High Court: హోంగార్డులకు పచ్చజెండా
ABN , Publish Date - Dec 19 , 2024 | 05:32 AM
పోలీసు విభాగంలో పనిచేస్తున్న హోంగార్డుల కానిస్టేబుల్ కల హైకోర్టు తీర్పుతో నెరవేరబోతోంది. కానిస్టేబుల్ పోస్టుల నియామకంలో హోంగార్డుల రిజర్వేషన్ సమస్యకు బుధవారం హైకోర్టు తీర్పుతో పరిష్కారం లభించింది.
నెరవేరనున్న కానిస్టేబుల్ కల.. తొలగిన న్యాయపరమైన చిక్కులు
ప్రారంభమైన హాల్ టికెట్ల జారీ.. 30 నుంచి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు
6,100 పోస్టుల భర్తీకి రెడీ.. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగమూ ఇవ్వని జగన్
అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): పోలీసు విభాగంలో పనిచేస్తున్న హోంగార్డుల కానిస్టేబుల్ కల హైకోర్టు తీర్పుతో నెరవేరబోతోంది. కానిస్టేబుల్ పోస్టుల నియామకంలో హోంగార్డుల రిజర్వేషన్ సమస్యకు బుధవారం హైకోర్టు తీర్పుతో పరిష్కారం లభించింది. దీంతో ఏడాదిన్నరకు పైగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను వడివడిగా ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డు సిద్ధమైంది. జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. దీంతో నిరుద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిని గమనించిన ప్రభుత్వం 2022, నవంబరు చివరి వారంలో 6,100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్‌లైన్ ద్వారా 4.58లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 2023, జనవరి చివరి వారంలో ప్రిలిమ్స్ నిర్వహించి 95,208 మంది అర్హత సాధించినట్లు బోర్డు ప్రకటించింది. తొలి దశలో ప్రాథమిక రాతపరీక్ష పూర్తయ్యాక రెండో దశలో దేహధారుఢ్య (పీఈటీ), శారీరక సామర్థ్య పరీక్షలు (పీఎంటీ) నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలు మార్చి 13నుంచి 20 దాకా నిర్వహిస్తామని హాల్‌టికెట్లు జారీ చేసింది. అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఈ పరీక్షలను వాయిదా వేశారు. ఆ ఎన్నికల తర్వాత ప్రక్రియ కొనసాగాల్సి ఉన్నప్పటికీ.. జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
గత సర్కారు నిర్లక్ష్యం
కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సివిల్ హోంగార్డులకు 15ు, ఏపీఎస్పీ హోంగార్డులకు 25ు రిజర్వేషన్ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 1100 హోంగార్డులకే కేటాయించాలి. అయితే, ప్రాథమిక పరీక్ష 3వేల మంది హోంగార్డులు రాయగా ఫలితాల తర్వాత 382 మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో పలువురు హోంగార్డులు తమకు కటాఫ్ తగ్గించాలని, అందరినీ అర్హులుగా ప్రకటించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభ్యర్థులు తమగోడు ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకున్నారు. న్యాయపరమైన చిక్కులు అధిగమించి ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు 2నెలల క్రితం డీజీపీ, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌ను ఆదేశించడంతో ఎట్టకేలకు మార్గం సుగమమైంది.
ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు
ఓవైపు కోర్టు తీర్పుకోసం ఎదురు చూస్తూనే మరోవైపు అర్హులైన 95,208 మందికి దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలకు నియామక బోర్డు రెండోదశ దరఖాస్తులు ఆహ్వానించింది. వారికి బుధవారం మధ్యాహ్నం 3గంటల నుంచి హాల్‌టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ నెల 29వరకు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో రెండోదశ పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హత సాధించిన వారికి తుది విడత రాత పరీక్ష నిర్వహించి ఎంపికైన 6,100 మందిని ఉద్యోగాల్లో నియమిస్తారు.