Share News

YSRCP: విదేశాలకు జగన్.. వైసీపీలో సంక్షోభం తప్పదా

ABN , Publish Date - Aug 31 , 2024 | 02:59 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వైసీపీని సెప్టెంబర్ సంక్షోభం కలవర పెడుతోందట. వరుసగా పార్టీకి సీనియర్ నేతలు గుడ్‌ బై చెప్పేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్‌ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకాలం జగన్‌ను నెత్తిన పెట్టుకున్న ..

YSRCP: విదేశాలకు జగన్.. వైసీపీలో సంక్షోభం తప్పదా
YS Jagan

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆగష్టు సంక్షోభం ఎంతో ఫేమస్. తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు ఆగష్టులోనే రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ఆగష్టు సంక్షోభం వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వైసీపీని సెప్టెంబర్ సంక్షోభం కలవర పెడుతోందట. వరుసగా పార్టీకి సీనియర్ నేతలు గుడ్‌ బై చెప్పేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్‌ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకాలం జగన్‌ను నెత్తిన పెట్టుకున్న నాయకులే ప్రస్తుతం తిరుగుబాటు చేయడం వైసీపీ శ్రేణులను తెగ ఇబ్బంది పెడుతోందట. సీనియర్ నేతలు పార్టీని వీడుతుంటే స్థానిక నాయకత్వం సైతం అయోమయంలో కొట్టుమిట్టాడుతోందనే చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ అధ్యక్షులు జగన్ సైతం తిరుగుబాటు నాయకుల గురించి ఏమి మాట్లాడకపోవడం, వలసల నివారణకు చర్యలు తీసుకోకపోవడంతో భవిష్యత్తులో పార్టీ మనుగడపై వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడుతుండగా.. కరుడుగట్టిన వైసీపీ నాయకులుగా పేరొందిన వ్యక్తులు పార్టీలో కీలక నేతలపై బహిరంగ విమర్శలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

RK Roja: వైసీపీని వీడుతారన్న వార్తలపై తొలిసారిగా స్పందించిన రోజా..


విదేశాలకు జగన్..

వైసీపీలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సెప్టెంబర్ సంక్షోభం ఖాయంగానే కనిపిస్తోందనే అంతర్గత చర్చ పార్టీలో జరుగుతుందట. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీని వీడగా..తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మరికొంతమంది రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్న వారిని కొందరు నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా.. ఫలితం కనిపించడం లేదట. మరోవైపు వైసీపీ అధినేత జగన్ సెప్టెంబర్3వ తేదీన విదేశాలకు వెళ్లనున్నారు. 20 రోజులకు పైగా ఆయన యూకేలో ఉంటారు. జగన్ విదేశీ పర్యటన సమయంలోనే పార్టీ మారేందుకు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీలో గత కొద్దిరోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నా.. అధినేత నోరు మెదకపోవడంపై పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సెప్టెంబర్‌లో కేవలం పార్టీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు పార్టీ మారతారా.. లేదంటే వైసీపీలో చీలిక తెస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. జగన్ నిర్ణయాలు, వ్యవహరశైలి నచ్చని నాయకులంతా కలిసి వైసీపీలో చీలక తేచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంటే.. ఇదంత ఈజీ కాదనే చర్చ మరోవైపు సాగుతోంది.

Chandrababu: సీఎస్, డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశం


సంక్షోభం తప్పదా..!

సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సొంత నేతలకే మింగుడుపడటం లేదట. ఐదేళ్లపాటు జగన్ వెంట నడిచిన నాయకులు అధికారం పోయిన తరువాత జగన్‌పై విమర్శలు మొదలుపెట్టారు. జగన్ అసలు స్వరూపాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని, అధినేత జగన్‌‌ను విపరీతంగా అభిమానించిన వారు సైతం ప్రస్తుతం జగన్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తే జగన్‌పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్న విషయం స్పష్టమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నంతకాలం ఆ పార్టీని వైసీపీ ఎదుర్కొనే అవకాశాలు తక్కువనే చర్చ నడుస్తోంది. తమ పరిపాలనతో ఓవైపు కూటమి ప్రజల మద్దతు కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ రోజురోజుకు బలహీనపడుతోంది. ఈక్రమంలో రాబోయే రోజుల్లో ఏపీలో పొలిటికల్ స్పేస్ ఉంటుందనే అంచనాతో వైసీపీలో కొందరు నేతలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.


YS Sharmila: జగన్‌ బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 31 , 2024 | 02:59 PM