IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాలకు వర్ష సూచన
ABN , Publish Date - Oct 13 , 2024 | 06:32 PM
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యం దిశగా కదిలి ఆదివారం మరింత విస్తరించింది.
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యం దిశగా కదిలి ఆదివారం మరింత విస్తరించింది.
అక్టోబర్ 14న దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ సంస్థ (IMD) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ఏపీ దక్షిణ కోస్తా తీరం వైపు పయనించే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 17 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది.
వివిధ రాష్ట్రాల్లో..
ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, అసోం, మేఘాలయ, అరుణాచల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర సహా ఉత్తర బంగాళాఖాతం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండు రోజుల్లో నైరుతి మరింత బలహీనపడుతుందని వివరించింది. ఇక దక్షిణ భారతదేశ ద్వీపకల్పం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అక్టోబరు 14 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వివరించింది. మరో 48 గంటల్లో ఇది మరింతగా బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
Read Latest Telangana News and National News