Share News

గంజాయిపై ఉక్కుపాదం

ABN , Publish Date - Jun 18 , 2024 | 06:09 AM

రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్క్యూట్‌ హౌస్‌లో జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, జాయింట్‌ సీపీ ఫకీరప్పతోపాటు నగరంలోని పైస్థాయి పోలీస్‌ అధికారులతో సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు.

గంజాయిపై ఉక్కుపాదం

  • నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

  • 3 నెలల్లో పూర్తిస్థాయిలో అడ్డుకట్ట: హోంమంత్రి

విశాఖపట్నం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్క్యూట్‌ హౌస్‌లో జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, జాయింట్‌ సీపీ ఫకీరప్పతోపాటు నగరంలోని పైస్థాయి పోలీస్‌ అధికారులతో సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిత మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ గంజాయి, మాదక ద్రవ్యాలకు రాజధానిగా మారిపోయిందన్నారు. యువతకు గంజాయి సులభంగా దొరుకుతోందని, ఆ మత్తులో వారు దోపిడీలు, చైన్‌స్నాచింగ్‌లు, ఈవ్‌టీజింగ్‌ వంటి నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించానన్నారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే నగరంలోని పోలీస్‌ అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశానన్నారు. చెక్‌పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులకు స్పష్టంగా చెప్పానన్నారు. టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటుచేసి నగరంలో రాత్రిపూట గుంపుగా ఉండే యువతను, బస్టాపుల్లో కనిపించే ఆకతాయిలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించాలని, సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. గంజాయి కేసుల్లో పట్టుబడేవారు ఏ పార్టీవారైనా, చివరకు టీడీపీ వారైనా సరే క్షమించేది లేదని హెచ్చరించారు. గంజాయి డీ అడిక్షన్‌ సెంటర్లు పెంచడంతోపాటు, కేజీహెచ్‌లో ప్రత్యేకంగా ఒక బ్లాక్‌ను కేటాయించే ప్రతిపాదన ఉందన్నారు. మూడు నెలల్లో గంజాయికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఇకపై దిశ పోలీస్‌ స్టేషన్ల పేరును మహిళా పోలీస్‌ స్టేషన్‌గా మార్చేస్తామని హోంమంత్రి అన్నారు.

ఇంకా జగన్‌పై ప్రేమ ఉంటే వెళ్లిపోండి..

గత ఐదేళ్లు కొంతమంది పోలీసులు వైసీపీ సేవలోనే తరించారని, టీడీపీ నేతలను వేధించడంలోనే మునిగితేలారని మంత్రి అనిత అన్నారు. తాము పోలీసులకు అన్ని సదుపాయాలూ కల్పిస్తామని, పనితీరు కూడా అదేస్థాయిలో ఉండాల్సిందేనని చెప్పారు. ఇప్పటికైనా ప్రజా పోలీసింగ్‌ చేయాలని, అలాకాకుండా ఎవరికైనా ఇంకా జగన్‌పై ప్రేమ ఉంటే తక్షణం లూప్‌లైన్‌లోకి వెళ్లిపోవాలని హోం మంత్రి స్పష్టం చేశారు. పోలీస్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. పోర్టులోకి 2,500 కిలోల హెరాయిన్‌తో కంటైనర్‌ రాక కేసుపై కూడా దృష్టిపెడతామన్నారు. కాగా, రాష్ట్రంలో గంజాయి రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా వారంరోజుల్లో టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు హోంమంత్రి చెప్పారు.

Updated Date - Jun 18 , 2024 | 06:09 AM