Share News

బకాయిల భారం

ABN , Publish Date - Dec 05 , 2024 | 01:09 AM

సామాన్యుడు పన్ను చెల్లించకపోతే మున్సిపల్‌ అధికారులు నానాయాగీ చేస్తారు. నగదు సర్దుబాటు కాక ఆలస్యంగా చెల్లిస్తే జరిమానాలు వేస్తారు. అలాంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, వారి ఆస్తులకు సంబంధించిన పన్నులు రూ.లక్షలో పేరుకుపోతున్నా పట్టడంలేదు.

బకాయిల భారం

మొండిబాకీల్లో ప్రభుత్వ కార్యాలయాల వాటానే అధికం

నోటీసులు జారీ చేస్తున్నా పట్టించుకోని శాఖాధికారులు

మార్చికి వసూలు చేయాలని ఆదేశాలు.. లక్ష్యం నెరవేరేనా?

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌)

సామాన్యుడు పన్ను చెల్లించకపోతే మున్సిపల్‌ అధికారులు నానాయాగీ చేస్తారు. నగదు సర్దుబాటు కాక ఆలస్యంగా చెల్లిస్తే జరిమానాలు వేస్తారు. అలాంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, వారి ఆస్తులకు సంబంధించిన పన్నులు రూ.లక్షలో పేరుకుపోతున్నా పట్టడంలేదు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని మున్సిపాలిటీల పరిధిలో పదుల సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా శాఖలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. అయితే కొన్ని శాఖల నుంచి రెండు దశాబ్దాలుగా పన్ను బకాయిలు పేరుకుపోయాయి. అసలు తాము మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము.. మున్సిపాలిటీ నుంచి సౌకర్యాలు పొందుతున్నాము.. అందుకు పన్నులు చెల్లించాలి.. అన్న విషయమే ఆయా శాఖలు మరిచాయి. ఈ కారణంగా ఆయా శాఖల కార్యాలయాలకు సంబంధించి రూ.లక్షల్లో పన్ను బకాయిలు పేరుకుపోయాయి. మార్చి కల్లా బకాయిలు వసూలు చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ధేశించింది. అయితే బకాయిలు చెల్లించాలన్న స్పృహ ఆయా శాఖల అధికారుల్లో లేదు. వసూలు చేయాలన్న ఆలోచన మున్సిపల్‌ అధికారుల్లో కానరావడంలేదు. పురపాలక సంఘాలకు ప్రధాన ఆదాయ వనరు.. పన్నులు. ఇలాంటి పన్నులు పేరుకుపోతున్నా వసూళ్లపై అధికారులు దృష్టి సారించడంలేదని, అందువల్లే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయిలు రూ.కోట్లకు చేరాయని తెలుస్తోంది. పన్నుల వసూళ్లలో కనీస ప్రయత్నం కూడా ఉండటంలేదని ఈ ఆర్థిక సంవత్సరంలో వసూలైన పన్నులను చూస్తే తెలుస్తోంది. కమిషనర్లు ఆయా శాఖల అధికారులకు పన్ను బకాయిలకు సంబంధించి ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేస్తున్నా.. వారు పట్టించుకోవడంలేదు. ఏటికేడు బకాయిలు పేరుకుపోతున్నా చెల్లింపులపై ఆయా శాఖల అధికారులు ఆలోచన చేయడంలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఆస్తి పన్ను కొన్నేళ్లుగా కొండలా పేరుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌ తదితర శాఖల పన్నులు పెద్దఎత్తున పేరుకుపోయి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏపీ సీపీడీసీఎల్‌, పోలీస్‌, జ్యూడిషియల్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖలకు సంబంధించి పన్నులు వసూలు కావాల్సి ఉంది.

తహసీల్దారు కార్యాలయ బాకీ రూ.29 లక్షలు

నరసరావుపేట: మున్సిపాల్టీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ.2.50 కోట్లకుపైగా పేరుకుపోయాయి. తహసీల్దారు కార్యాలయం రూ.29 లక్షలు, పంచాయతీరాజ్‌ రూ.18 లక్షలు, టెలికం రూ17 లక్షలు, టౌన్‌హాల్‌ రూ.17 లక్షలు, పోలీసు రూ.24 లక్షలు, తపాలా కార్యాలయం రూ.13 లక్షలు, ఆర్‌అండ్‌బీ రూ.12 లక్షలు, అంజూమన్‌ రూ.18 లక్షలు, ఎస్సీ సర్వీస్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ రూ.31 లక్షలు, రైల్వేస్టేషన్‌ రూ.9 లక్షలు, పంచాయతీరాజ్‌ గెస్ట్‌హౌస్‌ రూ.8 లక్షలు, ఆర్డీవో కార్యాలయం రూ.7 లక్షలు, ఎన్‌ఎస్‌పీ రూ.24 లక్షలు, గ్రంథాలయం రూ.7 లక్షలు, ఎంపీడీవో కార్యాలయం రూ.7 లక్షలు, సాంఘిక సంక్షేమ శాఖ రూ.7 లక్షలు, సివిల్‌ జడ్జి కోర్టు రూ.7 లక్షలు, షాదీఖానా రూ.5 లక్షలు పన్ను చెల్లించాల్సి ఉంది.

రైల్వేశాఖ నుంచే రూ.13 లక్షలు

పిడుగురాళ్ల: పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మున్సిపాల్టీలకు రూ.కోటి 20 లక్షల పైచిలుకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. పిడుగురాళ్లలో 55 లక్షల 60 వేల 716, దాచేపల్లిలో 25 లక్షల పైచిలుకు, గురజాలలో 41 లక్షలకుపైగా వసూలు కావాలి. వాటిలో ఎక్కువగా పిడుగురాళ్లలో రైల్వేస్టేషన్‌, క్వార్టర్లకు సంబంధించి 13 లక్షల 16 వేల 577 ఉంది. ఆర్‌అండ్‌బీ రూ.10 లక్షలు, తహసీల్దార్‌ రూ.9 లక్షలు, ఎంపీడీవో రూ.4 లక్షలు, పోలీసు క్వార్టర్స్‌ రూ.6 లక్షలు, ప్రాథమిక పాఠశాలలు రూ.3 లక్షల 92 వేలు, ఎన్‌ఎస్‌పీ కార్యాలయాల నుంచి రూ.4 లక్షల 10 వేలు వసూలు కావాల్సి ఉంది. దాచేపల్లిలో మార్కెట్‌ యార్డు 6 లక్షలు, ఆర్‌అండ్‌బీ 2 లక్షల బకాయిలు ఉన్నాయి. గురజాలలో రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలు 9 లక్షల 38 వేలు పైచిలుకు, కోర్టు భవనాలు 8 లక్షల 79 వేల పైచిలుకు, పోలీస్‌ క్వార్టర్స్‌, కార్యాలయాల నుంచి 6 లక్షలకు పైగా బకాయి ఉన్నాయి.

అత్యధికంగా తహసీల్దారు కార్యాలయం

మాచర్ల: మాచర్ల మున్సిపాలిటీకి ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పన్ను రూ.2.48 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. రెవెన్యూ కార్యాలయం రూ.65,92,527, పంచాయతీరాజ్‌ రూ.12,12,379, ఆర్‌అండ్‌బీ రూ.24,04,370, మండల పరిషత్‌ రూ.5,03,846, పోస్టాపీసు రూ.22,18,079 బకాయిలు ఉన్నాయి. బకాయిలు ఉన్న కార్యాలయాలకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ వేణుబాబు తెలిపారు.

1.20 కోట్లకు రూ.10 లక్షలు చెల్లింపు

సత్తెనపల్లి: సత్తెనపల్లి పురపాలక సంఘంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం 78 వరకు ఉన్నాయి. ఈ కార్యాలయాలు పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్ను బకాయి రూ 1.20 కోట్లు ఉంది. నేటికి రూ10.47 లక్షలు మాత్రమే చెల్లించారు. మార్చి నాటికి బకాయిలను వసూలు చేసే పనిలో పురపాలక, రెవెన్యూ యంత్రాంగం, సచివాలయాల ఉద్యోగులు ఉన్నారు.

కేంద్ర కార్యాలయాల బాకీ రూ.26 లక్షలు

వినుకొండ: వినుకొండలో 42 రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా వాటి పన్ను బకాయిలు రూ.1,31,22,405 ఉన్నాయి. రైల్వేస్టేషన్‌ రూ.22,11,249, పోస్టు ఆఫీస్‌ రూ.2,35,544, రైల్వే రూ.1,62,846, టెలికం రూ.20,100 బకాయిలు చెల్లించాలి. ఆర్‌అండ్‌బీ రూ.25,18,291, తహసీల్దార్‌ రూ.16,98,943, ఇంజనీరింగ్‌ స్టోర్‌షెడ్‌ రూ.13,09,680, ఎన్‌ఎస్‌పీ రూ.8,97,459, ఐనవోలు పోలీస్‌స్టేషన్‌ రూ.3,75,890, పంచాయతీరాజ్‌ రూ.5,98,118, ఎస్సీ కార్పొరేషన్‌ కాప్లెక్స్‌ రూ.6,59,588, పీర్‌స్టోర్‌ షెడ్‌ రూ.6,98,568, వినుకొండ పోలీస్‌స్టేషన్‌ రూ.4,75,462, క్వార్టర్స్‌ రూ.4,68,086, జడ్పీ అతిథిగృహం రూ.4,78,582, తహసీల్దారు వసతి గృహానికి రూ.5,30,958, గురుకుల పాఠశాల రూ.5,06,704, సబ్‌ రిజిస్టార్‌ రూ.4,38,192, గిరిజన బాలకల హాస్టల్‌ రూ.3,79,946, ఎస్టీ హాస్టల్‌ రూ.2,17,589, అటవీశాఖ రూ.1,79,123, వ్యవసాయశాఖ రూ.2,00,175, పీడబ్ల్యూ రూ.1,18,133, ఎన్‌ఎస్‌పీ రూ.1,15,337 వరకు బకాయిలు ఉన్నాయి.

రెండు దశాబ్దాలు చెల్లింపులు లేవు

చిలకలూరిపేట: చిలకలూరిపేట మునిసిపాలిటీకి ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయిలు రూ.1.88 కోట్ల వరకు ఉన్నాయి. జిల్లా పరిషత్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆస్తులకు సంబంధించి రెండు దశాబ్దాలుగా, పోలీస్‌ శాఖ నుంచి దశాబ్ద కాలంగా పన్నుల చెల్లింపులు లేవు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం పదేళ్లుగా పన్ను చెల్లించలేదు. ఎస్సీ కార్పొరేషన్‌ దుకాణాలకు సంబంధించి 2005 నుంచి, పంచాయతీరాజ్‌ దుకాణాలు 2009 నుంచి పన్ను బకాయిలు ఉన్నాయి. తహసీల్దారు కార్యాలయం రూ.27.48 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్‌ దుకాణాలకు సంబంధించి రూ.29.27 లక్షలు, పంచాయతీరాజ్‌ దుకాణాల నుంచి రూ.15.29 లక్షలు, శారదా జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ రూ.12.47 లక్షలు, జడ్పీ బంగళా రూ.6.5 లక్షలు, హైస్కూల్‌ రూ.21.79 లక్షలు, ఎస్సీ బాలుర హాస్టల్‌ రూ. 5.92 లక్షలు, అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి రూ.7.15 లక్షలు వసూలు కావాల్సి ఉంది.

బకాయిలు రూ.77.80 కోట్లు

గుంటూరు: గుంటూరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు 984 ఉండగా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో 705 కార్యాలయాలు ఉండగా రూ.35.46 లక్ష బకాయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 279 కార్యాలయాలు ఉండగా బకాయి రూ.77.45 కోట్లు పెండింగ్‌లో ఉంది. ఆయా కార్యాలయాలకి సంబంధించిన బకాయి రూ.77.80 కోట్ల ఉన్నట్లు నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు. రూ.కోట్లలో బకాయిలు పెండింగ్‌లో ఉన్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులను వివరణ కోరగా ఇప్పటికే నోటీసులు పంపించామని తెలిపారు.

రూపాయి కూడా చెల్లించని ఎయిమ్స్‌

మంగళగిరి: మంగళగిరి పరిధిలో ఆస్తిపన్నుల బకాయి పేరుకుపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన బకాయిలు రూ.5,35,32,259 వుంది. మంగళగిరి డివిజన్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.1,03,51,884 ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ప్రధాన తపాలా కార్యాలయం నుంచి రూ.49,5,8,202 బకాయి రావాల్సి ఉంది. ఎయిమ్స్‌ సహా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఎన్నో ఏళ్లుగా బకాయిలు చెల్లించడం లేదు. మంగళగిరి డివిజన్‌లోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి 413 అసెస్‌మెంట్లకు రూ.2,57,72,923 బకాయి ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి శిథిల భవనాలను తొలగించి ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు పన్ను నుంచి మినహాయింపు లభించలేదు.

అసలు రూ.62 లక్షలు.. వడ్డీ రూ.46 లక్షలు

తాడేపల్లి: తాడేపల్లి పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయిలు రూ.62 లక్షలు ఉండగా వడ్డీల రూపంలో మరో రూ.46 లక్షలు రావాల్సి ఉంది. పీడబ్ల్యూడీ వర్క్‌షాప్‌ రూ.31.23 లక్షలు, బోట్‌ యార్డ్‌ రూ.4.56 లక్షలు, తహసీల్దార్‌ కార్యాలయం రూ.3.56 లక్షలు, ఎంపీడీవో కార్యాలయం రూ.3.15 లక్షలు పోలీసు స్టేషన్‌ రూ.1.39 లక్షలు, క్వార్టర్స్‌ రూ.1.46 లక్షలు, సీతానగరం, శ్రీమద్విరామాంజనేయ దేవాలయం రూ.1.65 లక్షలు బకాయిలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

43 కార్యాలయాలు.. రూ.1.45 కోట్ల బకాయి

పొన్నూరు: పొన్నూరులో 43 ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా రూ.1,45,61,975 పన్ను బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. తహసీల్దార్‌ కార్యాలయం రూ.21,52,868, ఫిషరీష్‌ కార్యాలయం రూ.21,46,140, పంచాయతీరాజ్‌ డీఈ కార్యాలయం రూ.16,33,162, ట్రాన్స్‌కో రూ.13,04,645 బకాయిలు ఉన్నాయి. నీటి పారుదలశాఖ, పోలీస్‌స్టేషన్లు, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం, పోలీస్‌ క్వార్టర్ల పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పన్ను బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్‌ రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

అత్యధిక బకాయి డెల్టా విభాగం

తెనాలి: తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయి రూ.4.91 కోట్ల వరకు ఉంది. వీటికి సంబంధించి పెనాల్టీలే రూ.20 లక్షల వరకు ఉన్నాయి. అయితే అత్యధికంగా కృష్ణా పశ్చిమడెల్టా విభాగం రూ.1.18 కోట్లు బకాయి ఉన్నట్లు మున్సిపల్‌ లెక్కలు చెబుతున్నాయి. డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయం రూ.71.49 లక్షలు, పోలీస్‌ శాఖ నుంచి రూ.41.52 లక్షలు వసూలు కావాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ భవనాలకు సంబంధించి రూ.అరకోటి వరకు బకాయి ఉంది. తోటి ప్రభుత్వ శాఖలే కదా అన్న ప్రేమో! లేక ప్రభుత్వ డబ్బే కదా ఎక్కడికి పోతుందిలే అన్న ధీమానో తెలియదు కానీ, ఆయా శాఖలకు ఏటా మార్చినాటికి పలుసార్లు నోటీసులు జారీచేసి తర్వాత మున్సిపల్‌ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోతూనే ఉన్నాయి.

Updated Date - Dec 05 , 2024 | 09:57 AM