పింఛన్లు.. ఒక రోజు ముందే
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:50 AM
డిసెంబరు 1వ తేదీ ఆదివారం.. సెలవు. అంటే వచ్చే నెలలో పింఛన్ ఒకరోజు ఆలస్యంగా అందుతుంది. ఎలా అని ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌దారులు ఆలోచనలో ఉన్నారు.
29న నగదు డ్రా చేసుకోవాలని ఎంపీడీవోలకు ఆదేశాలు
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 7.59 లక్షల మందికి లబ్ధి
రెండు నెలలుగా పెన్షన్ తీసుకోని వారికి నగదు చెల్లింపునకు ఏర్పాట్లు
గుంటూరు సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 1వ తేదీ ఆదివారం.. సెలవు. అంటే వచ్చే నెలలో పింఛన్ ఒకరోజు ఆలస్యంగా అందుతుంది. ఎలా అని ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌దారులు ఆలోచనలో ఉన్నారు. అయితే వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. డిసెంబరు నెల పెన్షన్ ఒక రోజు ముందే అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు 1వ తేదీ ఆదివారం రావడంతో నవంబరు 30వ తేదీ శనివారమే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, ఆయా వ్యాధుల చేత బాధింపబడేవారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబరు 29వ తేదీనే పెన్షన్ సొమ్మును బ్యాంకుల నుంచి డ్రా చేయాలని గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలోని ఎంపీడీవోలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. శనివారం సచివాలయ ఉద్యోగులందరూ పెన్షన్ పంపిణీ కోసం అందుబాటులో ఉండాలని జిల్లా అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. శనివారం పెన్షన్ పొందని వారికి డిసెంబరు 2న అందజేయనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గుంటూరు జిల్లాలో 2,55,258 మందికి, పల్నాడు జిల్లాలో 2,75,070 మందికి, బాపట్ల జిల్లాలో 2,29,635 మందికి ఒక రోజు ముందే పెన్షన్ చేతికి రానుంది. గత ప్రభుత్వ హయాంలో నెల మొదటి తేది సెలవు దినమైతే ఆ మరుసటి రోజు పెన్షన్ పంపిణీ చేసే వారు. అందువల్ల పెన్షన్‌దారులు కొంత ఇబ్బంది పడే వారు. సెలవులు వరుసగా రెండు, మూడు రోజులు వచ్చినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం పెన్షన్‌దారులను ఇదే రీతిలో ఇబ్బందులకు గురిచేసేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్‌దారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ నెలలో బకాయిలు కూడా తీసుకోవచ్చు..
గతంలో లబ్ధిదారులు ఏ కారణం చేతనైనా ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే తర్వాత నెల ఆ మొత్తం కలిపి ఇచ్చే వారుకాదు. దీంతో లబ్ధిదారులు ఆ మొత్తం నష్టపోయినట్లే. రెండు నెలలు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే పూర్తిగా పెన్షన్ తొలగించారు. ఈ క్రమంలో లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఏ కారణం చేతనైనా వరుసగా రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోతే, మూడో నెలలో రెండు నెలల పాత బకాయి కూడా కలిపి తీసుకునేలా నిబంధనలు మార్పు చేసింది. వరుసగా మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోని వారిని పాక్షిక వలసదారులుగా భావిస్తున్నారు. ఆ తర్వాత వచ్చి దరఖాస్తు అందజేస్తే తాత్కాలికంగా నిలిపివేసిన వారి పెన్షన్‌ను పునరుద్ధరిస్తారు. గతంలో ఈ వెసులుబాటు లేదు.
భర్త పెన్షన్ భార్యకు...
ఏ కారణం చేతనైనా పెన్షన్‌దారుడైన భర్త చనిపోతే ఆ పెన్షన్‌ను భార్యకు వెంటనే బదలాయించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భర్త చనిపోయిన పదిహేను రోజుల్లోనే భార్యకు మంజూరు చేస్తారు. లబ్ధిదారులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.