Share News

రహదారులకు మహర్దశ!

ABN , Publish Date - Nov 26 , 2024 | 01:48 AM

ఐదేళ్లపాటు రహదారులను ఆవరించిన గ్రహణం ఎట్టకేలకు వీడుతున్నది.

రహదారులకు మహర్దశ!

ఫ మారుమూల ప్రాంతాల్లో సైతం మరమ్మతు పనులు

ఫ ఉమ్మడి జిల్లాకు భారీగా నిధులు మంజూరు

గుంటూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లపాటు రహదారులను ఆవరించిన గ్రహణం ఎట్టకేలకు వీడుతున్నది. రహదారుల మరమ్మతులు, నిర్వహణ, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. దీంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో రహదారుల మరమ్మతు, విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మూడుజిల్లాల్లో ప్యాచ్‌ వర్కులు, తక్షణ మరమ్మతుల కోసం గత నెలలో రూ. 35 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా రహదారుల అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేసింది.

గుంటూరు జిల్లాకు రూ. 559.84 కోట్లు

విభజిత గుంటూరు జిల్లాలో రహదారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని రహదారులు, వంతెనల నిర్మాణం, అభివృద్ధి కోసం 559.84 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలో 719 కిలోమీటర్ల మేర రహదారుల్లో మరమ్మతులు చేస్తారు. గుంతలు పూడ్చి రోడ్లు వేస్తారు. వాటితోపాటు ఆగిపోయిన ఆర్వోబీలు, వంతెనలు నిర్మించడానికి కూడా నిధులు కేటాయించారు. ఎండీఆర్‌ ప్లాన్‌ కింద జిల్లాలోని 3 రహదారుల్లో 15.6 కి.మీ మేర రోడ్లు వేయనున్నారు. ఇతర జిల్లాలను కలిపే 4 రోడ్లలో 18.4 కి.మీ మేర రోడ్లు వేస్తున్నారు. సీఆర్‌ఎఫ్‌ నిధుల కింద 3 రోడ్లలో 14.75 కి.మీ మేర రోడ్లు వేస్తున్నారు. కాగా న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఫేజ్‌- 1 కింద 262.64 కోట్లతో జిల్లాలోని 13 రోడ్లు 94.11 కి.మీ మేర నిర్మిచనున్నారు. బాగా దెబ్బతిన్న 12 రోడ్లలో 69.84 కి.మీ మేర మరమ్మతులు చేపట్టగా, 50 రోడ్లకు సంబంధించి 222 కి.మీ మేర తక్షణ మరమ్మతులు, ప్యాచ్‌ వర్కులు చేపట్టనున్నారు. ఇంటెన్సివ్‌ ప్యాచ్‌ వర్కుల కింద 19 రోడ్లలో 107.79కి.మీ మేర, అంచులు తెగిన రోడ్ల ప్యాచ్‌ వర్కులు, జంగిల్‌ క్లియరెన్స్‌ కింద 33 రోడ్లలో 176.63 కి.మీ మేర రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వీటితోపాటు హనుమాన్‌పాలెం వద్ద ఆర్‌వోబీ నిర్మాణానికి రూ. 28 కోట్లు కేటాయించారు. కొండవీడు ఘాట్‌ రోడ్డుకు 6.8 కోట్లు కేటాయించారు. వెనిగండ్ల- జొన్నలగడ్డ రోడ్డు, గుంటూరు- నిడమర్రు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. గుంటూరు- బాపట్ల- చీరాల రోడ్డు, గుంటూరు- ఫిరంగిపురం రోడ్డు, ఎయిమ్స్‌ గేటు నుంచి ఎన్‌హెచ్‌- 16 వరకూ అప్రోచ్‌ రోడ్డుల నిర్మాణానికి మోక్షం లభించింది. మంగళగిరి- తెనాలి రోడ్డు దుగ్గిరాల వద్ద, చిలకలూరిపేట- పెదనందిపాడు రోడ్డు, వట్టిచెరుకూరు- పాండ్రపాడు, యర్రగుంట్లపాలెం- తుళ్లూరు, కాజ- ఉప్పలపాడు, గుంటూరు- హనుమాన్‌పాలెం, తెనాలి నారా కోడూరు రోడ్లను నిర్మించనున్నారు.

పల్నాడు జిల్లాకు..

పల్నాడు జిల్లాలో తక్షణ మరమ్మతుల కోసం భారీగా నిధులు కేటాయించారు. ఏడు నియోజకవర్గాల్లో జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతుల నిమిత్తం 4.86 కోట్లు కేటాయించారు. అత్యధికంగా గురజాల నియోజకవర్గానికి 1.12 కోట్లు కేటాయించగా, చిలకలూరిపేటకు 93.7 లక్షలు, నరసరావుపేటకు 89.6 లక్షలు, మాచర్లకు 85 కోట్లు చొప్పున కేటాయించారు. వీటితోపాటు అత్యవసర మరమ్మతుల కింద 567.8 కిలో మీటర్ల రహదారుల్లో 82 పనులకు మొత్తం 22.44 కోట్లు కేటాయించారు. వీటిలో 72 మరమ్మతులకుగానూ 3.44 కోట్లు, 371 కి.మీ మేర ప్యాచ్‌ వర్కుల నిమిత్తం 11.57 కోట్లు, రోడ్డు అంచుల ప్యాచ్‌ వర్కుల కోసం 94.5 లక్షలు, కంపచెట్ల తొలగింపు కోసం 91.7 లక్షలు, వర్షపు నీటికి దెబ్బతిన్న రోడ్లకు 4.15 కోట్లు కేటాయించారు. ప్రధానంగా రొంపిచర్ల, చిలకలూరిపేట, మాచర్ల, దాచేపల్లి, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ, శావల్యాపురం, కారెంపూడి, గురజాల, పిడుగురాళ్ల, క్రోసూరులలో ఈ రోడ్లకు మరమ్మతులు చేయించనున్నారు.

బాపట్ల జిల్లాకు రూ. 72.5 కోట్లు

బాపట్ల జిల్లాలో బాపట్ల- రేపల్లె సబ్‌ డివిజన్లో 217 కి.మీ మేర రాష్ట్ర రహదారులు, 599.6 కి.మీ మేర జిల్లా ప్రధాన రహదారులకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. జిల్లా రహదారు మరమ్మతులకు సంబంధించి కోటిన్నర రూపాయలతో ఇప్పటికే పనులు పూర్తి చేశారు. కేంద్ర రహదారుల నిధుల కింద రూ. 36.31 కోట్లతో 60.35 కి.మీ మేర రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులు రూ. 8.91 కోట్లతో 5.97 కి.మీ మేర రోడ్లు నిర్మిస్తున్నారు. వాటితోపాటు రేపల్లె- నిజాంపట్నం మధ్య రెండు చోట్ల పైప్‌ కల్వర్టులు, గుంటూరు చీరాల మధ్య మరో కల్వర్టు నిర్మిస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో కట్రపాడు- శంకరపురం రోడ్డు, రావినూతల రోడ్డు, రేపల్లె- నిజాంపట్నం రోడ్డు, పర్చూరు వంకాయలపాడు- కొడవవలివారిపాలెం రోడ్డు, చీరాల- దగ్గుబాడు రోడ్డు, గర్నెపూడి- తిక్కరాజుపాలెం, నూతలపాడు- కారంచేడు, కారంచేడు- ఇంకొల్లు, పందిళ్లపళ్లి- కడవకుదురు, వేటపాలెం, సంతరావూరు, జాండ్రపేట- వేటపాలెం, పర్చూరు- ఇంకొల్లు, వేమూరులో వెల్లటూరు- జువ్వలపాలెం, గాజుల్లంక- చింతమోటు, చినపులివర్రు- రావికంపాడు, తెనాలి- వెల్లటూరు, బాపట్లలో కాజీపాలెం- బుద్దం మొత్తం 22 పనులకు రూ. 1.15కోట్లు కేటాయించారు. వీటితోపాటు 14 చోట్ల జంగిల్‌ క్లియరెన్సు పనుల నిమిత్తం 71.28 లక్షలు కేటాయించారు.

Updated Date - Nov 26 , 2024 | 01:48 AM