Share News

AP News: బంగాళాఖాతంలో వాయుగుండం.. 48 గంటల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..

ABN , Publish Date - Sep 09 , 2024 | 08:55 AM

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP News: బంగాళాఖాతంలో వాయుగుండం.. 48 గంటల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..

విశాఖ: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి ఉత్తర ఒడిస్సాలో పూరి - పశ్చిమ బెంగాల్‌ ప్రాంతంలోని డేగ అల మధ్య వాయుగుండం తీరం దాటనుంది. వాయుగుండం కారణంగా గత రెండు రోజులుగా ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవనున్నాయి. కోస్తాలో తీరం వెంబడి 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కళింగపట్నం, భీమిలి, విశాఖ, గంగవరం కాకినాడ రేవుల్లో మూడవ ప్రమాదక హెచ్చరిక జారీ చేయనున్నారు.


ఈ నెల12 వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని అధికారులు సూచించారు. అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా వాగులు, వంకలు, కాలువలు చెరువులు పూడికలు, కనీసం మరమ్మతులు చేయని పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్లలో చెరువులు, వాగులు కబ్జాకు గురయ్యాయి. నిన్నటి నుంచే విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొండవాలు ప్రాంతాలు, ముంపు గ్రామాల్లో తిరిగి ప్రజలను విశాఖ నగర పోలీస్ కమిషనర్ బాగ్చి అప్రమత్తం చేస్తున్నారు. నగరంలో ముందస్తుగా ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు అంతా అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే వరదల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా తీవ్రంగా నష్టపోయింది. అక్కడి నష్టాన్ని పూడ్చాలంటే ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం దాతల నుంచి విరాళాలను అర్థించింది. వరద నష్టం అంచనా పెద్ద మొత్తంలో ఉంది. ఒకవైపు విరాళాలు వస్తున్నా కూడా నష్టాన్ని పూడ్చే స్థాయిలో మాత్రం రావడం లేదు.


అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు..

ఇక భారీ వర్షాల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ వెల్లడించారు. ఈ విషయంలో ప్రైవేట్ పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థను రద్దు చేశామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం, అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం, నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేశామని తెలిపారు. 08924 226599, 08924 2228888, 9491998293, 7075356563 ఫోన్లు అందుబాటులో ఉంచామన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 08:55 AM