Share News

High Court: తిరుమలలో అడ్డగోలు నిర్మాణాలను నియంత్రించాలి

ABN , Publish Date - Dec 19 , 2024 | 04:25 AM

తిరుమలలో ఇష్టారీతిన జరుపుతున్న నిర్మాణాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

High Court: తిరుమలలో అడ్డగోలు నిర్మాణాలను నియంత్రించాలి

తిరుపతిలో ఒబెరాయ్‌ హోటళ్ల నిర్మాణంపై పూర్తి వివరాలు సమర్పించండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఇష్టారీతిన జరుపుతున్న నిర్మాణాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. తిరుమల కొండ పాదాల చెంత తిరుపతిలో ఎలాంటి అనుమతులూ లేకుండా ఒబెరాయ్‌ గ్రూపు 5 స్టార్‌ హోటళ్ల నిర్మాణం చేస్తోందంటూ దాఖలైన పిల్‌పై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న పర్యాటక శాఖ ప్రత్యేక సీఎస్‌, టీటీడీ ఈవో, తుడా వైస్‌ చైర్మన్‌లకు నోటీసులు జారీ చేసింది. ఒబెరాయ్‌ గ్రూప్‌ హోటల్స్‌ ఎండీ, అదే గ్రూపునకు చెందిన ముంతాజ్‌ హోటల్స్‌, ట్రైడెంట్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లకు కూడా నోటీసులిచ్చింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పనులను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి జిల్లా తిరుపతి మండలం పేరూరు గ్రామం పరిధిలో ఒబెరాయ్‌ గ్రూప్‌ హోటళ్లను నిర్మించేందుకు 2021 నవంబరులో అప్పటి జగన్‌ ప్రభుత్వం జారీచేసిన జీవో 24ని రద్దు చేయాలని కోరుతూ తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్‌, ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద స్వామీజీ, మరొకరు వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్‌ బుధవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తిరుమలలో వసతి గృహాలు తప్ప హోటళ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదంటూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, అయితే అందుకు విరుద్ధంగా తిరుమల కొండ పాదాల చెంత ఒబెరాయ్‌ గ్రూప్‌ హోటళ్ల నిర్మాణం చేపడుతోందని తెలిపారు. తిరుపతిలో హోటళ్ల నిర్మాణానికి భూకేటాయింపులు చేస్తూ పర్యాటక శాఖ జీవో ఇచ్చిందని పర్యాటక శాఖ తరఫున జీపీ వై.బాలాజీ తెలిపారు. హోటళ్ల నిర్మాణం జరుపుతున్న ప్రదేశం తిరుమల పరిధిలోకి రాదని టీటీడీ తరఫు స్టాండింగ్‌ కౌన్సిల్‌ వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 04:25 AM