంతమైన చర్చకు ఈ సమావేశం ఆస్కారమిచ్చింది. హైస్కూల్‌లోని తరగతి గదుల్లోకి వెళ్లి నేరుగా విద్యార్థులను వారి తల్లిదండ్రులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కూడా వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఆ తర్వాత ముగ్గుల పోటీలను స్వయంగా లోకేశ్‌తో కలిసి పరిశీలించారు. ముగ్గులు బాగున్నాయంటూ మహిళలను ప్రశంసించారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఉన్న ముగ్గును పరిశీలించిన లోకేశ్ ఇదిముఖ్యమనివ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అనంతరం వేదిక వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఓ విద్యార్థి ఇచ్చిన సందేశం ముఖ్యమంత్రి చేత చప్పట్లు కొట్టించడంతో పాటు అందరూ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ శృతి కలిపారు. సైబర్ మోసాల గురించి ఓ విద్యార్థిని చేసిన ప్రసంగం కూడా ఆలోచింప చేసింది. విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేశ్ నేలపైనే కూర్చొని సహపంక్తి భోజనాలు చేశారు.
పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్‌పై యుద్ధం
రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే ఎక్కడా వినపడకూడదని చంద్రబాబు అన్నారు. పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్ మీద యుద్ధం ప్రారంభం కావాలన్నారు. గంజాయిని కొంతమంది పెరట్లో కూరగాయ మొక్కల్లా పండిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఆ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలిస్తామని తెలిపారు. నిరంతరం నేర్చుకోవడం ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లో హెల్త్ కార్డులు, ప్రోగ్రెస్ కార్డులతో పాటు విద్యార్థుల అటెండెన్స్ సమాచారాన్ని ఫోన్ల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తామన్నారు. పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా జాగ్రత్తగా ఉండాలని వీటి విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ కీలకమన్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌ను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని వసతులతో తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు
పేరెంట్ టీచర్ మీట్ చరిత్ర..
పేరెంట్ టీచర్ మీటింగ్‌లు ఓ చరిత్రగా నిలిచిపోతాయని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ సమావేశం ద్వారా పాఠశాలలో ఉన్న సమస్యలు తెలుస్తాయని, పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు సమాచారం వెళుతుందన్నారు. తమ ప్రభుత్వానికి రంగుల పిచ్చి లేదని, తాను మంత్రిని అయిన వెంటనే రంగులు తీసేయమని ఆదేశాలను జారీ చేశానని గుర్తు చేశారు. స్కూల్స్ లో జాబ్ మేళాలు తప్ప మరే ఇతర సంబంధం లేని కార్యక్రమాలు నిర్వహించకుండా చర్యలు చేపడతామన్నారు. 1 నుంచి 12 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ.944 కోట్లతో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్‌ను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద లక్షలాది మంది విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఉపాఽధ్యాయులు చదువు మాత్రమే చెప్పాలని ఇతర పనులు వేటికీ వారిని వినియోగించరాదని తెలిపారు.
ఉత్సాహ పర్చేవిధంగా పోటీలు...
విద్యార్ధుల తల్లిదండ్రులను ఉత్సాహ పర్చేవిధంగా హైస్కూల్‌లో పోటీలు నిర్వహించారు. చంద్రబాబు, లోకేశ్ అధికారులతో కలిసి పోటీలను తిలకించారు. క్రీడా వికాస కేంద్రంలో ఏర్పాటు చేసిన టగ్గాఫ్ వార్ పోటీలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థుల తండ్రులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి, లోకేశ్‌లు తాడు లాగారు. కార్యక్రమంలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, విద్యాశాఖ చీఫ్ సెక్రటరి కోన శశిధర్, కలెక్టర్ జె.వెంకటమురళి, జాయింట్ కలెక్టర్ ప్రఖర్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.
సర్...సర్ అంటూ లోకేశ్
లకేశ్ తండ్రి చంద్రబాబు. కానీ ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబును తండ్రిలా కాకుండా ముఖ్యమంత్రిలాగానే లోకేశ్ గౌరవించారు. పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ శాఖ మంత్రి అయిన లోకేశ్‌ను వివరాలు అడగడం.. వాటికి లోకేశ్ సర్.. సర్.. అంటూ సమాధానాలు చెప్పారు. వేదికపై కూడా సీఎం పలు సూచనలను మంత్రికి ఇవ్వడం ఆయన వినమ్రంగా అలాగే సర్ అనడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా గమనించారు. విద్యా సంబంధమైనది కార్యక్రమం కావడం సదరు శాఖ మంత్రిగా లోకేశ్ ఆహ్వానం మేరకు హాజరుకాగా, ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి ఈ మీట్‌లో పాల్గొన్నారు.
చంద్రబాబు సూచనలు
- పిల్లల భవిష్యత్ బంగారు మయం కావాలంటే తల్లిదండుల్ర పాత్ర కీలకం. ఇందులో తల్లి పాత్ర మరింత ఎక్కువ. చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్‌ను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఇదే మన సంస్కృతి గొప్పదనం.
- పిల్లల చదువునే తల్లిదండ్రులు ఆస్తిగా భావించాలి. పిల్లల భవిష్యత్ గురించి తల్లిదండ్రులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలి.
- పిల్లలు విచ్చలవిడిగా సెల్‌ఫోన్ వాడకం శ్రేయస్కరం కాదు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎక్కువగా బాధ్యత తీసుకోవాలి. డ్రగ్ కోరల్లో నుంచి పిల్లలను కాపాడుకోవాలి. స్కూల్‌లో టీచర్లు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లల కదలికలను డేగకన్నుతో గమనిస్తూ ఉండాలి. అప్పుడే వారికి భద్రమైన భవిష్యత్ అందించగలం.
- పిల్లలు ఎవరు ఏదీ చెబితే దానని నమ్ముతారు. వారిని అనునిత్యం కాపాడుకుంటూ ఉండాలి.