Share News

Bopparaju Venkateswarlu: నెలకు రూ.54 ఇస్తే నిర్వహణ ఎలా?

ABN , Publish Date - Aug 26 , 2024 | 12:44 PM

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి సమావేశాలు జరిపామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Bopparaju Venkateswarlu: నెలకు రూ.54 ఇస్తే నిర్వహణ ఎలా?

అమరావతి: కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి సమావేశాలు జరిపామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 26 జిల్లా‌ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఉద్యోగులందరితో సమస్యలపై చర్చించామని బొప్పరాజు తెలిపారు. ఐఆర్, 12వ పీఆర్సీలో గతంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతూ తీర్మానం చేశామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని తెలిపారు. ఒక్క రీపోలింగ్ లేకుండా అత్యధిక పోలింగ్ శాతం జరిగేలా చేశామన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటం సంతోషమన్నారు. గత ప్రభుత్వం ఆదేశాలను ఉద్యోగులు కేవలం అమలు చేశారని బొప్పరాజు తెలిపారు.


ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని.. వాటి గురించి చర్చ చేసే అవకాశం లేకుండా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారన్నారు. ప్రతి రోజూ టార్గెట్ పెట్టి ఇబ్బందులు పెట్టారన్నారు. ఫ్రీ హోల్డ్ ప్రక్రియ తప్పుల తడక అని ఈ ప్రభుత్వం అభిప్రాయపడిందని బొప్పరాజు తెలిపారు. ఇందులో ఉద్యోగుల పై నిందలు మోపడం సరి కాదని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా..‌వారి ఆదేశాలను ఉద్యోగులు పాటిస్తారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని బొప్పరాజు పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ సదస్సులను విజయవంతం చేస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో అనేక విభాగాల పనులను చేయిస్తున్నారన్నారు. మన రికార్డు లు అప్ డేట్ చేయడానికి రెవెన్యూ సదస్సులు చాలా ఉపయోగ పడతాయని బొప్పరాజు పేర్కొన్నారు. భూ సమస్యలను ఛాలెంజ్‌గా తీసుకుని పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగి ఇందులో భాగస్వామ్యం కావాలని.. మన శాఖను పటిష్ఠం చేయాలన్నారు. పురాతన శాఖ రెవెన్యూ శాఖలో అనేక రికార్డులు ఉన్నాయన్నారు.


ఆ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ నేడు ఉందా? అని ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాలలో నిర్మాణంలో ఉన్న కార్యాలయాలు కాంట్రాక్టర్‌ల‌ వద్దే ఉన్నాయన్నారు. అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ఈ రికార్డుల భద్రతకు రికార్డు అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలన్నారు. పదేళ్లుగా అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అసలు రెవెన్యూ కార్యాలయాలకు ఒక వాచ్ మెన్ కూడా లేరన్నారు. వందలాది రికార్డులు ఉండే కార్యాలయాలకు భద్రత అవసరం‌ లేదా? అని బొప్పరాజు ప్రశ్నించారు. ఉద్యోగులు చేసే పనికి, కార్యాలయం నిర్వహణకు ఖర్చులు ఉంటాయని.. నెలకు 54 రూపాయలు ఇస్తే ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. వీవీపీలు వస్తే లక్షల రూపాయలు బడ్జెట్ అవుతుందని.. అదంతా ఎక్కడి నుంచి తేవాలని నిలదీశారు. సిసి కెమెరాలు పెట్టాలని‌ ఆదేశాలు ఇచ్చారని.. నిధులు మాత్రం ఇవ్వలేదన్నారు. మదనపల్లి ఫైళ్లు దహనం కేసులో ఎవరు దోషులో‌ఇంకా తేలలేదని.. ఉద్యోగులంతా భయపడిపోతున్నారన్నారు. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారని.. ‌విచారణ పూర్తి అయ్యాక వాస్తవాలు చెప్పాలన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడుని.. మీడియా కూడా ఆలోచన చేసి నిర్ధారణ అయ్యాక వార్తలు వేయాలని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 26 , 2024 | 01:56 PM