Share News

ఆరోగ్య కార్యదర్శుల సంఘానికి కొత్త నాయకత్వం

ABN , Publish Date - Dec 12 , 2024 | 03:25 AM

ఆరోగ్యశాఖ పరిపాలనా విభాగంలో పదవులను రెవెన్యూ అధికారులకు కాకుండా తమకే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ ఆరోగ్య కార్యదర్శుల సంఘం (గ్రూప్‌-1 అధికారులు) నిర్ణయించింది.

ఆరోగ్య కార్యదర్శుల సంఘానికి కొత్త నాయకత్వం

అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖ పరిపాలనా విభాగంలో పదవులను రెవెన్యూ అధికారులకు కాకుండా తమకే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని ఏపీ ఆరోగ్య కార్యదర్శుల సంఘం (గ్రూప్‌-1 అధికారులు) నిర్ణయించింది. బుధవారం సంఘం సమావేశాన్ని డీఎంఈ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులుగా వాసుదేవరావు, కె.అప్పారావులను ఎంపిక చేశారు. అనంతరం అసోసియేషన్‌ అధ్యక్షునిగా బీ.వీ.రావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్‌ రెడ్డిని ఎన్నుకున్నారు. అనంతరం సంఘం సభ్యులు పలు అంశాలపై చర్చించారు. గ్రూప్‌-1 పరీక్షలో మెరిట్‌లో వచ్చిన తమకు ఏళ్ల తరబడి పదోన్నతులు లేకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఆరోగ్యశాఖలో కీలకంగా వ్యవహరించే తమను కాదని రెవెన్యూ అధికారులను అడ్మినిస్ట్రేటర్లుగా నియమించడంపై కొంతమంది ప్రశ్నించారు. పదోన్నతులతో సమస్యతో పాటు ఆడ్మినిస్ట్రేటర్లుగా తమనే నియమించాలన్న దానిపైనా ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.

Updated Date - Dec 12 , 2024 | 03:25 AM