Share News

AP High Court: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. గిరిజన ప్రాంతాల్లో వైద్యసౌకర్యాలపై అభ్యంతరం

ABN , Publish Date - Jan 31 , 2024 | 09:51 PM

తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్య రంగంలో గణనీయమైన మార్పులొచ్చాయని, గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులొచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. గిరిజన ప్రాంతాల్లో వైద్యసౌకర్యాలపై సీరియస్ అవుతూ.. ప్రభుత్వం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తి చేసింది.

AP High Court: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. గిరిజన ప్రాంతాల్లో వైద్యసౌకర్యాలపై అభ్యంతరం

తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్య రంగంలో గణనీయమైన మార్పులొచ్చాయని, గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులొచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. గిరిజన ప్రాంతాల్లో వైద్యసౌకర్యాలపై సీరియస్ అవుతూ.. ప్రభుత్వం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తి చేసింది. అస్వస్థతకు గురైన గిరిజనులను డోలీల ద్వారా తరలిస్తుండటంపై.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్. రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఆదిమ కాలం నాటి పరిస్థితులను తలపిస్తోందని ఘాటుగా రియాక్ట్ అయ్యింది. సకాలంలో వైద్యం అందక గిరిజనలు మృతి చెందుతున్నట్లు నిత్యం పత్రికల్లో కథనాలు చూస్తూనే ఉన్నామంటూ మండిపడ్డ ధర్మాసనం.. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు పార్వతీపురం, విశాఖపట్నం, విజయనగరం ‘డీఎంహెచ్‌ఓ’లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.


కాగా.. గిరిజన ప్రాంతాల్లో కనీస వైద్య సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది ఎలిశెట్టి సోమరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టగా.. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పించని పరిస్థితి రాష్ట్రంలో ఉందని.. గిరిజన ప్రాంతాల్లో వసతులు లేక ప్రజలు పాట్లు పడుతున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్. ప్రణతి కోర్టుకి తెలిపారు. దీంతో.. అంబులెన్స్ కూడా లేక మృతదేహాన్ని మోటార్ సైకిల్ తరలించిన అంశంపై హైకోర్టు తారాస్థాయిలో మండిపడింది. అప్పుడు ఆరోగ్యశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. గిరిజనలు కొండపై నివాసం ఉంటున్నారని, రోడ్డు సౌకర్యం ఉన్న చోట ఫీడర్ అంబులెన్స్ ద్వారా రోగులను తరలిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. వాదనలు విన్న అనంతరం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 21వ తేదీ హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - Jan 31 , 2024 | 09:51 PM