Share News

CM Chandrababu: చంద్రబాబు పిలుపునకు భారీ స్పందన.. వెల్లువెత్తుతున్న విరాళాలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 09:31 AM

వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. వరదల కారణంగా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. ఎంతో మంది ఇల్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

CM Chandrababu: చంద్రబాబు పిలుపునకు భారీ స్పందన.. వెల్లువెత్తుతున్న విరాళాలు

అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. వరదల కారణంగా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. ఎంతో మంది ఇల్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా నిధుల కొరత కారణంగా పూర్తి స్థాయిలో సాయం అందించలేకపోతోంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు విరాళాలను అర్థించారు. చేతనైన సాయం చేయాలని కోరారు. చంద్రబాబు పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది. ఏపీ దుస్థితికి చలించి పోయిన వారంతా విరాళాలు ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.


ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, ఎన్నారైలు పలువురు, ఏపీ ఉద్యోగుల సంఘం తమ విరాళాలను ప్రకటించింది. ఇంకా పలువురు ప్రముఖులు తమ విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. తాజాగా సీఎం సహాయనిధికి కాకినాడ సీపోర్ట్స్ సీఎండీ కె.వి.రావు రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు. అలాగే ఏఎంగ్రీన్-గ్రీన్‍కో సంస్థ రూ.5 కోట్లు ఇచ్చింది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు కోటిన్నర ఇచ్చాయి. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. సీఎం సహాయనిధికి మోహిత్ మినరల్స్ సంస్థ రూ.50 లక్షలు ఇచ్చింది. కల్యాణ్ ఆక్వా అధినేత రాజేంద్రబాబు రూ.10 లక్షలు ఇచ్చారు.


శ్రీకాకుళం జిల్లా మహిళా సమాఖ్య సీఎం సహాయనిధికి రూ.10 లక్షలు ఇచ్చింది. కోటపాటి జనార్దన్ రావు రూ.10 లక్షలు ఇచ్చారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ10 లక్షల విరాళం ఇచ్చారు. భూమా-శోభానాగిరెడ్డి ట్రస్ట్ తరఫున విరాళం అందించడం జరిగింది. అలాగే విజయవాడలో వెయ్యి కుటుంబాలకు అఖిలప్రియ నిత్యావసరాలు పంపిణీ చేశారు. వరద బాధితుల సహాయార్థం మంత్రి లోకేష్‌కు సైతం పెద్ద ఎత్తున దాతలు విరాళాలు అందజేస్తున్నారు. భూపతిరాజు సీతాదేవి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు రూ.10 లక్షల విరాళం.. ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అమ్మన్న రూ.5లక్షల విరాళం అందజేశారు. విజయవాడ హైటెక్ ప్రింట్ సిస్టమ్స్ యజమాని ఎస్‌వీఎస్ శెట్టి రూ.1,71,272 విరాళం అందజేశారు. మండవ వెంకట సూర్యప్రతాప్, నాగశ్వేత దంపతులు రూ.50వేలు, కోనేరు అనిల్ కుమార్ రూ.50వేలు అందజేశారు.

Updated Date - Sep 07 , 2024 | 09:31 AM