Share News

High Court: పరిటాల రవి హత్య కేసులో.. ఐదుగురు దోషులకు బెయిల్‌

ABN , Publish Date - Dec 19 , 2024 | 04:27 AM

మాజీ మంత్రి దివంగత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు దోషులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

High Court: పరిటాల రవి హత్య కేసులో.. ఐదుగురు దోషులకు బెయిల్‌

మాజీ మంత్రి దివంగత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు దోషులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దోషులు పి.నారాయణ రెడ్డి(ఏ3), రేఖమయ్య(ఏ4), బజన రంగనాయకులు(ఏ5), వడ్డే కొండ(ఏ6), ఓబిరెడ్డి(ఏ8)లకు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. అనంతపురం జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సంతృప్తి మేరకు రూ.25 వేలతో ఒక్కొక్కరూ రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు పిటిషనర్లు సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ముందు హాజరయ్యేలా చూడాలని మేజిస్ట్రేట్‌కు సూచించింది. న్యాయాధికారి విధించిన షరతును ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు చేస్తామని తెలిపింది. క్షమాభిక్ష కోసం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. వారు దరఖాస్తులను 4 వారాల్లో పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ టి.మల్లికార్జునరావుతో కూడిన ధర్మాసనం ఈ నెల 13న ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురంలో 2005 జనవరి 24న పరిటాల హత్యకు గురయ్యారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులు. ఏ-1గా ఉన్న మొద్దు శీను, ఏ-2 మద్దెలచెరువు సూరి, మరో నిందితుడు తగరకుంట కొండారెడ్డి.. కేసు విచారణ సమయంలో హత్యకు గురయ్యారు. ఒక నిందితుడు అప్రూవర్‌గా మారగా.. మరో నలుగురుని అనంతపురం కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మిగిలిన 8 మందికి జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 2011 ఆగస్టులో తీర్పు ఇచ్చింది. అదే ఏడాది ఈ తీర్పుపై వారు హైకోర్టులో అప్పీల్‌ వేశారు. తాజాగా వాటికే అనుబంధ పిటిషన్లు వేసి, శిక్ష అమలును సస్పెండ్‌ చేసి బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. విచారణ జరిపిన ధర్మాసనం.. వారికి ట్రయల్‌ కోర్టు విధించిన శిక్ష అమలును నిలుపుదల చేస్తూ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Updated Date - Dec 19 , 2024 | 04:28 AM