రోహిణి.. ప్రచండం
ABN , Publish Date - May 31 , 2024 | 12:56 AM
గుంటూరులో ఎండ గజగజలాడించింది. బాపట్లలో భగభగమంటూ మండింది. పల్నాడు ప్రచండంగా మారింది. గురువారం గుంటూరు.. 44.5, బాపట్ల.. 43.8, నరసరావుపేట.. 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోహిణికార్తెలో ప్రచండ భానుడు విశ్వరూపం చూపాడు. మేలో ఈసారి భయపడేంత స్ధాయిలో తీవ్రమైన ఎండలు లేవని ఆనందపడుతున్న ప్రజలకు ఉగ్ర రూపం చూపాడు.
తీక్షణమైన ఎండ.. తీవ్రమైన వడగాలులు
అనధికార కరెంటు కోతలు.. అల్లాడిన జనం
నేడు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరిక
గుంటూరు(మెడికల్), పిడుగురాళ్ల, బాపట్ల, మే 30: గుంటూరులో ఎండ గజగజలాడించింది. బాపట్లలో భగభగమంటూ మండింది. పల్నాడు ప్రచండంగా మారింది. గురువారం గుంటూరు.. 44.5, బాపట్ల.. 43.8, నరసరావుపేట.. 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోహిణికార్తెలో ప్రచండ భానుడు విశ్వరూపం చూపాడు. మేలో ఈసారి భయపడేంత స్ధాయిలో తీవ్రమైన ఎండలు లేవని ఆనందపడుతున్న ప్రజలకు ఉగ్ర రూపం చూపాడు. మూడు రోజులుగా వేసవి తీవ్రత పెరుగుతుండగా గురువారం నిప్పులు కురిపించినట్లు ఎండ తీవ్రత పెరిగింది. మే నెల ముగిసిపోతున్న తరుణంలో ఇప్పటి వరకు పెద్దగా ఎండల తీవ్రత లేదని ఊపిరిపీల్చుకుంటున్న ప్రజలకు గురువారం సూర్యుడు పగలే చుక్కలు చూపించాడు. రోహిణికార్తె అంటేనే రోళ్లు పగిలిపోతాయనే సామెత నిజమేనిపించేలా భానుడు భగభగమంటూ మండిపోయాడు. ఎండకు తీవ్రమైన వడ గాల్పులలు తోడయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకే ఎండ సుర్రుమనిపించింది. ఉదయం నుంచే ఉష్ణోగ్రత పెరగడంలో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడ్డారు. ఏసీలు సైతం మొరాయించాయి. ఫ్యాన్‌గాలి వేడిగా ఉండటంతో ఇళ్లలో ఉన్న వారు కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రి పది గంటల వరకు కూడా వెచ్చటి గాలులతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ ఏడాది ఇంత ఎక్కువ ఉష్ణోగ్రత ఇప్పుడే నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులు ఎండతీవ్రతకు తాళలేక అల్లాడిపోయారు. జిల్లా కేంద్రాలైన గుంటూరు, నరసరావుపేట, బాపట్లలో ప్రధాన రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన కూడళ్లల్లో మధ్యాహ్నం ఎండ తీవ్రత ధాటికి జన సంచారం పలుచబడింది. ఈ రోహిణి కార్తెలో తొలిసారిగా గురువారం రికార్డుస్థాయిలో ఎండ తీవ్రత నమోదైంది. గుంటూరు నగరంలో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ ఏడాది మేలో ఇప్పటి వరకు నమోదైన అత ్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. ఎండ వేడిమికి తోడు వాతావరణంలో తేమ పెరగడంతో ఉక్కపోత వాతావరణం నెలకొంది. వడగాడ్పులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతుండగా గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గుంటూరులోని పలు ప్రాంతాల్లో విద్యుత సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. చెమటలు ధారలు కట్టాయి. ముఖ్యంగా పసి పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. గుంటూరు నగరంలో రాత్రుళ్లు కూడా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం కూడా జిల్లాలోని అన్ని మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగిన రక్షణ పద్ధతులు పాటించాలని, సాధ్యమైనంత వరకు నీడ పట్టున ఉండేందుకు ప్రయత్నించాలని వాతావరణ శాఖ గురువారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది.