Share News

నిధులున్నా.. నిర్లక్ష్యం

ABN , Publish Date - Nov 23 , 2024 | 01:09 AM

మురుగునీటి కాలుష్యాన్ని నివారించేందుకు మున్సిపల్‌ పట్టణాల్లో చేపట్టాల్సిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల విషయంలో నిర్లక్ష్యం తాండవిస్తోంది.

నిధులున్నా.. నిర్లక్ష్యం
మురుగునీటి శుద్ధి ప్లాంట్‌

రూ.151.33 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

స్థలాలు కేటాయించని మున్సిపల్‌ అధికారులు

ప్రజారోగ్య పనులనూ పట్టించుకోని పురపాలకలు

జాతీయ హరిత న్యాయస్థానం ఆదేశాలు బేఖాతర్‌

మురుగు.. మున్సిపాల్టీల్లో ప్రధాన సమస్యగా ఉంది. నీటిని, ఆహార పదార్థాలను, గాలిని కలుషితం చేసేస్తోంది. ప్రజల ఆరోగ్యాలను గుల్లచేస్తోంది. పట్టణాల్లో ఉత్పత్తి అయి పల్లెలను, పొలాలను పాడుచేస్తోంది. పర్యావరణానికి హానికరంగా ఉంటోంది. మురుగునీటితో సాగు వల్ల ఆహార పదార్థాలు విషతుల్యమవుతున్నాయి. ఇలాంటి మురుగును బాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మున్సిపాల్టీల వారీగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్‌టీపీ) నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్‌టీపీల నిర్మాణాలకు టెండర్లు పిలిచారు కానీ పనులు చేపట్టలేదు. మున్సిపాల్టీల్లో వీటి నిర్మాణానికి స్థలాలు చూపడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వీడటంలేదు. ఎస్‌టీపీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.151.33 కోట్లు నిధులు మంజూరు చేయగా.. స్థలాలు అప్పగిస్తే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నా పురపాలక సంఘాల్లో ఈ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవనే చెప్పాలి. కూటమి ప్రభుత్వంలోనైనా మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణ పనులు పట్టాలు ఎక్కాలని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

పనులు చేపట్టకుండానే..

ప్రజారోగ్యం దృష్ట్యా ఎస్‌టీపీలను వేగవంతంగా నిర్మించాల్సిన మున్సిపల్‌ అధికారులు పనులు చేపట్టకుండానే చేపట్టినట్టుగా జాతీయ హరిత న్యాయస్థానాన్ని మభ్యపెడుతున్నారు. ఎస్‌టీపీల నిర్మాణం విషయంతో జాతీయ హరిత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. టెండర్లు నిర్వహించి చేతులు దులుపుకున్న అధికారులు పనులు ప్రారంభించినట్లుగా ట్రిబ్యునల్‌ను మభ్య పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హరిత న్యాయస్థానం ఓ కమిటీని నియమించి ఎస్‌టీపీల నిర్మాణంపై అధికారులు ఇస్తున్న నివేదికలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)

మురుగునీటి కాలుష్యాన్ని నివారించేందుకు మున్సిపల్‌ పట్టణాల్లో చేపట్టాల్సిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల విషయంలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణ పనులు స్థలాల కేటాయింపు దశలోనే ఉన్నాయి. మున్సిపల్‌ పట్టణాల్లో నిత్యం ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు డ్రెయిన్ల ద్వారా శివార్లకు ప్రవహిస్తోంది. ఈ నీటి వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. మురుగు నీరు చెరువులు, వాగుల్లోకి చేరుతుండటంతో ఆ నీరు కూడా కలుషితం అవుతోంది. పంటల సాగుకు ఈ నీటిని వినియోగిస్తుండటంతో ఆహార ఉత్పత్తులు విషతుల్యమవుతున్నాయి. నీటి కలుషితాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని రక్షించేందుకు మురుగునీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించాలని మున్సిపాల్టీలను జాతీయ హరిత న్యాయస్థానం ఆదేశించింది. మున్సిపాల్టీల నుంచి ప్రతి రోజు వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసిన అనంతరమే ఆ నీటిని బయటకు విడుదల చేయాలని సూచించింది. అయితే ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఎస్‌టీపీల నిర్మాణం విషయంలో పుర పాలకులు సరైన రీతిలో స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. ఎస్‌టీపీలు ప్రతిపాదించిన ఏ ఒక్క మున్సిపాల్టీలో కూడా నిర్మాణ పనులు ప్రారంభించలేదు. టెండర్లు నిర్వహించి నెలలు గడుస్తున్నా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వం ఎస్‌టీపీల నిర్మాణాన్ని గాలికొదిలేసింది. జాతీయ గ్రీన్‌ట్రీబ్యునల్‌ మొట్టికాయలు వేసినా గత వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. మున్సిపాల్టీలలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు స్థలాలను కేటాయించలేదు. పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం ఎస్‌టీపీల నిర్మాణంపై దృష్టి సారించింది. ఈ పరిస్థితుల్లో ప్రజారోగ్యం దృష్ట్యా ఎస్‌టీపీల పనులు వేగవంతంగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను అధికారులు గుర్తించాలి. స్థలాలను కేటాయించి మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి.

తెనాలిలోనే పనులు..

గుంటూరు జిల్లాలో ఒకటి, పల్నాడు జిల్లాలో మూడు, బాపట్ల జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపి నిధులు విడుదుల చేసింది. అయితే కొన్ని మున్సిపాలిటీల్లో అమృత్‌ పథకానికి ఈ ఎస్‌టీపీలను అనుసంధానం చేశారు. అయితే మూడు జిల్లాల్లో ఆరు మున్సిపాలిటీలకు ఒక్క గుంటూరు జిల్లా తెనాలిలో మాత్రమే మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ పనులు జరుగుతున్నాయి. తెనాలిలో అమృత్‌ పథకం కింద రూ.31.50 కోట్లతో పనులు చేస్తున్నారు. వినుకొండ మున్సిపాల్టీలో ముట్లకుంటకాలనీ ప్రాంతంలో 5.70 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ నిర్మాణానికి స్థలం కేటాయించారు. ఈ స్థలంలో కంప చెట్ట తొలగింపు పనులు చేపట్టారు. వినుకొండలో చెక్కవాగు నిర్మల స్కూల్‌ ప్రాంతంలో 5.50 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మరో ప్లాంట్‌ నిర్మాణానికి స్థలం కేటాయించలేదు. వీటికి రూ.18.60 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పిడుగురాళ్లలో రూ.18.42 కోట్లతో 5.90 ఎంఎల్‌డీ సామర్థ్యంతో హనుమందిర్‌ రోడ్డులో, 5.20 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎస్సీ శ్మశానవాటిక సమీపంలో మరో ప్లాంట్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో ప్లాంట్ల నిర్మాణానికి స్థలం కేటాయించలేదు. ఈ రెండు మున్సిపాల్టీలలో నాలుగు ఎస్‌టీపీల నిర్మాణ పనులు టెండర్‌ను శ్రీకృష్ణ ఎన్‌వీరో ఇంజనీర్స్‌ విజయవాడు సంస్థ దక్కించుకుంది. చిలకలూరిపేట మున్సిపాల్టీలో అమృత్‌ పథకంలో భాగంగా రూ.69.53 కోట్లతో చేపట్టిన ఎస్‌టీపీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. బాపట్ల జిల్లా బాపట్ల మున్సిపాల్టీలో రూ.4.98 కోట్లతో 3 ఎంఎల్‌డీ సామర్థ్యం ఉన్న ఎస్‌టీపీని కంపోస్టు యార్డు ప్రాంతంలో నిర్మించాలి. ఇందుకు సంబంధించి స్థలం కేటాయింపు జరగలేదు. చీరాల మున్సిపాల్టీలో రూ.8.30 కోట్లతో 5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఐకేనగర్‌ దండుబాట ప్రాంతంలో నిర్మించాలని స్థలాన్ని గుర్తించారు. అయితే స్థల కేటాయింపు మధ్యలోనే నిలిచిపోయింది. ఈ రెండు మున్సిపాల్టీలలో ఎస్‌టీపీల టెండర్‌ను సింగన్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌ హైదరాబాద్‌ సంస్థ దక్కించుకుంది.

Updated Date - Nov 23 , 2024 | 01:09 AM