Share News

పోలీసుశాఖలో నిఘా విభాగం విధులు కీలకం

ABN , Publish Date - Nov 17 , 2024 | 01:34 AM

పోలీసుశాఖలో నిఘా విభాగం విధులు కీలకమని ఎస్పీ తుషార్‌ డూడి తెలిపారు.

పోలీసుశాఖలో నిఘా విభాగం విధులు కీలకం
నిఘా విభాగం సిబ్బందితో సమావేశమై మాట్లాడుతున్న ఎస్పీ తుషార్‌ డూడి

బాపట్ల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : పోలీసుశాఖలో నిఘా విభాగం విధులు కీలకమని ఎస్పీ తుషార్‌ డూడి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిఘా విభాగం పోలీసులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నిఘా విభాగం వారు నిబద్దతతో సమర్దవంతంగా విధులు నిర్వహించాలన్నారు. ముందస్తు సమాచారాన్ని వేగవంతంగా సేకరించాలన్నారు. పోలీసు శాఖ సమర్దవంతంగా విధులు నిర్వహించేందుకు, అసాంఘిక కార్యకలాపాలు కట్టడి చేయటానికి ముందస్తు సమాచారం వేగవంతంగా సేకరించటం కీలకమని చెప్పారు. నిత్యం ప్రజలతో మమేకమై గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు, చెడునడత కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. అట్టివారు ఏదైన నేరానికి పాల్పడే అవకాశం ఉందని గ్రహిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల అమ్మకం, వినియోగం వంటి వాటిమీద ప్రత్యేకంగా నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో ఎక్కడైన పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు గురించిన ముందస్తు సమాచారం ఉన్నతాధికారులకు అందించాలన్నారు. ఎవరైనా విధులలో నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించినా, నిగూడ రహస్య సమాచారం సేకరించటంలో అలసత్వం వహించిన శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌బి సీఐ నారాయణ, ఎస్‌బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 01:34 AM