ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా పనిచేయాలి: సత్యకుమార్
ABN , Publish Date - Oct 25 , 2024 | 05:05 AM
రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటం అందరి తక్షణ కర్తవ్యమని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సృష్టం చేశారు.
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటం అందరి తక్షణ కర్తవ్యమని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సృష్టం చేశారు. గుర్లలో డయేరియా ప్రబలడంపై ఆరుగురువైద్య నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఆయన గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మానవ వనరులైన ప్రజలు అనారోగ్యం పాలుకాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రైవేట్ వైద్య సిబ్బందిపై ఉందన్నారు.
గుర్లలో డయేరియా కేసులు నమోదైన తేదీలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది చేపట్టిన చర్యలు, వ్యాధిని అదుపులోకి తెచ్చిన వైనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఏపీఎంఎ్‌సఐడీసీపై కూడా మంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్పత్రుల అవసరాల మేర మందులు, సర్జికల్ పనిముట్ల సరఫరా కాకపోవడంతో నెలకొన్న ఆందోళనకు త్వరలో తెరపడనుందన్నారు. గత ప్రభుత్వం రూ.900 కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిందన్నారు.